Share News

అవిశ్వాసానికి అంతా సిద్ధం

ABN , Publish Date - Jan 09 , 2024 | 10:18 PM

నస్పూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ఈసంపల్లి ప్రభాకర్‌పై అవిశ్వాసానికి సిద్ధమైంది. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా అధికార మార్పిడితో కౌన్సిల్‌లో బలబలాలు మారి పోయాయి.

అవిశ్వాసానికి అంతా సిద్ధం

నస్పూర్‌, జనవరి 9: నస్పూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ఈసంపల్లి ప్రభాకర్‌పై అవిశ్వాసానికి సిద్ధమైంది. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా అధికార మార్పిడితో కౌన్సిల్‌లో బలబలాలు మారి పోయాయి. బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు కొందరు కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో మెజార్టీ సభ్యుల సంఖ్యతో చైర్మ న్‌పై గత నెల 18న కలెక్టర్‌కు అవిశ్వాస నోటీస్‌ ఇచ్చారు. ఈనెల 12న 11 గంటలకు మున్సిపల్‌ సమావేశ మందిరంలో ఓటింగ్‌ నిర్వహించడానికి ఆదేశాలు జారీ చేశారు.

మారిన బలబలాలు

నస్పూర్‌ మున్సిపాటీలో 25 వార్డులుండగా 2020లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌-10, కాంగ్రెస్‌-6, బీజేపీ-3, సీపీఐ-2, నలుగురు స్వతంత్రులు కౌన్సిల ర్లుగా విజయం సాధించారు. నలుగురు స్వతంత్రు లు బీఆర్‌ఎస్‌లో చేరడం, సీపీఐ ఇద్దరు సభ్యుల మద్దతుతో చైర్మన్‌గా ఈసంపల్లి ప్రభాకర్‌, వైస్‌ చైర్మన్‌గా తోట శ్రీనివాస్‌లు ఎన్నికైయ్యారు. మున్సి పాలిటీ నాలుగేళ్ళ పాలన ముగింపు దశలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. మంచిర్యాల నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రేంసాగర్‌రావు విజయం సాధించడంతో పలువురు కౌన్సిలర్లు కాంగ్రెస్‌ పార్టీ లో చేరారు. కాంగ్రెస్‌ పార్టీకి ఇద్దరు సీపీఐ సభ్యుల మద్దతు కౌన్సిల్‌లో సభ్యుల సంఖ్య 19కి చేరింది. మున్సిపాలిటీ వైస్‌ చైర్మన్‌గా కొనసాగిన తోట శ్రీనివాస్‌ పదవికి రాజీ నామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. సంఖ్య బలంతో చైర్మన్‌పై అవిశ్వాస నోటీసును కాంగ్రెస్‌ సభ్యులు ఇచ్చారు.

శిబిరానికి తరలిన కాంగ్రెస్‌ కౌన్సిలర్లు

నస్పూర్‌ మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్‌ కౌన్సిలర్లు 12 మంది మంగళవారం క్యాంపునకు తరలివెళ్ళారు. మిగిలిన వారు కూడా బుధవారం వెళ్ళే అవకాశం ఉంది. రెండు రోజుల పాటు హైద రాబాద్‌లో ఉండి అవిశ్వాసం రోజున రానున్నారు.

చైర్మన్‌గా 20వ వార్డుకు చెందిన సుర్మిళ్ళ వేణు, వైస్‌ చైర్మన్‌గా 15వ వార్డు కౌన్సిలర్‌ గెల్లు రజితలు ఎన్నికయ్యే అవకాశం ఉంది. వీరు మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌, డిప్యూటీ ఫ్లోర్‌లీడరుగా పని చేశారు.

సమావేశ మందిరాన్ని పరిశీలించిన ఆర్డీవో

మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశ మందిరాన్ని మం గళవారం ఆర్డీవో రాములు పరిశీలించారు. మున్సిప ల్‌ చైర్మన్‌ ఈసంపల్లి ప్రభాకర్‌పై ఈ నెల 12న జరుగనున్న అవిశ్వాస తీర్మాన సమావేశం సం దర్బంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఆర్డీవో అధికారు లతో మాట్లాడారు. అనంతరం కార్యాలయంలో నిర్వ హిస్తున్న ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల ప్రక్రియ ఆన్‌లైన్‌ విధానాన్ని పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల ఆన్‌లైన్‌ విధానాన్ని వేగవం తం చేయాలని సూచించారు. మున్సిపల్‌ కమిషనర్‌ తన్నీరు రమేష్‌ ఉన్నారు.

మంచిర్యాల నుంచి...

ఏసీసీ: మంచిర్యాల మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లు క్యాం పునకు తరలివెళ్లారు. ప్రస్తుతం ఉన్న చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లు కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌కు వినతి పత్రం అందించారు. ఈ నేపధ్యంలో ఈ నెల 11న చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లపై అవిశ్వాస తీర్మాన సమా వేశం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ నోటీసు ఇచ్చారు. అవిశ్వాసానికి సమయం దగ్గర పడుతుండడంతో కాంగ్రెస్‌ కౌన్సిలర్లు మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు నివాసం నుంచి బస్సులో బయలుదేరి హైద్రాబాద్‌ వెళ్లారు.

Updated Date - Jan 09 , 2024 | 10:18 PM