Share News

సింగరేణిలో తగ్గుతున్న కార్మికులు

ABN , Publish Date - May 23 , 2024 | 10:28 PM

సింగరేణిలో క్రమంగా కార్మికుల సంఖ్య తగ్గుతోంది. బొగ్గు గనులు, కార్మిక కుటుంబాలతో కళకళలాడిన సింగరేణి ప్రాంతం నేడు కార్మికులు లేక వెలవెలబోతున్నది. గనుల మూతతో ఇంతకాలం ఇక్కడ పనిచేసిన కార్మికులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుండటంతో కొన్ని ఏరియాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.

సింగరేణిలో తగ్గుతున్న కార్మికులు

మంచిర్యాల, మే 23 (ఆంధ్రజ్యోతి): సింగరేణిలో క్రమంగా కార్మికుల సంఖ్య తగ్గుతోంది. బొగ్గు గనులు, కార్మిక కుటుంబాలతో కళకళలాడిన సింగరేణి ప్రాంతం నేడు కార్మికులు లేక వెలవెలబోతున్నది. గనుల మూతతో ఇంతకాలం ఇక్కడ పనిచేసిన కార్మికులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుండటంతో కొన్ని ఏరియాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.

39వేలకు పడిపోయిన కార్మికుల సంఖ్య

ఒకప్పుడు లక్షా పై చిలుకు కార్మికులు పనిచేసిన సింగరేణిలో కాలక్రమేణ కార్మికుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాలలో కార్మికుల సంఖ్య 39 వేలకు పడిపోయింది. గడిచిన ఐదేళ్లలో కార్మికుల సంఖ్య తగ్గుముఖం పట్టగా, నియామకాలు చేపట్టకపోవడంతో సంస్థ మనుగడకు ప్రమాదం వాటిల్లే పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో శ్రీరాంపూర్‌, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాలు ఉన్నాయి. వీటి పరిధిలో ఐదేళ్ళ కిత్రం సుమారు 21వేల వరకు ఉన్న కార్మికుల సంఖ్య నేడు 14వేల పై చిలుకు కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు.

నియామకాలపై శ్రద్ధ ఏది...?

ఒకప్పుడు సింగరేణిలో ఉద్యోగం చేసేందుకు వెనుకంజ వేసేవారు. బొగ్గు ఉత్పత్తి అవసరాలకు సంస్థ అప్పటి డైరెక్టర్‌ జీపీ రావు నేతృత్వంలో కార్మికుల సంఖ్య పెంచేందుకు కృషి చేశారు. కార్మికులకు పరుగు పందెం పోటీలు ఏర్పాటు చేసి నియామకాలకు తెరతీశారు. అంతకు ముందు బరువు ఎత్తడం ద్వారా నియామకాలు చేపట్టేవారు. 1985 ప్రాంతంలో రన్నింగ్‌ ద్వారా ఏకకాలంలో సుమారు 40వేల నియామకాలు చేపట్టారు. ఉత్పత్తి పెరిగినప్పటికీ కార్మికుల సంఖ్య అధికంగా ఉందన్న నెపంతో యాజమాన్యం తగ్గించే పన్నాగం పన్నింది. గోల్డెన్‌ షేక్‌హ్యాండ్‌ పథకాన్ని తెరపైకి తేవడం ద్వారా సర్వీసు మిగిలి ఉండగానే కార్మికులను ముందస్తుగా ఉద్యోగాల్లో నుంచి తొలగించే ప్రక్రియకు నాంది పలికింది. అలా ప్రారంభమైన కార్మికుల ఏరివేత కారణంగా సింగరేణి వ్యాప్తంగా వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.

కొత్త గనుల ఊసేది...?

