Share News

బీజేపీలో ముదురుతున్న గ్రూపు తగాదాలు

ABN , Publish Date - May 02 , 2024 | 10:53 PM

పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీలో గ్రూపు తగదాలు కేడర్‌ను అయోమయానికి గురి చేస్తు న్నాయి. జిల్లా పార్టీలో రెండు గ్రూపులుగా విడిపోయిన ముఖ్య నాయ కులు కనీసం ఎన్నికల సమయంలోనైనా ఏకతాటిపైకి రాకపోవడంతో కిందిస్థాయి నాయకులు ఆందోళన చెందుతున్నారు.

బీజేపీలో ముదురుతున్న గ్రూపు తగాదాలు

మంచిర్యాల, మే 2 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీలో గ్రూపు తగదాలు కేడర్‌ను అయోమయానికి గురి చేస్తు న్నాయి. జిల్లా పార్టీలో రెండు గ్రూపులుగా విడిపోయిన ముఖ్య నాయ కులు కనీసం ఎన్నికల సమయంలోనైనా ఏకతాటిపైకి రాకపోవడంతో కిందిస్థాయి నాయకులు ఆందోళన చెందుతున్నారు. పెద్దపల్లి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్‌ గొమాసే గెలుపునకు కేడర్‌ అంతా కలిసికట్టుగా పని చేయాల్సి ఉండగా, గ్రూపు విబేధాల కారణంగా మొక్కుబడిగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

ముఖ్యనేతల మధ్య విభేదాలు

బీజేపీ జిల్లా ముఖ్య నేతల్లో మనస్పర్థల కారణంగా రోజురోజుకూ విభేదాలు పెరుగుతున్నాయి. జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి, మాజీ అధ్యక్షుడు ముల్కల్ల మల్లారెడ్డిల మధ్య ఆది నుంచి వివాదం ఉంది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం రఘునాథ్‌కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించ డంతో వైరం మరింతగా ముదిరింది. ఇరువురు నేతలు ఆధిపత్యం ప్రదర్శిస్తుండటంతో కేడర్‌ ఆయోమయానికి గురవుతోంది. ఈ క్రమంలో ద్వితీయ స్థాయి శ్రేణులంతా రెండు వర్గాలుగా విడిపోయారు. ఇరువర్గాల నాయకులు పార్టీ సభలు, సమావేశాల్లోనూ ఎడమొహం, పెడమొహంగా ఉంటున్నారు. ఈ క్రమంలో బీజేపీలో చేరి టికెట్‌ సాధించిన శ్రీనివాస్‌ గొమాసేకు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. రెండు వర్గాలతో ఆయన సన్నిహితంగా ఉంటున్నప్పటికీ ప్రచారంలో ఆయా వర్గాల నాయకులు సంపూర్ణ మద్దతు తెలపడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీనివాస్‌కు పార్టీ టికెట్‌ కేటాయించడాన్ని మొదటి నుంచీ ఓ వర్గం వ్యతిరేకిస్తుండగా, మరో వర్గం ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తోంది.

ఒంటరిగానే గొమాసే ప్రచారం

ఇరువర్గాల ఆధిపత్య పోరు కారణంగా ముఖ్య నాయకులెవరూ ఎంపీ అభ్యర్థి గొమాసే వెంట కానరావడం లేదు. ఎప్పుడో అడపాదడపా ప్రచారంలో పాల్గొంటున్నప్పటికీ అభ్యర్థి ఒంటరిగా ప్రజలకు మధ్యకు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కారణంగా అభ్యర్థి పూర్తిస్థాయిలో ప్రచారం నిర్వహించలేకపోతున్నట్లు పార్టీ వర్గాలే అభిప్రాయ పడుతున్నాయి. ఎన్నికల తేదీ సమీపిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కోల్‌బెల్ట్‌ ప్రాంతమైన శ్రీరాంపూర్‌, మందమర్రి ఏరియాలలో బీజేపీ అభ్యర్థి పూర్తి స్థాయి ప్రచారం నిర్వహించలేదు. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో ఇదే పరిస్థితి ఉన్నట్లు సమాచారం.

Updated Date - May 02 , 2024 | 10:53 PM