Share News

భూములిచ్చేందుకు రైతులు ససేమిరా

ABN , Publish Date - Jul 08 , 2024 | 11:22 PM

మంచిర్యాల-వరంగల్‌ మధ్య జాతీయ రహదారి నిర్మాణానికి ప్రతిపాదించారు. ఇందులో భాగంగా జైపూర్‌ మండలం నర్వా నుంచి గోపాల్‌పూర్‌ వరకు గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. అయితే ఈ గ్రామాల మధ్య సుమారు 110 హెక్టార్ల భూ సేకరణ చేపట్టాల్సి ఉంది. నామమాత్రపు పరిహారం చెల్లిస్తామని అధికారులు పేర్కొంటుండగా మార్కెట్‌ ధర చెల్లించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

భూములిచ్చేందుకు రైతులు ససేమిరా

మంచిర్యాల, జూలై 8 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల-వరంగల్‌ జాతీయ రహదారి నిర్మాణంలో పోతున్న భూములకు అరకొర పరిహారం చెల్లింపుపై రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వాస్తవ ధరలు చెల్లిస్తేనే భూములు ఇస్తామని చెబుతున్నారు. ఈ విషయమై గతంలో జైపూర్‌ మండలం శెట్‌పల్లిలో ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణలో బాధిత రైతులు ఈ అంశాన్ని లేవనెత్తారు. అయినా పట్టించుకోకుండానే భూసేకరణకు చేపడుతుండడంతో రైతులు ఆందోళనకు సిద్ధపడుతున్నారు.

నామమాత్రపు పరిహారంతోనే సరి....

మంచిర్యాల-వరంగల్‌ జాతీయ రహదారి 163 కింద భూములు కోల్పోతున్న రైతులకు నామమాత్రపు పరిహారం చెల్లించేందుకు రంగం సిద్ధమైంది. జాతీయ రహదారి నిర్మాణం జరిగితే ఆ ప్రాంతం అభివృద్ది చెంది, భూములకు మంచి విలువ వస్తుందని ఆశపడ్డ రైతులకు ఎన్‌హెచ్‌ అధికారులు మొండి చేయి చూపారు. నాగపూర్‌-విజయవాడ ఎకానమిక్‌ కారిడార్‌లో భాగంగా మంచిర్యాల-వరంగల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారిని ఏర్పాటు చేస్తున్నారు. రూట్‌ మ్యాప్‌ ప్రకారం జిల్లాలోని జైపూర్‌ మండలం ఇందారం గ్రామ శివారులోని నర్వా నుంచి పౌనూర్‌ గ్రామంలోని గోపాల్‌పూర్‌ వరకు గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మాణం చేపట్టను న్నారు. జిల్లాలో మొత్తం 14 గ్రామాల మీదుగా 23.097 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం జరుగుతుండగా సుమారు 110 హెక్టార్ల భూములు అవసరమవుతాయి. రహదారి కింద పోతున్న భూముల ధరలు వాస్తవం గా బహిరంగా మార్కెట్‌ రేట్‌ ప్రకారం ఎకరాకు రూ.40 లక్షల మేర పలు కుతున్నాయి. అయితే అధికారులు రూ.4 నుంచి 7 లక్షల వరకే ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఎనిమిదేళ్ల కిత్రం రూ.8 లక్షలు చెల్లింపు...

కాళేశ్వరం ప్రాజెక్టుల సముదాయంలో భాగంగా గోదావరిపై నిర్మించిన సుందిళ్ల బ్యారేజీ నిర్మాణం కోసం జైపూర్‌ మండలంలోని పలు గ్రామాల్లో రైతులకు చెందిన భూములను ప్రభుత్వం సేకరించింది. ఇందుకు గాను 2015-16లోనే ఎకరాకు రూ.8లక్షలు పరిహారం చెల్లించినట్లు రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం జాతీయ రహదారి భూములకు అందులో సగం చెల్లిస్తుండటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎనిమిదేళ్ల కాలంలో భూముల ధరలు దాదాపు రెట్టింపయ్యాయని, అప్పట్లో చెల్లించిన దానికంటే అధికంగా ఇవ్వాల్సింది పోయి, తగ్గించడంపై ఆందోళనకు సిద్ధపడుతున్నారు.

న్యాయమైన ధర చెల్లించాలి

జాతీయ రహదారి కింద పోతున్న భూములకు బహిరంగా మార్కెట్‌ విలువ ఆధారంగా న్యాయమైన ధరలు చెల్లించాలని ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బాధిత రైతులు లేఖలు రాశారు. రహదారి కోసం భూములు ఇచ్చి, తద్వారా అందుకునే పరిహారంతో గుంట భూమి కూడా కొనలేమని, అన్నం పెట్టే పొలాలను తీసుకోవద్దంటూ మే నెలలో ప్రభుత్వాలకు లేఖలు పంపారు. ఇటీవల కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ను సైతం కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో భూ సేక రణ జరపాల్సి వస్తే వాస్తవ రేటు చెల్లించాలని కోరారు. లేనిపక్షంలో భూములు ఇచ్చే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. మరోవైపు సుందిళ్ల ప్రాజెక్టు నిర్మాణంతో మండలంలోని పలు గ్రామాల్లో వ్యవసాయం అభివృద్ధి చెందింది. ఈ క్రమంలో అతి తక్కువ పరిహారం చెల్లిస్తే భూములిచ్చేం దుకు రైతులు ససేమిరా అంటున్నారు.

నామమాత్రపు ధరకు భూములివ్వం

....కృష్ణమూర్తి, కుందారం

ప్రభుత్వం ప్రకటించిన విధంగా నామమాత్రపు ధర చెల్లిస్తే భూములు ఇచ్చే ప్రసక్తేలేదు. రహదారి కింద కోల్పోతున్న భూముల ధరలు ఎకరాకు రూ.50 లక్షలు పై చిలుకు పలుకుతున్నాయి. అధికారులు ఎకరాకు రూ. 4.30 లక్షలు ఇస్తామని నోటీసులు పంపించారు. ఎనిమిదేళ్ల కిత్రం సుం దిళ్ల బ్యారేజీకి సేకరించిన భూములకు రూ.8 లక్షలు అందజేశారు. ఇప్పుడేమో తగ్గిస్తామంటున్నారు. ఇది సమంజసం కాదు.

Updated Date - Jul 08 , 2024 | 11:22 PM