Share News

Kumaram Bheem Asifabad : యథేచ్ఛగా నాళాల కబ్జా

ABN , Publish Date - May 26 , 2024 | 10:42 PM

కాగజ్‌నగర్‌ టౌన్‌, మే 26: కాగజ్‌నగర్‌లో కబ్జాదా రులు డ్రెయినీజీలను సైతం వదలడం లేదు. పట్టించుకోవాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తుండటంతో కోట్ల విలువైన స్థలం కబ్జాకోరుల హస్తగతమవుతోంది.

 Kumaram Bheem Asifabad : యథేచ్ఛగా నాళాల కబ్జా

- చోద్యం చూస్తున్న బల్దియా అధికారులు

- అంతా ‘మాములే’

- విలువైన స్థలం కబ్జాకోరుల హస్తగతం

కాగజ్‌నగర్‌ టౌన్‌, మే 26: కాగజ్‌నగర్‌లో కబ్జాదా రులు డ్రెయినీజీలను సైతం వదలడం లేదు. పట్టించుకోవాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తుండటంతో కోట్ల విలువైన స్థలం కబ్జాకోరుల హస్తగతమవుతోంది. కాగజ్‌నగర్‌ ఎల్లాగౌడ్‌తోట సమీపంలోని మురికి కాల్వను కొంతమంది ఆక్రమించారు. పట్టణ ప్రధాన కాల్వ కబ్జాకు గురవుతుండటంతో అంతా హైరానపడుతున్నారు. భారీ వర్షాలు కురిస్తే కాల్వల్లో వరద పెరిగి ముంపునకు గురయ్యే అవకాశాలున్నాయి. పెద్ద కాల్వలోనే అక్రమణలు వెలుస్తుంటడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎల్లాగౌడ్‌తోటలోని పలుప్లాట్లకు వేలం ప్రక్రి యను నిర్వహించి రెండు దశాబ్దాలు గడుస్తోంది. మళ్లీ ఇప్పుడు ఆ భూములు తమవే అంటూ కొంత మంది తప్పుడు రికార్డులు సృష్టిస్తున్నారు. ఇన్నాళ్లు లేని రికార్డులు ఇప్పుడెలా వచ్చాయని..? వీటికి సృష్టికర్త ఎవరు అనే కోణంలో ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటే తప్పా ఈ కబ్జాల పర్వానికి అడ్డుకట్ట పడదని పట్టణవాసులు పేర్కొంటున్నారు. ప్రధానకాల్వపై నిర్మాణాలకు అనుమతులు ఎవరిస్తున్నారు? అనే అంశంపై అధికారులు విచారించి నిగ్గుతేల్చాలని లోతట్టు ప్రాంతాల వాసులు డిమాండు చేస్తున్నారు. కాగజ్‌నగర్‌ ఎన్టీఆర్‌ చౌరస్తా నుంచి పెద్ద మురికి కాల్వ టెంపుల్‌కాంప్లెక్స్‌ మీదుగా ఎల్లాగౌడ్‌ తోట, మార్కెట్‌, రైల్వే పట్టాల వరకు అనుసంధానించారు. కొంత మేర బాక్స్‌ టైపు డ్రైయిన్‌ నిర్మించారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటకీ పెద్దకాల్వ సమీపంలో తమ భూములున్నాయని ఏకంగా కబ్జా చేసి భవనాలు నిర్మిస్తున్నారు. ఎల్లాగౌడ్‌తోట ప్రాంతంలోని భూమిని రెండు దశాబ్దాల కిందటే మున్సిపల్‌శాఖ ఆధ్వర్యంలో వేలం పాటలో ప్లాట్లను విక్రయించారు. ప్రస్తుతం ప్రతీ యేట ఒక కొత్త కబ్జా జరుగుతోంది. ఇంత జరుగుతున్నా కూడా మున్సిపల్‌ అధికారులు ఏం చేస్తున్నారన్నది అంతుచిక్కని ప్రశ్న. చిన్నపాటి టేలా వేస్తేనే మున్సిపల్‌ అధికారులు,సిబ్బంది అఘమేఘాల మీదగా తొలగిస్తుండగా, ప్రస్తుతం ఇంత పెద్ద దందా నడుస్తున్నా.. ఎందుకు వీటిపై చర్య తీసుకోవడం లేదన్నది పట్టణంలో హాట్‌టాపిక్‌గా మారింది. వచ్చేది వర్షాకాలం కావడం ఒక్కసారిగా వర్షపునీరు వస్తే పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది.

అధికారులు స్పందిస్తేనే..

కాగజ్‌నగర్‌ బల్దియా అధికారులు కబ్జాలపై గట్టి నిఘా పెట్టకపోవటంతోనే కబ్జాదారులు రెచ్చిపోతున్నట్టు ఆరోపణలున్నాయి. వీరి ఆగడాలకు చెక్‌ పెట్టకుంటే రానున్న రోజుల్లో మరిన్ని అక్రమ నిర్మాణాలు వెలిసే అవకాశాలు ఉన్నాయి. వర్షాకాలంలో భారీ వర్షాలు కురిస్తే ఏర్పడే సమస్యలకంటే ముందస్తుగానే స్పందించి ఆక్రమణలను తొలగించాలని పట్టణవాసులు డిమాండు చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం భారీవర్షాలు కురియగా రాష్ట్ర వ్యాప్తంగా డ్రెయినేజీలను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను తొలగించాలని అప్పటి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ ఆక్రమణదారులకు చెక్‌పెడుతుందా..? లేక వత్తాసు పలుకుతుందా..? అన్నది చూడాలి. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి అక్రమ కట్టడాలపై గట్టి నిఘా పెట్టి తప్పుడు రికార్డులు సృష్టిస్తున్న వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆయావార్డుల ప్రజలు డిమాండు చేస్తున్నారు.

చర్యలు తీసుకుంటాం..

- అంజయ్య, కమిషనర్‌, కాగజ్‌నగర్‌

మురికి కాల్వలపై అక్రమ నిర్మాణలు చేపడితే ఊరుకునేది లేదు. వాటిని తొలగిస్తాం. త్వరలోనే స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటాం.

Updated Date - May 26 , 2024 | 10:42 PM