Share News

డీఎస్సీలో పెరిగిన పోస్టులు

ABN , Publish Date - Feb 29 , 2024 | 10:29 PM

ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నది. గత ప్రభుత్వ హయాంలో జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేసి 11062 పోస్టులతో గురువారం సీఎం రేవంత్‌ రెడ్డి విద్యా శాఖాధికారులు, మంత్రులతో కలిసి కొత్త నోటిఫికేషన్‌ను జారీ చేశారు.

డీఎస్సీలో పెరిగిన పోస్టులు

ఏసీసీ, ఫిబ్రవరి 29: ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నది. గత ప్రభుత్వ హయాంలో జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేసి 11062 పోస్టులతో గురువారం సీఎం రేవంత్‌ రెడ్డి విద్యా శాఖాధికారులు, మంత్రులతో కలిసి కొత్త నోటిఫికేషన్‌ను జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా పోస్టుల సంఖ్యను కూడా వెల్లడించారు. స్కూల్‌ అసిస్టెంట్‌, భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఎస్జీటీ పోస్టులతో పాటు కొత్తగా స్పెషల్‌ ఎడ్యూకేషన్‌ పోస్టులను భర్తీ చేస్తున్నారు. గతంలో డీఎస్సీ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మరల దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి ఏప్రిల్‌ 3వ తేదీ వరకు అవకాశం కల్పించారు. అలాగే దరఖాస్తు చేసుకునేందుకు వయసు మరో రెండేళ్లు అదనంగా పెంచారు. ఓసీ అభ్యర్థులకు 46 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 51 ఏళ్లు, దివ్యాంగులకు 56 ఏళ్ల వరకు అవకాశం కల్పించారు. గత ఏడాది జూలై 1వ తేదీ నాటికి కట్‌ ఆఫ్‌ డేట్‌ పెట్టారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా చేసుకోవాలి.

ఫ మంచిర్యాల జిల్లాలో స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 70, లాంగ్వేజ్‌ పండిట్‌ పోస్టులు 16, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులు 3, సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులు 176, మొత్తం 265 సాధారణ టీచర్‌ పోస్టులతో పాటు స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 5, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ సెకండరీ గ్రైడ్‌ టీచర్‌ పోస్టులు 18, రెండు విభాగాల్లో కలిపి 23 పోస్టులు, అన్ని టీచర్‌ పోస్టులు కలిపి జిల్లాలో 288 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుకు బీఈడీ, ఎస్‌జీటీ పోస్టుకు టీటీసీ, లాంగ్వేజ్‌ పండిట్‌ పోస్టులకు టీపీటీ, హెచ్‌పీటీ ఉత్తీర్ణత తోపాటు టెట్‌ క్వాలిఫై అయి ఉండాలి. స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టుల కు స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ ట్రైనింగ్‌ పూర్తిచేసి ఉండాలని నిబంధన విధించారు.

-రాష్ట్ర వ్యాప్తంగా 11 కేంద్రాల్లో నియామక పరీక్ష

నియామక పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా 11 కేంద్రాల ద్వారా కంప్యూటర్‌ బేస్డ్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్టు ద్వారా నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని పాత పది జిల్లా కేంద్రాలతోపాటు సంగారెడ్డిలో 1, మొత్తం 11 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. పరీక్ష తేదీలను త్వరలో ప్రకటించనున్నారు.

పెరగనున్న అభ్యర్థుల సంఖ్య..

గత ప్రభుత్వ హయాంలో జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులతోపాటు మరికొంత మంది అభ్యర్థులు పెరగను న్నారు. ఇందుకు కారణం దరఖాస్తు చేసుకునే వారి నిర్ధిష్ట వయస్సును 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచారు. అంతేగాకుండా ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు విద్యా బోధన చేసేందుకు కొత్తగా పోస్టులను ప్రవేశ పెట్టారు. దీంతో బీఈడీ, డీఈడీ స్పెషల్‌ ఎడ్యూకేషన్‌ కోర్సు చేసిన వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం లభించింది. పాత నోటిఫికేషన్‌లో ప్రకటించిన పోస్టులకు తోడు మరిన్ని పోస్టులను కలిపి నోటిఫికేషన్‌ జారీ చేయడంతో అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Feb 29 , 2024 | 10:29 PM