Share News

సెలవులొచ్చాయి...పిల్లలు జర జాగ్రత్త

ABN , Publish Date - May 03 , 2024 | 11:05 PM

పాఠశాలలకు వేసవి సెలవులు రావడంతో పిల్లలు ఆటాపాటల్లో మునిగిపోతున్నారు. తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. లేదంటే వేసవి వేడికి చిన్నారులు అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉన్నాయి.

సెలవులొచ్చాయి...పిల్లలు జర జాగ్రత్త

మంచిర్యాల కలెక్టరేట్‌, మే 3 : పాఠశాలలకు వేసవి సెలవులు రావడంతో పిల్లలు ఆటాపాటల్లో మునిగిపోతున్నారు. తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. లేదంటే వేసవి వేడికి చిన్నారులు అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉన్నాయి. వాతావరణం వేడిగా ఉండడంతో పిల్లల శరీర ఉష్ణోగ్రత పెరగడం, చెమటతో శరీరంలోని నీరు వేగంగా ఆవిరైపోవడం వల్ల వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. ఆటల్లో పడి చిన్నారులు ఆకలి దప్పులు మర్చిపోతారు. ఎండ వేడిని సైతం పట్టించుకోరు. అటువంటప్పుడు డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంటుంది.

-ఇలా జాగ్రత్తలు పాటించాలి

ఎండ తీవ్రత పెరుగుతున్న క్రమంలో పిల్లలు ఇంట్లోనే ఉండేలా చూసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే అనారోగ్యాల బారిన పడతారు. పెద్దల తోడు లేకుండా పిల్లలను బావుల్లోకి చెరువుల్లోకి ఈత కోసం పంపించవద్దు. బైక్‌ నడపడానికి ఇవ్వవద్దు. స్నేహితులతో కలిసి దూర ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతులు ఇవ్వవద్దు. ఉదయం 11 గంటలు దాటితే బయట తిరగనివ్వవద్దు. యాత్రలకు వెళ్లినప్పుడు స్వయంగా వండుకున్న ఆహారం తినడం మంచిది. పిల్లలు మొబైల్‌ ఫోన్‌లు, ట్యాబ్‌లు, కంప్యూటర్లకు అలవాటు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి. బయట ఆడుకోవడానికి ఉదయం, సాయంత్రం వేళల్లోనే అనుమతించాలి. పిల్లలకు ఆసక్తి ఉన్న డ్యాన్స్‌, ఇతర అంశాలపై శిక్షణ ఇప్పించాలి. రెండు పూటలా స్నానం చేయించి, తెల్లని లేతరంగులు దుస్తులు వేయాలి. ఇంట్లోనే క్యారం, చెస్‌ ఆటలు ఆడుకునేలా చూడాలి.

-ఆహార జాగ్రత్తలు తప్పనిసరి

వేసవిలో పిల్లలు ఆహారం తీసుకోవడానికి అంతగా ఆసక్తి చూపించరు. చిరుతిండ్లను ఎక్కువగా ఇష్టపడతారు. చల్లని పానియాలు తాగేందుకు అల్లరి చేస్తారు. పంచదార కలిపిన జ్యూస్‌లు, కంపెనీల కూల్‌ డ్రింక్‌లు, ఐస్‌క్రీంలు పిల్లలకు ఇవ్వడం వల్ల పిల్లల్లో డీహైడ్రేషన్‌ ప్రభావం పెరుగుతుంది. పిల్లల ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం ఎండ ఎక్కువ కాకముందే అల్పాహారం అందించాలి. బేకరీ, బయటి పదార్ధాలు కాకుండా ఇంట్లోనే అల్పాహారం చేసి అందించాలి. తృణధాన్యాల జావా, మజ్జిగ, పాలను తాగించాలి. అల్పాహారం అనంతరం నిమ్మరసం, ఖర్జూరాలు ఇస్తే జీర్ణశక్తి పెరుగుతుంది. మధ్యాహ్న భోజనంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారం అందించాలి. పాలకూర, ఉల్లి, ముల్లంగి, మామిడి, అనాస, కర్జూజా, పుచ్చకాయ, దోసకాయలు, మజ్జిగ, కొబ్బరి నీరు అందించాలి. ఉప్పు, నూనెలు ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలను తగ్గించాలి.

తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలి

సాయిసృజ, పిల్లల వైద్యురాలు

వేసవి కాలంలో పిల్లల విషయంలో తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఎండలు తీవ్రంగా ఉన్నందున బయట ఆడుకోవడానికి పంపించవద్దు. ఇంట్లో చేసిన ఆహార పదార్ధాలనే తినిపించాలి. బయటకు వెళ్తామని పిల్లలు మారం చేయకుండా ఇంట్లోనే చెస్‌, క్యారం తదితర ఆటలు పిల్లలతో కలిసి తల్లిదండ్రులు ఆడాలి. ఇంట్లో కూడా వేడి గాలులు రాకుండా చూసుకోవాలి. అనారోగ్యానికి గురైతే వెంటనే ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించాలి.

Updated Date - May 03 , 2024 | 11:05 PM