బొగ్గు ఉత్పత్తిపై సింగరేణి యాజమాన్యం చూపుతున్న శ్రద్ధ సంస్థ మనుగడపై చూపడం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. అండర్‌ గ్రౌండ్‌ గనులను క్రమంగా మూసి వేస్తున్న యాజమాన్యం, వాటి స్థానంలో ఓపెన్‌కాస్టు గనులను తెరపైకి తెస్తోంది. జిల్లాలోని మూడు ఏరియాల్లో పలు అండర్‌ గ్రౌండ్‌ గనులు ఇప్పటికే మూత పడగా, కొన్ని చోట్లా ఓసీల పరిస్థితి అలాగే ఉంది. ఆర్కే-1, ఆర్కే-6, ఆర్కే న్యూటెక్‌, ఎస్‌ఆర్పీ-1, ఆర్కే-5 అండర్‌ గ్రౌండ్‌ గనులతోపాటు ఆర్కే ఓసీ కూడా రెండు సంవత్సరాల్లో మూతపడే పరిస్థితులు ఉన్నాయి. ఇవి మూతపడితే కార్మికుల సంఖ్య మరింతగా తగ్గే అవకాశాలున్నాయి. ఈ ప్రాంతంలో మరో 40 సంవత్సరాలకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండగానే యాజమాన్యం గనుల మూసివేత దిశగా అడుగులు వేస్తోంది.

మందమర్రి ప్రాంతంలో కొత్తగా కేకే6 అండర్‌ గ్రౌండ్‌ మైన్‌, శ్రావణపల్లి ఓసీ గనులు వచ్చే అవకాశాలున్నా యాజమాన్యం, ప్రభుత్వాల నిర్లక్ష్యవైఖరి వల్ల వాటి ఏర్పాటుకు మోక్షం లభించడం లేదు. రామకృష్ణాపూర్‌ ఓసీ మూతవేతకు సిద్ధంగా ఉండగా, దాని జీవితకాలం పెంచే అవకాశంపై దృష్టి సారించడం లేదు. ఆర్కే ఓసీ వద్ద షాఫ్ట్‌బ్లాక్‌ మైన్‌ ప్రారంభిస్తే జీవితకాలం పెరిగి ఉద్యోగావకాశాలు మెరుగుపడే అవకాశాలున్నాయి. ఓసీలలో 300 మీటర్ల లోనికి వెళ్లి బొగ్గును వెలికి తీసే టెక్నాలజీ ఉంది. అయితే కొత్తగూడెంలో షాఫ్ట్‌ బ్లాక్‌ మైనింగ్‌తో 700 మీటర్ల వరకు లోనికి వెళ్లే వెసలుబాటు ఉంది. అదేమాదిరిగా ఇక్కడి ఓసీలను కూడా షాఫ్ట్‌బ్లాక్‌ మైన్స్‌గా ఆధునికీకరిస్తే మరో 300 నుంచి 400 మీటర్ల వరకు అదనపు తవ్వకాలు జరిపే అవకాశం ఏర్పడుతుంది. ఇందారం, ఎస్‌ఆర్పీ ఓసీల సామర్థ్యం మరింతగా పెంచే అవకాశాలను యాజమాన్యం పరిగణలోకి తీసుకోవాలనే అభిప్రా యాలున్నాయి. అండర్‌ గ్రౌండ్‌ మైన్‌లను ఓసీలుగా మార్చకుండా వాటి జీవితకాలం పెంచితే మరింతకాలం బొగ్గు ఉత్పత్తి సాధించే అవకాశాలు ఉన్నాయి.

కొత్తగనులు ఏర్పాటు చేయాలి

వాసిరెడ్డి సీతారామయ్య, ఏఐటీయూసీ అధ్యక్షుడు

నాలుగు దశాబ్దాలపాటు ఈ ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. బొగ్గు ఉత్పత్తికి ఎలాంటి కొరతలేదు. కొత్తగా అండర్‌ గ్రౌండ్‌ మైన్లు ఏర్పాటు చేయడం ద్వారా నియామకాలు చేపట్టి బొగ్గు తవ్వకాలు జరపాలి. ఈ దిశగా సింగరేణి యాజమాన్యం కృషి చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ కూడా ఈ విషయమై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

Updated Date - May 23 , 2024 | 10:28 PM