Share News

ఆసుపత్రి ‘స్ధాయి’ సేవలేవి

ABN , Publish Date - Feb 25 , 2024 | 10:38 PM

పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో 30 పడకల ఆసుపత్రి నుంచి వంద పడకలుగా అప్‌గ్రేడ్‌ చేశారు. ఇందుకు అనుకూలంగా భవనాన్ని, సామగ్రిని ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ వైద్యులు, సిబ్బందిని నియమించలేదు. నియోజకవర్గంలోని ప్రజలతో పాటు దూర ప్రాంతాల నుంచి వస్తున్న రోగులు అరకొర వైద్య సేవలతో ఇబ్బందులు పడుతున్నారు.

ఆసుపత్రి ‘స్ధాయి’ సేవలేవి

బెల్లంపల్లి, ఫిబ్రవరి 25: పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో 30 పడకల ఆసుపత్రి నుంచి వంద పడకలుగా అప్‌గ్రేడ్‌ చేశారు. ఇందుకు అనుకూలంగా భవనాన్ని, సామగ్రిని ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ వైద్యులు, సిబ్బందిని నియమించలేదు. నియోజకవర్గంలోని ప్రజలతో పాటు దూర ప్రాంతాల నుంచి వస్తున్న రోగులు అరకొర వైద్య సేవలతో ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రి స్థాయి పెరిగినా అందుకు తగిన వైద్య సిబ్బందిని నియమించడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.

-పేరుకే వంద పడకలు... మెరుగుపడని సేవలు

బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని 30 పడకల నుంచి 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ అయినప్పటికీ సేవలు మెరుగుపడలేదు. నియోజకవర్గ ప్రజలకు ఈ ఆసుపత్రే పెద్ద దిక్కుగా ఉంటుంది. రోజు ఈ ఆసుపత్రికి 200 నుంచి 300ల వరకు ఔట్‌ పేషెంట్‌లు వస్తున్నారు. అంతేకాకుండా ప్రసవాల కోసం గర్భిణీలు అడ్మిట్‌ అవుతారు. 30 పడకల వైద్య సిబ్బందితోనే ప్రస్తుతం సేవలందిస్తుండడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రిలో వైద్యుల కొరతతోపాటు పలు సమస్యలు వేధిస్తున్నాయి. రోగులతో వచ్చే సహాయకులకు ప్రత్యేక వార్డు లేకపోవడం, గైనిక్‌ వార్డు, పీడియాట్రిక్‌ వార్డులతో పాటు బ్లడ్‌ స్టోరేజీ కేంద్రం ఏర్పాటు చేయలేదు. ఆసుపత్రి వెనుక కాంపౌండ్‌ వాల్‌ లేకపోవడంతో పశువులు ఆసుపత్రి ఆవరణలోకి వస్తున్నాయి. జనరేటర్‌కు గది లేకపోవడం, ఆసు పత్రికి వచ్చిన రోగుల వాహనాలు నిలుపుకునేందుకు పార్కింగ్‌ షెడ్డు అందుబాటులో లేదు. పోస్టుమార్టం గది లేకపోవడం, మృతదేహాలను భద్రపరిచేందుకు ఫ్రీజర్లు కూడా లేవు.

-హోదా పెరిగినా... అరకొర సిబ్బంది...

ఆసుపత్రి స్థాయి హోదా పెరిగినా అందుకు తగినట్లుగా వైద్య సిబ్బందిని నియమించలేదు. ఫలితంగా స్ధాయికి తగిన సేవల్లో లోపం ఏర్పడుతుందనే విమర్శలు వస్తున్నాయి. ఆసుపత్రి హోదా పెరిగినప్పటి నుంచి వైద్యులను నియమించలేదు. ప్రస్తుతం వంద పడకల ఆసుపత్రిలో ఆరుగురు రెగ్యులర్‌ వైద్యులు, ముగ్గురు కాంట్రాక్టు వైద్యులు విధులు నిర్వహిస్తున్నారు. ఆసుపత్రి స్ధాయికి అనుకూలంగా పదుల సంఖ్యలో వైద్యులు అవసరం ఉన్నా భర్తీ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

ఖాళీలు ఇవే..

సివిల్‌ సర్జన్‌ స్పెషలిస్టులు 8, సివిల్‌ సర్జన్‌ఆర్‌ఎంవో 1, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ 13, డిప్యూటీ సివిల్‌సర్జన్‌ 3, డిప్యూటీ డెంటల్‌సర్జన్‌ 1, ఫిజియోథెరపి 1, హెడ్‌నర్సు 3, అడ్మినిస్ర్టేషన్‌ ఆఫీసర్‌ 1, హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ 1, స్టాఫ్‌నర్సు 16, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ 2, జూనియర్‌ అనలిస్టు 1, ఫార్మాసిస్టు గ్రేడ్‌ 1, ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ 1, సీనియర్‌ అసిస్టెంట్‌ 2, ల్యాబ్‌ టెక్నిషియన్‌ 3, రేడియోగ్రాఫర్‌ 1, డార్క్‌రూం అసిస్టెంట్‌ 1, ఏఎన్‌ఎం 2, థియేటర్‌ అసిస్టెంట్‌ 2, జూనియర్‌ అసిస్టెంట్‌ 1 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రతిపాద నలు పంపినా మంజూరు కాలేదు. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో ఆసుప త్రికి వచ్చే రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా హోదా పెరిగిన ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించేందుకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Feb 25 , 2024 | 10:38 PM