Share News

జిల్లా కేంద్రంలో సర్కారు భూములు కబ్జా

ABN , Publish Date - Apr 17 , 2024 | 10:51 PM

జిల్లా కేంద్రంలో సర్కారు భూములు అన్యాక్రాంతం అవుతున్నా అడిగే వారు కరువయ్యారు. రాత్రికి రాత్రే స్థలాన్ని చదును చేసి నిర్మా ణాలు చేపట్టినా అధికారులు పట్టించుకోకపోవడం అను మానాలకు తావిస్తోంది. పట్టణ నడిబొడ్డున కార్మెల్‌ స్కూల్‌ వెనుక వైపు, రాళ్లవాగు ఒడ్డున ఈ తతంగం కొద్ది రోజు లుగా జరుగుతోంది. రాళ్లవాగు సమీపంలో సుమారు 15 ఎకరాల్లో ఇనామ్‌ భూములున్నాయి.

జిల్లా కేంద్రంలో సర్కారు భూములు కబ్జా

మంచిర్యాల, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో సర్కారు భూములు అన్యాక్రాంతం అవుతున్నా అడిగే వారు కరువయ్యారు. రాత్రికి రాత్రే స్థలాన్ని చదును చేసి నిర్మా ణాలు చేపట్టినా అధికారులు పట్టించుకోకపోవడం అను మానాలకు తావిస్తోంది. పట్టణ నడిబొడ్డున కార్మెల్‌ స్కూల్‌ వెనుక వైపు, రాళ్లవాగు ఒడ్డున ఈ తతంగం కొద్ది రోజు లుగా జరుగుతోంది. రాళ్లవాగు సమీపంలో సుమారు 15 ఎకరాల్లో ఇనామ్‌ భూములున్నాయి. ఈ భూములను ఆనుకొనే సర్వే నెంబరు 283లో 14 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అలాగే సర్వే నెంబరు 283/1 లో 1.32 ఎకరాల లావుని పట్టా భూమి ఉంది.

నాలుగేళ్ల క్రితమే చేతులు మారిన భూమి...

సర్కారు భూమి సర్వే నెంబరు 283/3గా విభజిస్తూ నాలుగేళ్ల క్రితమే చేతులు మారింది. 2019లో అందులోని 1.25 ఎకరాలను కొందరు నాలా (వ్యవసాయేతర భూమి) కన్వర్షన్‌ కోసం దరఖాస్తు చేయగా అప్పటి అధికారులు అనుమతులు జారీ చేశారు. స్థానికుల ఫిర్యాదుతో సదరు స్థలంలో సర్వే నిర్వహించిన అధికారులు చట్ట విరుద్ధంగా నాలా కన్వర్షన్‌ చేశారని పేర్కొంటూ దరఖాస్తుదారులకు ఫీజుల రూపేణ రూ.10 లక్షల వరకు జరిమానా విధిం చారు. స్థలం చుట్టూ బౌండరీలు ఏర్పాటు చేశారు. అనంత రం హద్దురాళ్లను దాటి మరొకసారి అక్రమ నిర్మాణాలు వెలిశాయి. స్థానికుల ఫిర్యాదుతో అప్పటి అధికారులు ప్రభుత్వ భూమిలో అక్రమంగా వెలిసిన నిర్మాణాలను పూర్తిగా తొలగించారు. తాజాగా రెండు రోజుల క్రితం మళ్లీ అక్రమ నిర్మాణాలు వెలిశాయి. భూమిని చదును చేసి, తాత్కాలిక షెడ్లు నిర్మించడంతోపాటు ప్రహరీలు నిర్మించి ఆక్రమించారు. భూముల్లో నిర్మాణాలు చేపట్టిన వారు సర్వే నెంబరు 282 అని చెబుతుండగా, ధరణి పోర్టల్‌లో నోషనల్‌ ఖాతా ఇళ్ల స్థలాలుగా ఉంది. ఇదిలా ఉండగా సర్వే నెంబరు 283కి సంబంధించిన భూమి నిషేధిత జాబితాలో ఉండగా, పక్క సర్వే నెంబరు పేరుతో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించినట్లు సమాచారం.

చదరపు గజం రూ. 15 వేలు పైమాటే...

సర్వే నెంబరు 283లో ఉన్న 14 ఎకరాల భూములు ప్రస్తుత బహిరంగ మార్కెట్‌ ధర ప్రకారం చదరపు గజం ఒక్కంటికి రూ.15వేలు పై చిలుకు పలుకుతోంది. పట్టణ నడిబొడ్డున, చుట్టూ నివాస గృహాలు ఉండటంతోపాటు భూమి ఖాళీగా ఉండటంతో కబ్జాదారుల కళ్లు దానిపై పడుతున్నాయి. గతంలో నిర్మాణాలు చేపట్టగా స్పందించిన రెవెన్యూ అధికారులు కూల్చి వేశారు. అయినా అధికారుల కళ్లుగప్పి రాత్రికి రాత్రే కబ్జా చేయడం ఆనవాయితీగా మారింది. ఫిర్యాదులు వచ్చినప్పుడల్లా స్పందించి కబ్జాలను తొలగించడం వరకే అధికారులు పరిమితం అవుతుండగా, స్థలాన్ని కాపాడేందుకు శాశ్వత చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి, కబ్జా కోరులపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు స్థలాన్ని రక్షించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Apr 17 , 2024 | 10:51 PM