ముందస్తుగా ఇసుక డంప్‌లు
ABN , Publish Date - Jun 17 , 2024 | 10:46 PM
జిల్లాలో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. వర్షాకాలం సమీపిస్తున్నందున గోదావరి నదిలో నీరు చేరితే ఇసుక తవ్వకాలకు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. దీంతో ముందుగానే పెద్ద ఎత్తున ఇసుకను అక్రమంగా రహస్య ప్రాంతాలకు తరలించి నిల్వ చేస్తున్నారు. అదును చూసి టిప్పర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఎవరైనా సమాచారం ఇస్తే తప్ప అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.
మంచిర్యాల, జూన్ 17 (ఆంధ్రజ్యోతి):మంచిర్యాల జిల్లాలో ఇసుక దందా జోరుగా సాగుతోంది. రోజురోజుకూ విజృంభిస్తున్న ఇసుక మాఫి యా ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తూ యథేచ్ఛగా అక్రమ రవాణాకు పాల్పడుతోంది. నిత్యం వందలాది ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నా పట్టించుకునే వారే లేకుండాపోయారు. ఫిర్యాదులు వచ్చిన సందర్భంలో తప్ప మిగిలిన సమయాల్లో అధికారులు ఇసుక అక్రమ రవాణాపై దృష్టి సారించడం లేదనే విమర్శలున్నాయి. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గోదావరిని గుల్ల చేస్తున్న అక్రమార్కులు
ప్రజల అవసరాల నిమిత్తం గోదావరి నది నుంచి ఇసుకను తరలిం చేందుకు ప్రభుత్వపరంగా రీచ్‌లు ఏర్పాటు చేశారు. ఈ రీచ్‌ల ద్వారా అధికారికంగా ఇసుకను తరలిస్తుండగా, అనధికారికంగా అంతకంటే రెట్టింపు ఇసుక వివిధ ప్రాంతాలకు తరలిపోతోంది. ముఖ్యంగా జైపూర్, చెన్నూరు, కోటపల్లి మండలాల్లోని గోదావరిలో టీఎస్‌ఎండీసీ తరుపున ఇసుక రీచ్‌లు ఏర్పాటుచేశారు. ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన రీచ్‌ల నుంచి పర్మిట్లు ఉన్న లారీల ద్వారా ఇసుకను తరలించాలి. అయితే అం దుకు భిన్నంగా గోదావరి నుంచి పెద్ద మొత్తంలో అక్రమ మార్గంలో ఇసుకను తరలిస్తున్నారు. వేలాల గ్రామ శివారు గుట్టల ప్రాంతంలో అక్రమ ఇసుక రాశులు అధికంగా ఉన్నాయి. ఇక్కడి నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఓ టిప్పర్‌ను ఈ నెల 7న కిష్టాపూర్ సమీపంలో పోలీసులు పట్టుకొన్నారు. అయితే అధికారుల కళ్లు గప్పి నిత్యం పదుల సంఖ్యలో టిప్పర్లు ఇసుకను తరలిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.
పర్మిట్లు లేకుండానే రవాణా
గోదావరి నుంచి అక్రమ మార్గంలో ఇసుకను తరలిస్తున్న లారీలకు వే బిల్లులు, పర్మిట్లు లేకపోవడం గమనార్హం. ఒకే వే బిల్లుపై మూడు నాలుగు సార్లు ఇసుకను తరలిస్తున్నారన్న అభియోగాలు ఉన్నాయి. అయితే ఈ తతంగమంతా కొందరు అధికారుల కనుసన్నల్లోనే జరుగు తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గోదావరి నుంచి అక్రమంగా టిప్పర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్న వ్యాపారులు ఒక్కో ట్రిప్పును రూ.30వేల వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. జిల్లా నలుమూలల రవాణా చేయ డంతోపాటు ఇతర ప్రాంతాలకు ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటు న్నారు. దీంతో ప్రభుత్వ ఖజనాకు పెద్ద మొత్తంలో గండి పడుతుండగా, వినియోగదారులు అధిక ధర చెల్లించి ఇసుకను కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎక్స్‌కావేటర్ సహాయంతో గోదావరిలో ఇసుకను తవ్వి లారీల్లో నింపుతున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జైపూర్, చెన్నూరు, మండలాల్లోని ఇసుకను ఆ పార్టీ నాయకులే పెద్ద మొత్తంలో అక్రమంగా తరలించుకుపోయారనే అపవాదులు ఉండేవి. కాంగ్రెస్ హయాంలో కూడా అదే తరహాలో ఇసుక అక్రమంగా తరలిపోతుండటం గమనార్హం. రెవెన్యూ, మైనింగ్‌శాఖల అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదులు అందినప్పుడు తప్ప ఇసుక అక్రమ రవాణా వైపు దృష్టి మళ్లించడంలేదనే ఆరోపణలున్నాయి. టిప్పర్లు, ట్రాక్టర్లు పట్టుబడ్డ సందర్భంలో జరిమానాలతో సరిపెడుతుండటంతో అక్రమ రవాణా ఆగడం లేదు.
నిఘా ముమ్మరం చేశాం....మైనింగ్ ఏడీ జగన్మోహన్‌రెడ్డి
అక్రమ ఇసుక రవాణా జరుగకుండా నిఘా ముమ్మరం చేశాం. నిత్యం సిబ్బంది గోదావరి పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తూ టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా తరలించకుండా చర్యలు చేపడుతున్నాం. అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలకు గత నెలలో రూ.లక్ష వరకు జరిమానా కూడా విధించాం. ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం ఇస్తే తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకుంటాం.