Share News

గాలివాన బీభత్సం

ABN , Publish Date - Jun 02 , 2024 | 10:10 PM

జిల్లాలో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. సాయంత్రం 4 గంటలకు అరగంటపాటు ఉరు ములు, పిడుగులతో భారీ వర్షం కురిసింది. పెద్ద ఎత్తున గాలిదుమారం లేవడంతో చెట్లు కూలిపోగా, విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలిగింది.

గాలివాన బీభత్సం

మంచిర్యాల, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. సాయంత్రం 4 గంటలకు అరగంటపాటు ఉరు ములు, పిడుగులతో భారీ వర్షం కురిసింది. పెద్ద ఎత్తున గాలిదుమారం లేవడంతో చెట్లు కూలిపోగా, విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలిగింది. విద్యుత్‌ సిబ్బంది రాత్రి వరకు సరఫరాను పునరుద్దరించారు. పాత మంచిర్యాల ఎనిమిదివ వార్డులో ఆకుల తిరుపతి ఇంటి ఎదుట నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనంపై చెట్టు కూలడంతో బైక్‌ ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. చెన్నూరు- మంచిర్యాల జాతీయ రహదారిపై పెద్ద మొత్తంలో చెట్లు విరిగి పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

బెల్లంపల్లి: పట్టణంతో పాటు మండలంలో గాలి వాన బీభత్సం సృష్టించింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తీవ్ర ఎండ ఉండగా సాయంత్రం ఒక్కసారిగా వర్షం పడింది. మూడు గంటల పాటు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అక్కడక్కడ చెట్లు నేలకొరిగాయి. వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. పట్టణంలోని 2వ వార్డు అంగన్‌వాడీ కేంద్రం సమీపంలో చెట్టు విరిగి పడింది. బీఆర్‌ఎస్‌ యూత్‌ ఇన్‌చార్జ్‌ చెట్టును తొలగించారు.

చెన్నూరు: చెన్నూరులో భారీ ఈదురుగాలులు వీయడంతో చెన్నూరు మంచిర్యాల రహదారి కిష్టంపేట, ఎల్లక్కపేట గ్రామాల వద్ద రహదారిపై చెట్లు నేలకొరిగాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కిష్టంపేట గ్రామానికి చెందిన జూపాక సడవలి ఇంటి పైకప్పులు లేచి పోవడంతో వారు నిరాశ్రయులయ్యారు. అదే కాలనీకి చెందిన చింతపిండి రాజశేఖర్‌ ఇంటిపై చెట్లు విరిగిపడ్డాయి. ఎలాంటి నష్టం జరగలేదు. ఎస్టీ కాలనీలో విద్యుత్‌ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపో యింది. చెన్నూరు పట్టణం, మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగా లులు ఉరములు మెరుపులతో కూడిన వర్షం పడింది.

జన్నారం: మండలంలోని కలమడుగు గ్రామంలో గాలివానతో కూడిన వర్షం కురిసింది. దీంతో చికనోజు రాజన్న ఇంటిపైకప్పు రేకులు లేచిపో యాయి. దీంతో బాధిత కుటుంబాన్ని తహసీల్దార్‌ రాజమనోహర్‌రెడ్డి సందర్శించారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటామన్నారు.

కాసిపేట: గాలివాన బీభత్సానికి మల్కేపల్లి, రొట్టెపల్లి, సోనాపూర్‌, బుగ్గగూడెంలలో ఇండ్లలోని రేకులు లేచిపోయాయి. బుగ్గగూడెంకు చెం దిన సండ్ర రాజక్క ఇంటిపై చెట్టు విరిగి పడడంతో సిమెంటు రేకులు పగిలిపోయాయి. ఇంట్లోని సరుకులన్నీ వర్షానికి తడిసిపోయాయి. కొండాపూర్‌లో ఉత్తూరి సత్తయ్య ఇంటి వద్ద హోర్డింగ్‌ నేలకూలింది.

పిడుగు పడి 8 మేకలు మృతి

కన్నెపల్లి: నాయకునిపేట పంచాయతీలోని మొక్కంపల్లిలో ఆదివారం సాయంత్రం పిడుగు పడి 8 మేకలు మృతి చెందాయి. మేతకు వెల్లిన మేకలను తీసుకువస్తుండగా వర్షంతోపాటు పిడుగు పడడంతో గాదార్ల మహేష్‌కు చెందిన 1 మేక, గాదర్ల కొమురయ్య చెందిన 3 మేకలు, పెద్దల రాజయ్య, బైరి గట్టన్న, ఈరుపోసు, గట్టయ్యలకు చెందిన ఒక్కో మేక మృతిచెందాయి. మృతిచెందిన మేకల విలువ సుమారు రూ.1.20 లక్షలు ఉంటుందని, నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

భీమారం: వడగండ్ల వానలు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్‌ సదానందం తెలిపారు. గాలి వాన పడేటప్పుడు చెట్ల కింద, విద్యుత్‌ తీగల కింద ఉండవద్దని సూచించారు.

Updated Date - Jun 02 , 2024 | 10:10 PM