Share News

కార్పొరేట్‌ కళాశాలల అడ్మిషన్ల వేట

ABN , Publish Date - Apr 13 , 2024 | 10:12 PM

హలో నమస్కారమండి.. మీ పాప, బాబు పదో తరగతి అయిపోయింది ఇంటర్‌కు ఏం ప్లాన్‌ చేస్తున్నారు... మాది కార్పొరేట్‌ కాలేజీ. ఐఐటీ, మెయిన్స్‌ ఏసీ, నాన్‌ ఏసీ స్పెషల్‌ బ్యాచ్‌లు ఉన్నాయి... ఇప్పుడు జాయిన్‌ అయితే డిస్కౌంట్‌ కూడా ఇస్తున్నాం. ఫలితాలు వచ్చాక సీట్లు ఉండవు. ఫీజులు పెరుగుతాయి... ఇది జిల్లాలోని పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు రోజు వస్తున్న ఫోన్‌కాల్స్‌...

కార్పొరేట్‌ కళాశాలల అడ్మిషన్ల వేట

జైపూర్‌, ఏప్రిల్‌ 13: హలో నమస్కారమండి.. మీ పాప, బాబు పదో తరగతి అయిపోయింది ఇంటర్‌కు ఏం ప్లాన్‌ చేస్తున్నారు... మాది కార్పొరేట్‌ కాలేజీ. ఐఐటీ, మెయిన్స్‌ ఏసీ, నాన్‌ ఏసీ స్పెషల్‌ బ్యాచ్‌లు ఉన్నాయి... ఇప్పుడు జాయిన్‌ అయితే డిస్కౌంట్‌ కూడా ఇస్తున్నాం. ఫలితాలు వచ్చాక సీట్లు ఉండవు. ఫీజులు పెరుగుతాయి... ఇది జిల్లాలోని పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు రోజు వస్తున్న ఫోన్‌కాల్స్‌... ఇంటర్‌ కాలేజీల యాజమాన్యాల ప్రత్యేకంగా పీఆర్‌వోలను నియమించుకుని ప్రవేశాల కోసం గాలం వేస్తున్నాయి.

తాము పడిన కష్టాలు తమ పిల్లలు పడకూడదని తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. కూలీ పనులు చేసైనా సరే మంచి కళాశాలలో చదివించాలనే ఆలోచనలో ఉన్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని అందిన కాడికి దోచుకునేందుకు కార్పొరేట్‌ కళాశాలలు సిద్ధమవుతున్నాయి. ఆకట్టుకునేలా బ్యాచ్‌కో పేరు పెట్టి రంగు రంగుల బ్రోచర్లు చూపి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం పదో తరగతి ఫలితాలు రాకముందే నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్‌ల వేట ప్రారంభించారు.

-ఆఫర్‌లతో ఆకట్టుకునేలా....

ఆయా కళాశాలలు నియమించుకున్న పీఆర్‌వోలు విద్యార్థుల ఇండ్ల వద్దకు క్యూ కడుతున్నారు. మూడు నెలల ముందు నుంచే ఈ తతంగం మొదలైంది. వీరు పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల వివరాలు ఫోన్‌ నెంబర్లు, చిరునామా సేకరిస్తున్నారు. వివరాలు ఇచ్చినందుకు పాఠశాలల యాజమాన్యాలకు విందులు, నజరానాలు సమకూర్చుతున్నారు. నిబంధనల ప్రకారం విద్యార్థుల వివరాలు ఎవరికి ఇవ్వరాదు. కానీ కాసులకు కక్కుర్తి పడి కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఈ విధంగా వ్యవహరిస్తున్నాయి. హైద్రాబాద్‌కు చెందిన పలు కళాశాలల వారు జిల్లాలో పీఆర్‌వోలను నియమించుకున్నారు. వారు ఉదయం నుంచి రాత్రి వరకు విద్యార్ధుల ఇండ్లకు వెళ్లి బ్రోచర్లు ఇవ్వడం, వారి కళాశాలల గురించి వివరిస్తున్నారు.

-టార్గెట్‌ పెడుతూ....

కొన్ని యాజమాన్యాలు పీఆర్‌వోలను ప్రత్యేకంగా నియమించుకుని ఏడాది పాటు వేతనాలు ఇస్తున్నాయి. అడ్మిషన్‌లు ఎక్కువగా చేసిన వారికి ఇన్సెంటివ్‌లు అందజేస్తున్నాయి. మరో వైపు సంబంధిత కళాశాలలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది, అధ్యాపకులు తప్పకుండా 25 మంది అడ్మిషన్‌లు తీసుకురావాలని టార్గెట్‌లు పెడుతున్నారు. వేసవిలో తరగతులు ఉండకపోవడంతో వారికి సగం వేతనమే చెల్లిస్తున్నారు. ప్రవేశాలు చేసిన వారికి ఇన్సెంటివ్‌, కొంత కమీషన్‌ ఇస్తున్నారు. ఎవరైనా అడ్మిషన్‌లు చేస్తే సాధారణ కళాశాలలకు వెయ్యి రూపాయలు, కార్పొరేట్‌ కళాశాలలకు రూ. 5 వేల వరకు, హాస్టల్‌ క్యాంపస్‌ ఉన్న కళాశాలల్లో చేర్పిస్తే 2,500 అందజేస్తున్నాయి.

-జిల్లాలో కళాశాలలు...

జిల్లాలో ప్రభుత్వ కళాశాలలు 10, ప్రైవేటు కళాశాలలు 20, సొసైటీ కళాశాలలు 36 ఉన్నాయి. మొత్తం 66 కళాశాలలు ఉన్నాయి.

-నిబంధనలకు విరుద్ధంగా

పదో తరగతి పరీక్షల ఫలితాలు వెలువడిన తర్వాత మే, జూన్‌ నెలల్లో అడ్మిషన్‌లు ప్రారంభించాలి. అయితే నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాల ప్రక్రియ నిర్వహిస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపస్తున్నాయి. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

ప్రభుత్వ కళాశాలల్లో చేర్పించండి - శైలజ, డీఐఈవో

ప్రభుత్వ కళాశాలల్లో అనుభవజ్ఞులైన అధ్యాపకుల ఆధ్వర్యంలో నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. తల్లిదండ్రులు ఆలోచించి పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులను ప్రభుత్వ కళాశాలల్లో చేర్పించాలి. ప్రభుత్వ కళాశాలల్లో ఉచితంగా అడ్మిషన్‌లతో పాటు పాఠ్యపుస్తకాలు అందిస్తున్నాం. స్కాలర్‌షిప్‌ కూడా పొందవచ్చు. తల్లిదండ్రులు ఆలోచించి ప్రభుత్వ కళాశాలల్లో చేర్పించాలి.

Updated Date - Apr 13 , 2024 | 10:12 PM