Share News

మంచిర్యాల మున్సిపాలిటీలో నెగ్గిన అవిశ్వాసం

ABN , Publish Date - Jan 11 , 2024 | 10:41 PM

మంచిర్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో నాలుగేళ్లపాటు చైర్మన్‌, వైస్‌చైర్మన్లుగా పదవులు అలంకరించిన పెంట రాజయ్య, గాజుల ముకేష్‌గౌడ్‌లు మరో సంవత్సరం కాలపరిమితి మిగిలి ఉండగానే పదవులు కోల్పోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

మంచిర్యాల మున్సిపాలిటీలో నెగ్గిన అవిశ్వాసం

మంచిర్యాల, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో నాలుగేళ్లపాటు చైర్మన్‌, వైస్‌చైర్మన్లుగా పదవులు అలంకరించిన పెంట రాజయ్య, గాజుల ముకేష్‌గౌడ్‌లు మరో సంవత్సరం కాలపరిమితి మిగిలి ఉండగానే పదవులు కోల్పోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మున్సి పాలిటీలో మొత్తం 36 వార్డులు ఉండగా, కాంగ్రెస్‌ కౌన్సిలర్ల సంఖ్య 26 ఉంది. అవిశ్వాసానికి అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ ఉండటంతో బీఆర్‌ఎస్‌ చైర్మన్‌, వైస్‌చైర్మన్లపై అవిశ్వాస సమావేశం ఏర్పాటు చేయాలని గత నెల 15న మెజార్టీ కౌన్సిలర్లు కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌కు నోటీసు అందజే శారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు మంచిర్యాల ఆర్డీవో రాములు గురువారం మున్సిపల్‌ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి బల నిరూ పణ చేపట్టారు. ఉదయం చైర్మన్‌పై, మధ్యాహ్నం వైస్‌ చైర్మన్‌కు బల నిరూపణ సమావేశాలు ఏర్పాటు చేశారు. సమావేశానికి బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు గైర్హాజరు కాగా, 26 మంది కాంగ్రెస్‌ సభ్యులతోపాటు బీజేపీ కౌన్సిలర్‌ మోతె సుజాత కాంగ్రెస్‌కు మద్దతు తెలపడంతో చైర్మన్‌, వైస్‌ చైర్మన్లపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో మున్సిపాలిటీ హస్తగతం అయింది.

నూతన చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక లాంఛనమే...

మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు పదవీచ్యుతులు కావడంతో కాంగ్రెస్‌ సభ్యులు పీఠాలను అలంకరించనున్నారు. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ల రాజీనామాలను రాష్ట్ర మున్సిపల్‌ పరిపాలనశాఖ ఆమోదిం చిన అనంతరం నూతన చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ల ఎన్నిక కోసం నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఇందుకు దాదాపు వారం, పది రోజులు సమయం పట్టే అవకాశాలున్నాయి. నోటిఫికేషన్‌ వెలువడగానే చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక జరుగనుంది. మున్సిపల్‌ చైర్మన్‌గా 30వ వార్డు కౌన్సిలర్‌ డాక్టర్‌ రావుల ఉప్పలయ్య, వైస్‌ చైర్మన్‌గా 2వ వార్డు కౌన్సిలర్‌ సల్ల మహేష్‌లు ఎన్నికయ్యే అవకాశం ఉంది.

పదవులు కోల్పోయిన నేతలుగా రికార్డు

కాంగ్రెస్‌ కౌన్సిలర్ల అవిశ్వాసానికి గురై పదవులు కోల్పోయిన నేతలుగా చైర్మన్‌ పెంట రాజయ్య, వైస్‌ చైర్మన్‌ గాజుల ముకేష్‌గౌడ్‌లు రికార్డుల్లోకి ఎక్కారు. మొదటి సారిగా 1956లో మంచిర్యాల మున్సిపాలిటీగా ఏర్పాటు అయింది. ఆనాటి నుంచి నేటి వరకు 59 సంవత్సరాల్లో పలుమార్లు చైర్మ న్‌ ఎన్నికలు ప్రత్యక్షంగా, పరోక్షంగానూ ఎన్నికయ్యారు. పాలకవర్గం పదవి కాలం ముగిసిన సందర్భంలో ఎన్నికలు జరిగే వరకు ప్రత్యేకాధికారి పాలన ఏర్పాటు చేశారే తప్ప ఏనాడూ అర్ధంతరంగా చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు పదవులను కోల్పోయిన సందర్భాలు లేవు.

చక్రం తిప్పిన పీఎస్సార్‌

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రేంసాగర్‌రావు గెలిచిన తరువాత మున్సిపాలిటీలో భారీ మార్పులు జరిగాయి. బీఆర్‌ఎస్‌కు చెందిన 16 మంది కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావు గెలుపొందడంతో అప్పుడు కాం గ్రెస్‌ టికెట్‌పై గెలిచిన ఆరుగురు కౌన్సిలర్లు ఆ పార్టీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో బీఆర్‌ఎస్‌ చైర్మన్‌, వైస్‌చైర్మన్ల ఎన్నికకు మార్గం సుగమ మైంది. ప్రస్తుతం ప్రేంసాగర్‌రావు ఎమ్మెల్యేగా గెలవడంతో నియోజకవర్గం లోని మంచిర్యాల, నస్పూర్‌, లక్షెట్టిపేట మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్‌ కౌన్సి లర్లు కాంగ్రెస్‌లో చేరారు. మూడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాలకు తెరలేపారు.

క్యాతనపల్లిలోనూ అవిశ్వాస నోటీసు

క్యాతనపల్లి మున్సిపాలిటీలోనూ మెజార్టీ కౌన్సిలర్లు చైర్మన్‌, వైస్‌చైర్మన్ల పై కలెక్టర్‌కు ఈనెల 10న నోటీసు అందజేశారు. మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులు ఉండగా, కేవలం ఇద్దరే కాంగ్రెస్‌ కౌన్సిలర్లు ఉన్నారు. అయితే ప్రస్తుత బీఆర్‌ఎస్‌ చైర్‌పర్సన్‌ జంగం కళ, వైస్‌చైర్మన్‌ సాగర్‌రెడ్డికి వ్యతిరేకంగా ఆ పార్టీ కౌన్సిలర్లే అవిశ్వాసం కోరడం గమనార్హం. చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్లపై కౌన్సిలర్లలో అసంతృప్తి జ్వాలలు ఉండటంతో వారిని పదవీచ్యుతులను చేయడం ద్వారా నూతన నాయకత్వాన్ని ఎన్నుకునే ఎత్తుగడల్లో భాగంగా నోటీసు అందజేశారు.

Updated Date - Jan 11 , 2024 | 10:41 PM