Share News

పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఫైనాన్స్‌ కంపెనీలు

ABN , Publish Date - Apr 16 , 2024 | 10:46 PM

జిల్లా వ్యాప్తంగా రోజు రోజుకూ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వడ్డీ వ్యాపార సంస్థలు అధిక వడ్డీలు వసూలు చేస్తూ సామాన్యుల జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నాయి. రూ.3 మొదలుకొని రూ.10 వరకు వడ్డీలు వసూలు చేస్తూ కోట్లకు పడగలెత్తున్నాయి. ఎలాంటి లెక్కలు, పత్రాలు లేకుండా అక్రమంగా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తూ అందినకాడికి దండుకుంటున్నాయి.

పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఫైనాన్స్‌ కంపెనీలు

మంచిర్యాల, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా రోజు రోజుకూ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వడ్డీ వ్యాపార సంస్థలు అధిక వడ్డీలు వసూలు చేస్తూ సామాన్యుల జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నాయి. రూ.3 మొదలుకొని రూ.10 వరకు వడ్డీలు వసూలు చేస్తూ కోట్లకు పడగలెత్తున్నాయి. ఎలాంటి లెక్కలు, పత్రాలు లేకుండా అక్రమంగా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తూ అందినకాడికి దండుకుంటున్నాయి. వడ్డీ వ్యాపారుల దెబ్బకు సామాన్య ప్రజలతోపాటు చిరు వ్యాపారులు విలవిల్లాడుతుండగా, నెలనెల వడ్డీలు చెల్లించని వారిపట్ల కఠిన వైఖరి అవలంభిస్తున్నాయి. సామాన్య ప్రజల అవసరాన్ని వ్యాపారంగా మలుచుకుంటూ అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నారు. హైర్‌ పర్చేజ్‌ అండ్‌ ఫైనాన్స్‌ల పేరుతో విలువైన డాక్యుమెంట్లు తనఖా పెట్టుకుంటూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారు. రిజిస్ట్రేషన్‌లు ఉన్న ఫైనాన్స్‌ల్లో సైతం జామీనుగా బ్లాంకు చెక్కులు, ప్రాంసరీ నోట్లు ష్యూరిటీ కింద తీసుకోకూడదనే నిబంధన ఉన్నప్పటికీ, వాటి ఆధారంగానే అప్పులు ఇవ్వడం పరిపాటిగా మారింది. రిజిస్ట్రేషన్ల శాఖ నియమ, నిబంధనల ప్రకారం ఫైనాన్స్‌ కంపెనీలు అన్ని రికార్డులు సక్రమంగా నిర్వహించాల్సి ఉండగా, అవేమీ లేకుండానే వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

నిబంధనలు బేఖాతరు

రిజిస్ట్రేషన్లు ఉన్న వాటికంటే ఎలాంటి నిబంధనలు పాటించకుండా వడ్డీ వ్యాపారం చేసేవాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. జిల్లా కేంద్రమైన మంచిర్యాలలో ఈ పరిస్థితి మరింత భయంకరంగా తయారైంది. గల్లిగల్లికో ఫైనాన్స్‌ సంస్థ ఏర్పాటైందంటే అతిశయోక్తికాదు. ప్రభుత్వ ఉపాధ్యాయులు, జ్యూయలరీ షాపులు, వందలాదిగా ప్రైవేటు వ్యక్తులు ఫైనాన్స్‌ సంస్థలను నెలకొల్పుతూ అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారు. వడ్డీ వ్యాపారానికి సంబంఽధించి ఎన్నో చట్టాలు ఉన్నప్పటికీ అవి కాగితాలకే పరిమితం కావడంతో వ్యాపారులు ఆడిందే ఆటగా పరిస్థితి తయారైంది. వడ్డీ వ్యాపారం చేయాలంటే జిల్లా రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి లైసెన్సు తప్పనిసరి. అయితే జిల్లాలో లైసెన్సు ఉన్న ఫైనాన్స్‌ సంస్థలకంటే అనధికారికంగా వడ్డీ వ్యాపారం చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. రెండు రోజులుగా ఫైనాన్స్‌ కంపెనీలపై దాడులు నిర్వహించిన పోలీసులు, అనధికారికంగా వడ్డీ వ్యాపారం చేసేవారిపై కూడా దృష్టిసారిస్తే సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగే అవకాశం ఉంది.

బ్లాంకు చెక్కులు తనఖా....

ఫైనాన్స్‌ కంపెనీలు, చిట్‌ ఫండ్స్‌తో సహా ఇతరత్రా వడ్డీ వ్యాపారం చేసే కంపెనీలు బ్లాంకు చెక్కులు తీసుకొని లావాదేవీలు నిర్వహించడం చట్టరీత్యా నేరం. అప్పు తీసుకున్న వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవడం, రుణ గ్రహీతలను వేధింపులకు గురి చేయడం చేయకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ అవేమీ పాటించకుండా ఇష్టారీతిన వడ్డీ, చక్ర వడ్డీలు వసూలు చేస్తున్నారు. అప్పు ఇచ్చే క్రమంలో తీసుకొనే బ్లాంకు ప్రాంసరీ నోట్లతో కోర్టుల్లో కేసులు వేసి మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. జ్యూయలరీ షాపులు, బట్టల దుకాణాల్లోనూ వడ్డీ వ్యాపారం నిర్వహిస్తూ సామాన్యుల అవసరాలతో వ్యాపారం చేస్తున్నారు. బంగారం, భూముల డాక్యుమెంట్లు కుదువ పెట్టుకొని అప్పులు ఇస్తూ, వడ్డీలు కట్టడంలేదనే సాకుతో వాటిని స్వాధీనం చేసుకొంటున్నారు.

అక్రమార్కులపై చర్యలకు రంగం సిద్ధం

వడ్డీ ప్యాపారం పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న పలు ఫైనాన్స్‌ కంపెనీల నిర్వాహకులకు ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలో నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. రెండు రోజులు కిత్రం జిల్లా వ్యాప్తంగా వడ్డీ వ్యాపారులపై దాడులు నిర్వహించిన పోలీసులు నిర్వాహకుల నుంచి పెద్ద మొత్తంలో రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిన అనంతరం అక్రమ వ్యాపారులకు సంబంధించి అరెస్టులు చేసేందుకు సైతం రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Updated Date - Apr 16 , 2024 | 10:46 PM