Share News

యథేచ్ఛగా గంజాయి దందా

ABN , Publish Date - Jan 21 , 2024 | 10:28 PM

జిల్లాలో గంజాయి వినియోగం చాపకింద నీరులా విస్తరిస్తోంది. పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా యువత, కళాశాలల విద్యార్థులే లక్ష్యంగా దందా సాగుతోంది. జిల్లా కేంద్రంలో గంజాయి సరఫరా యథేచ్ఛగా కొనసాగుతుండగా, బానిసైన యువత భవిష్యత్‌ను అంధకారమవుతోంది.

యథేచ్ఛగా గంజాయి దందా

మంచిర్యాల, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గంజాయి వినియోగం చాపకింద నీరులా విస్తరిస్తోంది. పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా యువత, కళాశాలల విద్యార్థులే లక్ష్యంగా దందా సాగుతోంది. జిల్లా కేంద్రంలో గంజాయి సరఫరా యథేచ్ఛగా కొనసాగుతుండగా, బానిసైన యువత భవిష్యత్‌ను అంధకారమవుతోంది. యువత బలహీనతలను ఆసరాగా చేసుకుంటున్న ఏజెంటు వ్యవస్థ అందినకాడికి దండుకుంటున్నారు. జిల్లా కేంద్రంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో గంజాయి అడ్డాలు ఏర్పాటైనప్పటికీ నిఘా వ్యవస్థ పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండటం విమర్శలకు దారి తీస్తోంది. పక్కా సమాచారంతో అధికారులు దాడులు జరుపుతున్నప్పటికీ వారి కళ్ళుగప్పి గంజాయి సరఫరాకు అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు.

రైలు, రోడ్డు మార్గాల ద్వారా జిల్లాకు...

జిల్లా కేంద్రంలో ప్రధాన రైలు మార్గం అందుబాటులో ఉండటంతో స్మగ్లర్లు యథేచ్ఛగా గంజాయి సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర, వరంగల్‌ నుంచి పలు రైళ్ల ద్వారా మంచిర్యాలకు తరలిస్తూ ఇక్కడి ఏజెంట్లకు విక్రయిస్తున్నారు. రైళ్లతోపాటు రోడ్డు మార్గంలోనూ గంజాయి సరఫరా అధికంగా జరుగుతోంది. ఏజెంట్లు ప్యాకెట్ల రూపంలోకి మార్చి వివిధ ప్రాంతాల్లోని యువత, విద్యార్థులకు సరఫరా చేస్తున్నారు. గతంలో జైపూర్‌ మండల కేంద్రంలో పోలీసుల దాడుల్లో పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడింది. మంచిర్యాల బస్టాండులోనూ ఓ మహిళ వద్ద గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సెప్టెంబరులో శ్రీరాంపూర్‌ జీఎం కార్యాలయం సమీపంలో ట్రాక్టర్‌ బోల్తా పడగా అందులో నుంచి పెద్ద మొత్తంలో గంజాయి సంచులు బయటపడటం పోలీసులను నివ్వెరపరిచింది. స్మగ్లర్లు పరారుకాగా, గంజాయి సంచులతో ఉన్న ట్రాక్టర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వందల సంఖ్యలో అడ్డాలు...

జిల్లా కేంద్రంలోని హమాలివాడ అశోక్‌ రోడ్డు, స్థానిక పోచమ్మ చెరువు, పాత మంచిర్యాలలోని సబ్‌ స్టేషన్‌ ఏరియా, స్థానిక శాలివాహన విద్యుత్‌ ప్లాంటు, కాలేజీ రోడ్డు సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో యువత గంజాయి సేవిస్తున్నారు. గోదావరి ఒడ్డున నిత్యం గంజాయి ప్యాకెట్లు కొనుగోలు చేస్తున్న యువత అక్కడి నిర్మానుష్య ప్రాంతాల్లో సేవిస్తున్నట్లు తెలుస్తోంది. హాజీపూర్‌ మండలం గుడిపేటలో గంజాయి విక్రయాలు జోరుగా జరుగుతున్నట్లు సమాచారం.

విస్తరిస్తున్న హెరాయిన్‌ వినియోగం...

గంజాయితోపాటు అత్యంత ప్రమాదకరమైన మత్తు పదార్థం హెరాయిన్‌ కూడా జిల్లాలో విరివిగా లభ్యం అవుతోంది. మంచిర్యాల పట్టణ కేంధ్రంగా హెరాయిన్‌, ఇతర మత్తు పదార్థాల సరఫరా జోరుగా సాగుతోంది. జిల్లా కేంధ్రంలోని హమాలివాడకు చెందిన ఓ వ్యాపారి హెరాయిన్‌ విక్రయాలకు పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో గుట్కా వ్యాపారం నిర్వహించిన సదరు వ్యక్తి అతి తక్కువ సమయంలో లక్షలకు పడగలెత్తాడు. మహారాష్ట్రలోని నాగపూర్‌ ప్రాంతం నుంచి హెరాయిన్‌ను దిగుమతి చేసుకుంటూ యువతకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.

యువతే లక్ష్యంగా...

జిల్లాకు సరఫరా అవుతున్న గంజాయి, హెరాయిన్‌లాంటి మత్తు పదార్థాలు యువత, కళాశాలల విద్యార్థులే లక్ష్యంగా విక్రయాలు జరుగుతున్నాయి. గతేడాది బెల్లంపల్లిలోని పాలిటెక్నిక్‌ కళాశాలలో గంజాయి సేవిస్తున్నారన్న సమాచారంతో ఆరుగురు విద్యార్థులను సస్పెండ్‌ చేశారు. మంచిర్యాలకు చెందిన ఓ వ్యక్తి కళాశాలలోని విద్యార్థులకు గంజాయి అందజేస్తున్నట్లు తెలిసింది. మత్తు పదార్థాల వినియోగంపైౖ పోలీసులు లోతుగా దర్యాప్తు జరిపితే జిల్లాలో గంజాయి, హెరాయిన్‌, ఇతర మత్తు పదార్థాల సరఫరా చేస్తున్న ముఠాల గుట్టు రట్టయ్యే అవకాశాలున్నాయి. ఓ వైపు తెలంగాణ ప్రభుత్వం గంజాయిని నామరూపాలు లేకుండా చేయాలని ఆదేశించినప్పటికీ జిల్లాలో జోరుగా విక్రయాలు సాగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది.

Updated Date - Jan 21 , 2024 | 10:28 PM