Share News

శిథిలావస్థలో పశువైద్యశాలలు

ABN , Publish Date - May 27 , 2024 | 10:32 PM

జిల్లాలో పశువైద్య శాలలు శిథిలావస్థకు చేరాయి. వైద్యుల పోస్టులు భర్తీ చేయకపోవడం, సిబ్బంది, మందుల కొరత వేధిస్తున్నాయి. జిల్లాలో 44 పశువైద్యశాలలు ఉన్నాయి.

శిథిలావస్థలో పశువైద్యశాలలు

నస్పూర్‌, మే 27: జిల్లాలో పశువైద్య శాలలు శిథిలావస్థకు చేరాయి. వైద్యుల పోస్టులు భర్తీ చేయకపోవడం, సిబ్బంది, మందుల కొరత వేధిస్తున్నాయి. జిల్లాలో 44 పశువైద్యశాలలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు పది లక్షల వివిధ రకాల పాడి సంతతికి వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. ఆవులు, ఎద్దులు, గెదెలు, గొర్రెలు, మేకతో పాటు పెంపుడు కుక్కల తదితర వాటికి వైద్య సేవలు మెరుగు పర్చాల్సిన అవసరం ఉంది. పశువైద్యశాలలు శిథిలావస్థకు చేరి భవనాల పై కప్పుల పెచ్చులు ఊడి పడుతుండడంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.

శిథిల భవనాలు...

జిల్లా వ్యాప్తంగా 44 పశు వైద్యశాలల్లో 15 నుంచి 20 వరకు స్వంత భవనాలు కాగా మిగిలినవి గ్రామపంచాయతీ చెందిన, స్వచ్ఛంద సంస్థల భవనాలల్లో కొనసాగుతున్నాయి. కాసీపేట, దండేపల్లి, తాండూరు, భీమినిలో భవనాలు శిథిలావస్థకు చేరాయి. భవనాల పైకప్పుల పెచ్చులు ఊడిపడిపోతున్నాయి. తాత్కాలిక మరమ్మతులు మినహా శాశ్వతమైన పనులు చేయడంలేదు. పెచ్చులు ఊడి పడిపడుతుండడంతో విఽధులు నిర్వహించడానికి సిబ్బంది భయపడుతున్నారు. ఇదిలా ఉండగా మిగిలిన ఏరియాల్లోని భవనాలు కూడా వివిధ సమస్యలున్నాయి.

మంచిర్యాల జిల్లా కేంద్రంలోనే పశు వైద్యశాలకు స్వంత భవనం లేకుండా పోయింది. గతంలో ఇక్కడి మార్కెట్‌ యార్డులో పశు వైద్యశాల ఉండేది. మార్కెట్‌ యార్డును మెడికల్‌ కళాశాలకు కేటాయించడంతో ఆసుపత్రిని చున్నంబట్టివాడలోని హౌసింగ్‌ శాఖ నిర్మిత కేంద్రంలోని ఒక గదిలో ప్రస్తుతం నిర్వహిస్తున్నారు.

జిల్లాలో పశు సంపద...

జిల్లాలో గెదెలు, ఆవులు, ఎద్దులు-2,85 లక్షలు, గొర్రెలు- 5 లక్షలు, మేకలు-2 లక్షలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 25 గోపాల మిత్ర బృంద సభ్యులు, నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొబైల్‌ సర్వీస్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి.

ఎక్కడెక్కడ ఖాళీలు...

జిల్లా లో ఆయా వైద్యశాలల్లో కింద స్థాయి సిబ్బంది నుంచి వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెండు ఏరియా వెటర్నరీ అసుపత్రులు (ఏవీహెచ్‌), వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌-27 పని చేస్తుండగా ద్వారక, రంగపేటలోని ఆసుసత్రుల్లో వైద్యుల పోస్టులు ఖాళీగా ఉండగా, ఉప కేంద్రాల్లో పశు వైద్యులు ఇద్దరు, ఫార్మాసిస్ట్‌లు-6, సబార్డినేటర్లు-17 ఖాళీగా ఉన్నాయి. పశువైద్యుల పోస్టులు, ఇతర సిబ్బంది ఖాళీల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు చెబుతున్నారు. పోస్టుల కొరతతోపాటు జిల్లాలో మందుల కొరత కూడా ఉంది. ఏడాదిలో మూడు మాసాలకు ప్రభుత్వం నుంచి మందుల కొనుగోలుకు నిధులు విడుదల అయ్యేవి. గతేడాదిలో రెండు సార్లు మాత్రమే నిధులు వచ్చాయి. నిధులు విడుదల కాకాపోవడంతో ఈ ఏడాదిలో మందుల కొనుగోళ్ళపై ప్రభావం పడే అవకాశం ఉంది.

వర్షకాలం వ్యాధుల కాలం...

వర్షాకాలంలో పశువులు వివిధ రకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. జబ్బవాపు, గుండె వాపు, గాలికుంటు తదితర వ్యాధులు ప్రబలుతాయి. గొర్రెలు చిటుకు రోగం బారిన పడుతాయి. వ్యాధి సోకినట్లు తెలియగానే పశువైద్యులను సంప్రదిస్తారు. పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో వ్యాధులపై రైతులను అప్రమత్తం చేసేందుకు మైక్‌ల ద్వారా గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. రకరకాల వ్యాధుల నివారణకు టీకాలు కూడా ఇస్తున్నారు.

వ్యాధుల పట్ల అప్రమత్తం..

రమేష్‌ కుమార్‌, పశు సంవర్థక శాఖ జాయింట్‌ డైరెక్టర్‌- మంచిర్యాల

వర్షకాలంలో పశువులకు వచ్చే వ్యాధుల పట్ల సిబ్బందిని అప్రమత్తం చేశాం. ఇప్పటికే వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా వ్యాధి నిరోధక టీకాలను ఇచ్చాం. గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను వంద శాతం పూర్తి చేశాం. రైతులకు ఉచితంగా మందులను పంపిణీ చేస్తున్నాం. రైతుల పశువులకు అందించిన వైద్య సేవలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నాం. ఖాళీగా ఉన్న వైద్యుల, సిబ్బంది పోస్టుల భర్తీ ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉంటుంది. వాన కాలంలో వ్యాధులు ప్రబలకుండా జిల్లాలో యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించాం.

Updated Date - May 27 , 2024 | 10:32 PM