Share News

శుభాకార్యాలకు కోడ్‌ కష్టాలు

ABN , Publish Date - Apr 03 , 2024 | 10:14 PM

న్నికల కోడ్‌ శుభాకార్యాలకు ఇబ్బందులు తెచ్చి పెడుతోంది. ఈ నెల 27 వరకు వివాహ ముహూర్తాలు అధికంగా ఉన్నాయి. పలు ప్రాంతాల నుంచి ప్రజలు దుస్తులు, వస్తువులు కొనుగోళ్లకు పట్టణాలకు నగదు తో వెళితే పోలీసులు పట్టుకోవడం తలనొప్పిగా మారింది.

శుభాకార్యాలకు కోడ్‌ కష్టాలు

కోటపల్లి, ఏప్రిల్‌ 3: ఎన్నికల కోడ్‌ శుభాకార్యాలకు ఇబ్బందులు తెచ్చి పెడుతోంది. ఈ నెల 27 వరకు వివాహ ముహూర్తాలు అధికంగా ఉన్నాయి. పలు ప్రాంతాల నుంచి ప్రజలు దుస్తులు, వస్తువులు కొనుగోళ్లకు పట్టణాలకు నగదు తో వెళితే పోలీసులు పట్టుకోవడం తలనొప్పిగా మారింది. పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో కోట్లలో వ్యాపారం జరుగుతుంది. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో నగదు లావాదేవీలకు కష్టకాలం వచ్చింది. వస్తువుల కొనుగోలుతో పాటు ఫంక్షన్‌హాళ్ల బుకింగ్‌, బంగారం, వస్ర్తాల కొనుగోలుకు తిప్పలు తప్పడం లేదు. పెళ్లి సామగ్రిని సమకూర్చుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. మండలంలోని అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద మహారాష్ట్రలోని అంకీసా గ్రామానికి చెందిన ధర్మయ్య కూతురు వివాహానికి దుస్తులు కొనేందుకు వధూవరుల కుటుంబాలతో వాహనంలో వెళ్తూ నగదుతో దొరికిపోయాడు. అతని వద్ద ఉన్న రూ. 1.82 లక్షల నగదును ఎస్‌ఎస్‌టీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివాహం నిమిత్తం సామగ్రి కొనుగోలుకు వెళ్తున్నామని చెప్పినప్పటికీ లాభం లేకుండా పోయింది. నగదుకు సంబంధించి సరైన పత్రాలు లేకపోవడంతో అధికారులు సీజ్‌ చేశారు. ఇలాంటి ఘటనలు నిత్యం జిల్లాలో ఏదో ఒక మూలన జరుగుతూనే ఉన్నాయి.

-నగదు స్వీకరణకే మొగ్గు...

ఎన్నికల సంఘం డబ్బు రవాణాకు పరిమితి విధించింది. రూ. 50 వేల నగదుకు మించి వెంట తీసుకువెళితే పోలీసులు తనిఖీలు చేసి ఆధారాలు లేకపోవడంతో సీజ్‌ చేస్తున్నారు. దీంతో వధూవరుల తల్లిదండ్రులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇతర శుభాకార్యాలు చేసే వారు సామగ్రి కొనుగోలు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకువస్తే వాటికి ఆధారాలు చూపించాల్సి వస్తుంది. బంగారం, ఇతర సామాగ్రి కొనాలంటే చేతిలో లక్షల రూపాయలు ఉండాల్సిందే. మరో వైపు ఆన్‌లైన్‌ చెల్లింపులపై ఐటీ ఆంక్షలు కొనసాగుతుండడంతో ఎక్కువ మంది వ్యాపారులు నేరుగా నగదు స్వీకరణకే మొగ్గు చూపుతున్నారు. ఫంక్షన్‌ హాళ్ల నిర్వహకులు, కేటరింగ్‌ సంస్థలు, హోటళ్లు తదితర ఆన్‌లైన్‌ చెల్లింపులు స్వీకరించడానికి ఆసక్తి చూపడం లేదు. కోడ్‌ పుణ్యమాని నగదుతో బయటకు వెళ్లేందుకు ఇబ్బందులు తప్పడం లేదని శుభాకార్యాలు చేసే వారు వాపోతున్నారు.

Updated Date - Apr 03 , 2024 | 10:14 PM