Share News

కౌంట్‌ డౌన్‌...

ABN , Publish Date - Jun 03 , 2024 | 11:14 PM

లోక్‌సభ ఎన్నికల ఫలితాల కౌంట్‌ డౌన్‌ మొదలైంది. మరికొద్ది గంటల్లో ఫలితాలు వెలువడనున్నాయి. ఎలక్షన్‌ షెడ్యూల్‌ ప్రకారం రాష్ట్రంలో మే 13న లోక్‌సభ ఎన్నికలు జరి గాయి.

కౌంట్‌ డౌన్‌...

మంచిర్యాల, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల ఫలితాల కౌంట్‌ డౌన్‌ మొదలైంది. మరికొద్ది గంటల్లో ఫలితాలు వెలువడనున్నాయి. ఎలక్షన్‌ షెడ్యూల్‌ ప్రకారం రాష్ట్రంలో మే 13న లోక్‌సభ ఎన్నికలు జరి గాయి. పెద్దపల్లి పార్లమెంట్‌ పరిధిలో పెద్దపల్లి, మంథని, రామగుండం, ధర్మపురి నియోజకవర్గాల కౌంటింగ్‌ సెంటినగర్‌కాలనీ జేఎన్టీయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్‌ హాజీపూర్‌ మండలం ఐజా ఇంజనీరింగ్‌ కళా శాలలో జరగనుంది. మంగళవారం ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా, స్ట్రాంగ్‌ రూంలో ఉన్న ఈవీఎంలను అభ్యర్థులు, అధికారుల సమక్షంలో తెరవను న్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, ఎన్నికల కౌం టింగ్‌ పరిశీలకులు విజయఈరవికుమార్‌, రామగుండం పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌, డీసీపీ అశోక్‌కుమార్‌, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు రాహుల్‌, డి చంద్రకళ, వాడాల రాములు, పర్యవేక్షణలో లెక్కింపు జరుగనుంది.

తేలనున్న అభ్యర్థుల భవితవ్యం...

మంగళవారం ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా వివిధ పార్టీల అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. జిల్లాలోని మూడు నియోజక వర్గాల కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపుపై ధీమాతో ఉన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థులు కొప్పుల ఈశ్వర్‌, శ్రీనివాస్‌ గొమాసె తమదైన శైలిలో లెక్కలు వేస్తూ తామే గెలుస్తామనే విశ్వాసంతో ఉన్నారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో మొత్తం 42 మంది నామినేషన్లు దాఖలు చేయగా, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది.

ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలపై ఆసక్తి

కొద్ది గంటల్లో ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల నాయకులు ఎగ్జిట్‌ పోల్‌ సర్వేల ఆసక్తితో ఉన్నారు. దేశవ్యాప్తంగా పలు మీడియా, సర్వే సంస్థలు రాష్ట్రంలో ప్రధానంగా కాంగ్రెస్‌, బీజేపీ మధ్య పోటీ నువ్వా....నేనా అన్నట్లు ఉంటుందని ఫలితాలు వెల్లడిస్తుండటంతో ఆ పార్టీల నాయకులు తీవ్ర ఉత్కంఠతకు గురవుతున్నారు. పెద్దపల్లి నియోజక వర్గంలో దాదాపుగా అన్ని సర్వేలు కాంగ్రెస్‌ వైపే మొగ్గు చూపుతుండటంతో హస్తం పార్టీ అభ్యర్థి జెండా ఎగుర వేస్తారని భావిస్తున్నారు. దీంతో ఇతర పార్టీల నాయకులు ఒకింత ఆందోళనకు గురవుతుండగా, ఎవరికి వారే ఫలితాలు తమకే అనుకూలిస్తాయనే అంచనాలో ఉన్నారు.

కౌంటింగ్‌కు సిద్ధం

మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల ఓట్లకు సంబంధించి కౌంటింగ్‌ కేంద్రాన్ని హాజీపూర్‌ మండలం ముల్కల్లలోని ఐజా ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేశారు. కళాశాల గ్రౌండ్‌ ఫ్లోర్‌లో చెన్నూరు నియోజకవర్గ కౌంటింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా, బెల్లంపల్లి నియోజకవర్గానికి మొదటి అంతస్తు, మంచిర్యాల నియోజకవర్గానికి రెండో అంతస్తులో కౌంటింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం ఉద యం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు జరుగనుండగా, అనంతరం ఈవీఎంలలో పోలైన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. జిల్లాలోని మూడు నియోజక వర్గాల్లో 741 పోలింగ్‌ కేంద్రాలకుగాను మంచిర్యాల పరిధిలో 21 రౌండ్లు కౌంటింగ్‌ జరుగనుండగా, చెన్నూరు, బెల్లంపల్లి పరిధిలో 17 రౌండ్ల చొప్పున లెక్కింపు చేపట్టనున్నారు.ఒక్కో సెగ్మెంట్‌కు 14 టేబుళ్ల చొప్పున ఏర్పాట్లు చేశారు.

కౌంటింగ్‌కు మూడంచెల భద్రత...

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు రోజున పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు. వాహనాల పార్కింగ్‌, హైవే భద్రతతోపాటు కౌంటింగ్‌ హాలు వద్ద సీఆర్‌పీఎఫ్‌, ఆర్మ్‌డ్‌ రిజర్వు, లోకల్‌ పోలీసుల ఆధ్వర్యంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు. రామగుండం సీపీ పర్యవేక్షణలో డీసీపీ అశోక్‌ కుమార్‌ నేతృత్వంలో ఐదుగురు ఏసీపీ ర్యాంకు అధికారుల పర్యవేక్షణలో భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం 6 నుంచి 24 గంటలపాటు 144 సెక్షన్‌ అమలులో ఉండనుంది. పార్లమెంట్‌ ఎన్నికల కౌంటింగ్‌ వేళ విజయోత్సవ ర్యాలీలకు పోలీస్‌శాఖ అనుమతి నిరాకరించింది. పోలీస్‌శాఖ ఆంక్షల నేపథ్యంలో ఎలాంటి ఊరేగింపులు, సభలు, సమావేశాలు నిర్వహించేందుకు అనుమతి లేదు.

మద్యం దుకాణాలు బంద్‌

ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో మంగళవారం మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసి వేయాలని పోలీస్‌శాఖ ఆదేశాలు జారీ చేసింది. బార్లు, రెస్టారెంట్లు, వైన్‌ షాపులను నిర్ణీత సమయం మేరకు మూసి ఉంచాలని స్పష్టం చేసింది.

ఫ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 15,96,430 ఓట్లకుగాను 10,83,453 ఓట్లు 67.87 శాతం పోలయ్యాయి. ఇందులో పురుషులు 7,87,705 మందికిగాను, 5,40,774 మంది, మహిళలు 8,08,622 మందికిగాను 5,42,646, మంది ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఇతరుల్లో 130 మందికి గాను 33 మంది ఓట్లు వేశారు.

Updated Date - Jun 03 , 2024 | 11:14 PM