Share News

శైవక్షేత్రాల్లో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ABN , Publish Date - Mar 09 , 2024 | 09:57 PM

మహాశివరాత్రిని పురస్కరించుకుని మండలంలోని వేలాలలో శనివారం భక్తుల రద్దీ కొనసాగింది. శుక్రవారం గుట్టపైన గట్టు మల్లన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న భక్తులు శనివారం తెల్లవారుజామున గుట్ట కిందకు పయనమయ్యారు.

శైవక్షేత్రాల్లో కొనసాగుతున్న భక్తుల రద్దీ

జైపూర్‌, మార్చి 9: మహాశివరాత్రిని పురస్కరించుకుని మండలంలోని వేలాలలో శనివారం భక్తుల రద్దీ కొనసాగింది. శుక్రవారం గుట్టపైన గట్టు మల్లన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న భక్తులు శనివారం తెల్లవారుజామున గుట్ట కిందకు పయనమయ్యారు. గ్రామంలోని మల్లికా ర్జున స్వామిని దర్శించుకోవడానికి ముందుగా గోదావరి పుష్కరఘాట్‌ వద్ద పుణ్యస్నానాలు ఆచరించి స్వామి దర్శనానికి ఆలయం వద్ద బారులు తీరారు. ఆయాప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు బోనాలు వండి స్వామికి నైవేద్యం సమర్పించారు. కొందరు భక్తులు గొర్రె పిల్లలతో గోదారమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. గోదావరి సమీపాన భక్తులు తలనీలాలు సమర్పించారు. సుమారు 2 లక్షల మందికి పైగా భక్తులు మల్లికార్జున స్వామిని దర్శించుకున్నట్లు ఆలయ ఈవో రమేష్‌ పేర్కొన్నారు. డీసీపీ అశోక్‌కుమార్‌, జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు పోలీసులు కంట్రోల్‌రూంను ఏర్పాటు చేసి జాతర ప్రదేశాలను, రద్దీ ప్రాంతాలను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించారు. గోదావరి ఒడ్డున స్నానాలు చేస్తున్న సమయంలో భక్తులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు. ఎంపీడీవో సత్యనారాయణ జాతర పనులను పరిశీలిస్తూ గ్రామంలో పారిశుధ్య లోపం తలెత్తకుండా సిబ్బందితో చర్యలు చేపట్టారు. మంచిర్యాల, గోదా వరిఖని, మంథని డిపోల నుంచి ఆర్టీసీ బస్సులు నడిపించారు.

చెన్నూరు: మహాశివరాత్రిని పురస్కరించుకుని కత్తెరసాల గ్రామంలో మల్లికార్జునస్వామి ఆలయంలో జాతర కొనసాగు తుంది. శనివారం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బోనాలు పోసి తీపి పదార్ధాలతో స్వామి వారికి నైవేద్యాలు సమర్పించారు. ఒగ్గు పూజారులు పట్నాలు వేశారు. ఆలయం ఆవరణలో మహిళలు పూనకాలతో ఊగిపోయారు. ఆలయం భక్తులతో కిటకిటలాడింది. విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భాస్కర్‌రెడ్డి, మధుకర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, లక్ష్మీనారాయణరెడ్డి, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

దండేపల్లి: యాదవ కులస్ధుల ఆరాఽధ్యదైవమైన దండేపల్లి మండలం పెద్దపేట శివారులో పావురాజేశ్వరుడి(అల్లంల పావురాయుడుస్వామి) దేవాలయంలో శనివారం జాతర వైభవంగా జరిగింది. మహాశివరాత్రి సందర్బంగా శుక్రవారం నుంచే గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి పావురాజేశ్వరుడి స్వామి దేవాలయానికి యాదవ కులస్ధులు కుటుంబ సమేతంగా తరలివచ్చి స్వామికి ప్రత్యేక పూజ, జాగరణ చేశారు. పావురాజేశ్వరుడి స్వామికి ప్రత్యేక నైవేద్యాలు వండి ఆలయం చుట్టు ప్రదక్షణ చేసి సమర్పించారు. దేవతామూర్తులను గంగజలాభిషేకం పూజలు చేశారు. శివసత్తుల పూనకాలతో ఆలయం చుట్టు ప్రదక్షిణ చేశారు. యేటా శివరాత్రి తర్వాత పిల్లల పుట్టు వెంట్రుకలతోపాటు ఎత్తు బంగారం (బెల్లం) వేస్తారు. జాతరకు ఉమ్మడి జిల్లాతో పాటు జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌ జిల్లాల నుంచి వేలాది మంది యాదవ కులస్ధులు కుటుంబ సమేతంగా తరలివచ్చి స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వద్ద పలు రకాల దుకాణాలు వెలిశాయి.

Updated Date - Mar 09 , 2024 | 09:57 PM