Share News

‘కడెం’ ఆయకట్టు సాగయ్యేనా...?

ABN , Publish Date - May 20 , 2024 | 10:24 PM

వానాకాలం వరిసాగు కోసం గూడెం లిఫ్ట్‌పై ఆధారపడ్డ ఆయకట్టు రైతుల పరిస్థితి సందిగ్ధంలో పడింది. గూడెం ఎత్తిపోతలకు నీరందించే కడెం రిజర్వాయర్‌ గతేడాది వర్షాకాలంలో వరద తాకిడికి గురై ప్రమాదకర పరిస్థితికి చేరుకొంది. కట్ట తెగిపోయే పరిస్థితి ఉండటంతో స్పందించిన ప్రభుత్వం ప్రాజెక్టులోని నీటిని దిగువకు వదిలి ఖాళీ చేసింది.

‘కడెం’ ఆయకట్టు  సాగయ్యేనా...?

మంచిర్యాల, మే 20 (ఆంధ్రజ్యోతి): వానాకాలం వరిసాగు కోసం గూడెం లిఫ్ట్‌పై ఆధారపడ్డ ఆయకట్టు రైతుల పరిస్థితి సందిగ్ధంలో పడింది. గూడెం ఎత్తిపోతలకు నీరందించే కడెం రిజర్వాయర్‌ గతేడాది వర్షాకాలంలో వరద తాకిడికి గురై ప్రమాదకర పరిస్థితికి చేరుకొంది. కట్ట తెగిపోయే పరిస్థితి ఉండటంతో స్పందించిన ప్రభుత్వం ప్రాజెక్టులోని నీటిని దిగువకు వదిలి ఖాళీ చేసింది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీరు డెడ్‌ స్టోరేజీకి చేరుకోగా, సాగునీటి విడుదలపై నీలినీడలు అలుముకున్నాయి.

40వేల ఎకరాలకు సాగునీరు...

నిర్మల్‌ జిల్లా కడెం రిజర్వాయర్‌ నుంచి జిల్లాలోని దండేపల్లి, లక్షెట్టి పేట, హాజీపూర్‌ మండలాల్లో సుమారు 40వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. కడెం ప్రాజెక్టు నీటిని గూడెం ఎత్తిపోతల పథకం పంపుహౌజ్‌ నుంచి దండేపల్లి మండలంలోని తానిమడుగు వరకు 12.01 కిలో మీటర్లు పొడవున పైప్‌లైన్‌ ద్వారా కడెం ప్రాజెక్టు 30వ డిస్ట్రిబ్యూటరీ వద్ద నిర్మించిన ప్రధాన కాలువలోకి నీటిని విడుదల చేస్తారు. అక్కడి నుంచి హాజీపూర్‌ మండలం 42వ డిస్ట్రిబ్యూటరీ ఆయకట్టు వరకు 40 ఎకరాల్లోని పంటలకు సాగునీరు అందించాల్సి ఉంది.

మరమ్మతులు పూర్తయ్యేనా...?

గతేడాది వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా వరద తాకిడికి ప్రాజెక్టు కొట్టుకుపోయే పరిస్థితి ఉండడంతో గేట్లు తెరిచి నీటిని దిగువన గోదావరిలోకి వదిలారు. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం డెడ్‌ స్టోరేజీకి చేరింది. ప్రాజెక్టు గరిష్ట మట్టం 700 ఫీట్లుకాగా, 7.603 టీఎంసీల నీరు నిల్వ సామర్థ్యం ఉంది. నీటిని వదిలివేయడంతో ప్రస్తుతం 2.507 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీరు అందుబాటులో ఉంటే తప్ప సాగునీరు లభించే పరిస్థితి ఉండదు. వర్షా కాలం సమీపిస్తున్నందున అప్రమత్తమైన ప్రభుత్వం ప్రాజెక్టుకు మరమ్మ తులు చేపడుతోంది. ప్రస్తుతం ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ఉన్నతాధికారుల సమక్షంలో ఆ శాఖ ప్రాజెక్టుకు అవసరమైన మరమ్మతులు చేపడుతోంది. మరమ్మతు పనులు ప్రారంభమైనప్పటికీ నిర్ణీత గడువులోగా పూర్తవుతా యా అనే సందేహాలు నెలకొన్నాయి. మరోవైపు వానాకాలం సాగుకోసం రైతులు సన్నద్ధమవుతున్నారు. నెల రోజుల్లో పూర్తిస్థాయిలో పంటలు సాగులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఆలోగా కడెం ప్రాజెక్టు పనులు పూర్తయి, ప్రాజెక్టులో నీరు నింపితేనే చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందే అవకాశాలున్నాయి. మరోవైపు మరమ్మతు పనులు సకాలంలో పూర్తి చేస్తామని ఇరిగేషన్‌ అధికారులు చెబుతున్నారు.

