Share News

అమ్మకానికి డంప్‌ యార్డు భూములు

ABN , Publish Date - May 30 , 2024 | 10:37 PM

మంచిర్యాల మున్సిపాలిటీకి డం పింగ్‌ యార్డు కోసం ఉపయోగించిన ప్రభుత్వ భూములు పక్కదారి పట్టాయి. అసైన్డ్‌ పేరుతో కొందరు బడాబాబులు అక్రమంగా వాటిని చేజిక్కించుకొని అదును చూసి విక్రయించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

అమ్మకానికి డంప్‌ యార్డు భూములు

మంచిర్యాల, మే 30 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల మున్సిపాలిటీకి డం పింగ్‌ యార్డు కోసం ఉపయోగించిన ప్రభుత్వ భూములు పక్కదారి పట్టాయి. అసైన్డ్‌ పేరుతో కొందరు బడాబాబులు అక్రమంగా వాటిని చేజిక్కించుకొని అదును చూసి విక్రయించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల స్థలాన్ని చదును చేయడమేగాక హద్దు రాళ్లు కూడా ఏర్పాటు చేసినప్పటికీ మున్సిపల్‌ అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పట్టించుకోవడం లేదు.

డంప్‌యార్డుకు కేటాయింపు

మంచిర్యాల మున్సిపాలిటీ చెత్త డంపింగ్‌ యార్డు కోసం హాజీపూర్‌ మండలం వేంపల్లి శివారులోని సర్వే నంబర్‌లు 154, 155, 159లలో 21 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు. అయితే డంప్‌యార్డు ఏర్పాటు చేసి, మున్సిపల్‌ చెత్త వేయడం వల్ల దుర్గంధం వ్యాపిస్తోందని స్ధానికులు అభ్యంతరం తెలిపారు. స్థలం చుట్టూ ప్రహరీ లేకపోవడంతో వర్షాకాలంలో కుళ్లిన పదార్థాలు సమీపంలోని చెరువుల్లోకి చేరే ప్రమాదం ఉన్నందున డంపింగ్‌ యార్డును నిలిపివేయాలని 2016లో అప్పటి ఆ సర్పంచ్‌ ఆధ్వర్యంలో గ్రామస్థులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వివాదం ముదరడంతో మున్సిపల్‌ అధికారులు సదరు స్థలంలో చెత్త డంప్‌ను నిలిపివేశారు.

ఖాళీగా ఉండటంతో స్థలంపై కన్ను

సదరు స్థలం గతంలో కొందరు భూమి లేని నిరుపేదలకు ప్రభుత్వం అసైన్డ్‌ చేసింది. కొంతకాలం పాటు భూమిని సాగుచేసిన లబ్ధిదారులు స్థలాన్ని ఇతరులకు విక్రయించారు. దీంతో ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. ఆ స్థలాన్ని మున్సిపల్‌ డంప్‌యార్డ్‌ అవసరాలకు కేటాయించారు. అనంతరం ప్రజల అభ్యంతరంతో మున్సిపల్‌ అధికారులు స్థలాన్ని ఖాళీగా వదిలి వేయడంతో బడా బాబుల కళ్లు దానిపై పడ్డాయి.

చట్టాన్ని తుంగలో తొక్కిన బడా బాబులు

అసైన్డ్‌ భూములు చట్టం ప్రకారం క్రయ,విక్రయాలు చేపట్టరాదు. ప్రత్యేక పరిస్థితుల్లో విక్రయాలు చేయాలనుకుంటే ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన కులాలకు చెంది, ఎలాంటి భూములు లేని, అర్హతగల వారు మాత్రమే కొనుగోలు చేసే వెసలుబాటును అసైన్‌మెంట్‌ చట్టం కల్పించింది. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు బడా బాబులు చట్టాన్ని తుంగలో తొక్కి స్థలాన్ని అక్రమంగా లబ్దిదారుల నుంచి కొనుగోలు చేయడమేగాక తమ పేరిట అసైన్‌మెంట్‌ రికార్డుల్లోకి కూడా ఎక్కించుకున్నారు. అలా అక్రమంగా రికార్డుల్లోకి ఎక్కిన బడాబాబులు అదును చూసి స్థలాన్ని విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

కోర్టులో కేసు ఉండగానే

స్థలాన్ని మున్సిపాలిటీకి కేటాయించడంపై తమ వద్ద ఉన్న ఆధారాలతో కొనుగోలుదారులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ కొనసాగుతూనే ఉంది. ఓ వైపు విచారణ జరుగుతుండగానే, మరోవైపు స్థలాన్ని విక్రయించేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల స్థలాన్ని మట్టితో చదును చేసి, చుట్టూ పోల్స్‌ ఏర్పాటు చేశారు. అందులో ఐదు గుంటల చొప్పున అక్రమంగా ప్లాట్లు చేసి, ఫాం ల్యాండ్‌ పేరుతో విక్రయించడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవడం అను మానాలకు దారి తీస్తోంది. స్థలాన్ని మున్సిపాలిటీకి కేటాయించేందుకు అవసరమైన చర్యలు చేపట్టిన ప్రజాప్రతినిధులు కూడా మౌనం వహించడంతో బడా బాబులకు ఎదురు లేకుండా పోయింది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

సమాచారం లేదు...వేంపల్లి గ్రామ కార్యదర్శి ప్రతిభ

మంచిర్యాల మున్సిపాలిటీకి డంప్‌యార్డు కోసం కేటాయించిన భూమిని చదును చేయడం, పోల్స్‌ పాతడంపై ఎలాంటి సమాచారం అందలేదు. ఈ విషయమై విచారణ చేపడుతాం. రెండు రోజుల్లో సదరు భూమిని సందర్శించి, ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి అవసరమైన చర్యలు తీసుకొంటాం.

Updated Date - May 30 , 2024 | 10:37 PM