Kumaram Bheem Asifabad: పోలింగ్‌కు సర్వం సిద్ధం
ABN , Publish Date - May 12 , 2024 | 11:17 PM
ఆసిఫాబాద్/కాగజ్‌నగర్, మే 12: నెలరోజుల పాటు సాగిన ప్రచార పర్వంలో నువ్వా.? నేనా..! అన్నట్టు తలపడిన అభ్యర్థుల తలరాతను సోమవారం ఈవీఎంలో ఓటర్లు నిక్షిప్తం చేయనున్నారు. ఆదిలాబాద్ లోక్‌సభ స్థానానికి జిల్లాలోని సిర్పూరు(001), ఆసిఫాబాద్(05) నియోజకవర్గాలలో నేడు పోలింగ్ జరుగనుంది.

- జిల్లా వ్యాప్తంగా 676 కేంద్రాల్లో నేడు పోలింగ్
- ఉదయం 7నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్
- ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
- ప్రతి రెండు గంటలకు పోలింగ్ శాతాల వెల్లడి
- గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
ఆసిఫాబాద్/కాగజ్‌నగర్, మే 12: నెలరోజుల పాటు సాగిన ప్రచార పర్వంలో నువ్వా.? నేనా..! అన్నట్టు తలపడిన అభ్యర్థుల తలరాతను సోమవారం ఈవీఎంలో ఓటర్లు నిక్షిప్తం చేయనున్నారు. ఆదిలాబాద్ లోక్‌సభ స్థానానికి జిల్లాలోని సిర్పూరు(001), ఆసిఫాబాద్(05) నియోజకవర్గాలలో నేడు పోలింగ్ జరుగనుంది. ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో ఓటర్ల తుది నిర్ణయాన్ని నిక్షిప్తం చేయటం కోసం మొత్తం 676పోలింగ్ కేంద్రాలను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. ఇందులో ఆసిఫాబాద్ నియోజకవర్గానికి సంబంధించి పది మండలాల పరిధిలో మొత్తం 356పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, సిర్పూరు నియోజకవర్గం పరిధిలో 320పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. జిల్లాలోని సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల పరిధిలోని కాగజ్‌నగర్ పట్టణంలోని సెయింట్‌క్లారెట్ పాఠశాలలో, ఆసిఫాబాద్ పట్టణంలోని పీటీజీ బాలుర గురుకుల పాఠశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికలలో 20శాతం రిజర్వుడ్ సిబ్బందితో కలుపుకొని మొత్తం 3244మందిని నియమించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఎస్పీ సురేష్ కుమార్ పరిశీలించారు. సిర్పూర్ నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా అదనపుకలెక్టర్ దీపక్ తివారి, ఆసిఫాబాద్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా అదనపు కలెక్టర్ దాసరి వేణును నియమించారు. ఆదివారం ఎన్నికల సిబ్బంది విధుల్లో చేరి బ్యాలెట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్‌లతో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. జిల్లాలో మొత్తం 91రూట్లను ఏర్పాటు చేసి 91మందిని రూట్ అధికారులుగా నియమించారు. జిల్లాలో 91మంది మైక్రో అబ్జర్వర్లు, 91మంది సెక్టోరియల్ అధికారులను నియమించారు. లోక్‌సభ ఎన్నికలకు జిల్లాలో 10మహిళ పోలింగ్‌కేంద్రాలు, రెండు దివ్యాంగ పోలింగ్‌కేంద్రాలు, యువతకు రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, సీసీకెమెరాలకు అనుసంధానం చేశారు. ప్రతిరూట్‌లో వెళ్లె వాహనానికి జీపీఎస్ సిస్టంను అమర్చారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 55 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మక ప్రాంతాలుగా, 24పోలింగ్ స్టేషన్లు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా, 61పోలింగ్ కేంద్రాలు ఆన్‌లైన్ సౌకర్యంలేనివిగా గుర్తించిన నేపథ్యంలో ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ గట్టి బందోబస్తు చర్యలను చేపడుతోంది. ఇందుకు గాను సీఆర్‌పీఎఫ్, పారామిలటరీ బలగాలతో పాటు రాష్ట్ర ప్రత్యేకపోలీసు విభాగం సిబ్బంది, పోలీసులు, హోంగార్డులు, అటవీశాఖ సిబ్బందిని ఎన్నికల విధుల్లో నియమించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎలాంటి అసౌకర్యాలకు కలుగకుండా గాలి, వెలుతురు ఉండేలా చర్యలు చేపట్టారు. అలాగే క్యూలైన్లలో ఓటర్లు ఇబ్బంది పడకుండా ఉండటం కోసం పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీటి వసతితోపాటు మూత్రశాలలు ఏర్పాటు చేశారు. ఉదయం 7గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత ఓటింగ్ ప్రారంభిస్తారు. సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఈ క్రమంలో ప్రతి రెండు గంటలకు ఒకసారి అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి పోలింగ్ శాతాన్ని ప్రకటించే ఏర్పాట్లు చేశారు. ఓటింగ్ తర్వాత ఈవీఎంలను సురక్షితంగా స్ట్రాంగ్ రూంలకు తరలించడానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
జిల్లాలో 4,56,309 మంది ఓటర్లు..
ఆసిఫాబాద్ జిల్లాలోని రెండునియోజకవర్గాల పరిధిలో మొత్తం 4,56,309మంది ఓటర్లు ఆదిలాబాద్ లోక్‌సభ స్థానంలో బరిలో ఉన్న 12మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ధేశించబోతున్నారు. ఇందులో 2,28,971మహిళలు, 2,27,310మంది పురుషులు, ఇతరులు 28మంది ఉన్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మొత్తం 2,27,208మంది ఓటర్లు ఉండగా ఇందులో 1,14,404మంది మహిళా ఓటర్లు ఉండగా, పురుషులు 1,12,788, ఇతరులు 16మంది ఉన్నారు. అలాగే సిర్పూరు నియోజకవర్గం పరిధిలో మొత్తం 2,29,101మంది ఓటర్లు వారి భవిష్యత్తును నిర్ణయించబోతున్నారు. ఇందులో 1,14,567మంది మహిళలు, 1,14,522మంది పురుషులు, 12మంది ఇతర ఓటర్లు ఉన్నారు.
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించరాదు..
జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే
ఎన్నికల విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించరాదని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. ఆదివారం కాగజ్‌నగర డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడారు. ఎన్నికల అధికారులు ఈవీఎంలను చెక్ చేసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. దూరప్రాంతాల్లోని కేంద్రాలకు సిబ్బంది సామగ్రితో వెంటనే బయలు దేరాలని ఆదేశించారు. ఎన్నికల విధులు నిర్వహించేందుకు బయలుదేరుతున్న సిబ్బందిని స్వయంగా కలెక్టర దగ్గరుండి పంపించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఆర్డీవో సురేష్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి ప్రమోద్, తహసీల్దార్ కిరణ్ సిబ్బంది ఉన్నారు.
శాంతి యుతవాతావరణం ఎన్నికలు నిర్వహించాలి..
ఎస్పీ సురేష్ కుమార్
ఎన్నికలు ప్రశాంతవాతావరణంలో నిర్వహించాలని ఎస్పీ సురేష్ కుమార్ అన్నారు. ఆదివారం కాగజ్‌నగర్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించి సిబ్బందితో ఆయన మాట్లాడారు. ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తేవాలన్నారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందించాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద తీసుకోవాలని సూచనలు, సలహాలను సిబ్బందికి వివరించారు. ఆయనవెంట డీఎస్పీ కరుణాకర్, సీఐ శంకరయ్య తదితరులున్నారు.