నీటి విడుదలలో తరుచూ అవరోధాలు...

గూడెం ఎత్తిపోతల పథకం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు సాగునీటి విడుదలలో తరుచూ అవరోధాలు ఎదురవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం కడెం ప్రాజెక్టు మరమ్మతుల కారణంగా నీటి విడుదలపై సందేహాలున్నాయి. గూడెం లిఫ్ట్‌లో సాంకేతిక లోపం కారణంగా సమ స్యలు ఏర్పడుతుండేవి. గూడెం లిఫ్ట్‌కు డీపీఆర్‌ ప్రకారం డీఐ పైపులు వేయాల్సి ఉండగా జీఆర్పీ పైపులైన్‌ వేశారు. లిఫ్ట్‌లోని రెండు మోటార్లు ఆన్‌ చేస్తే 290 క్యూసెక్కుల నీరు ఎత్తిపోసి మూడు మండలాల్లోని పంటలకు సరిపడా నీరందే అవకాశాలు ఉంటాయి. ఇలా రెండు మోటార్లు ఆన్‌చేసిన ప్రతిసారీ ప్రెజర్‌కు తట్టుకోలేక జీఆర్పీ పైపులు పగులుతుండేవి. లిఫ్ట్‌ ప్రారంభించిన తొమ్మిది సంవత్సరాల వ్యవధిలో 85 సార్లు పైపులు పగిలి పంటలకు నీరందని పరిస్థితులు తలెత్తాయి. రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో జీఆర్పీ తొలగించి డీఐ పైపులు వేయడంతో కొంత సమస్యకు పరిష్కారం లభించినా, సిబ్బంది కొరత కారణంగా పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరు అందడం లేదు. కడెం ప్రాజెక్టు ద్వారా గ్రావిటీ విధానంలో దండేపల్లి మండలం వరకు నీరు విడుదల కావలసి ఉంది. ఇందుకుగాను షెడ్యూల్‌ ప్రకారం నీటిని విడుదల చేయాలంటే ప్రాజెక్టు గేట్లు 6.5 ఫీట్ల మేర ఎత్తాలి. అప్పుడే నిర్ణీత ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందే అవకాశాలు ఉంటాయి. తపాల్‌పూర్‌ డిస్ట్రిబ్యూటర్‌ 19 నుంచి 28 వరకు దండేపల్లి మండలంలోని పంటలకు నీరు వస్తుంది. అయితే దీనికి భిన్నంగా కేవలం తపాల్‌పూర్‌ వరకు సరిపడా మాత్రమే 3.5 ఫీట్ల వరకు నీరు ఎత్తుతున్నట్లు సమాచా రం. దీంతో సీజన్‌లో నిర్ణీత 40వేల ఎకరాలకు నీరు అందడంలేదు. సిబ్బంది కొరత కారణంగా కొంతభాగం చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. కడెం ప్రధాన కాలువ వెంట నీటిని విడుదల చేయడానికి గతంలో 102 మంది సిబ్బంది ఉండేవారు. కడెం కెనాల్‌ డీ1 నుంచి 28 వరకు వీరు పనిచేసేవారు. దీంతో ఎప్పటికప్పుడు కెనాల్‌ గేట్లు తెరిచి, నీటిని విడుదల చేసేవారు. ప్రస్తుతం కేవలం 16 మంది మాత్రమే పని చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వీరిలో 12 మంది గ్యాంగ్‌మెన్‌, 4గురు వర్క్‌ ఇనెస్పెక్టర్లు ఉన్నారు. ఈ కారణంగా నీటిని సకాలంలో విడుదల చేయక పంటలు ఎండిపోయే పరిస్థితులు తలెత్తాయి. ఇప్పటికైనా పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించి, సకాలంలో నీరందించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

Updated Date - May 20 , 2024 | 10:24 PM