Share News

‘శాలివాహన’ మూసివేత

ABN , Publish Date - Feb 11 , 2024 | 10:23 PM

జిల్లా కేంద్రంలోని పాత మం చిర్యాలలో గల శాలివాహన విద్యుత్‌ ప్లాంటును యాజమాన్యం ఒక్క సారిగా మూసివేయడంతో కార్మిక కుటుంబాలు రోడ్డునపడ్డాయి. ప్లాం టుపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి.

‘శాలివాహన’ మూసివేత

మంచిర్యాల, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని పాత మం చిర్యాలలో గల శాలివాహన విద్యుత్‌ ప్లాంటును యాజమాన్యం ఒక్క సారిగా మూసివేయడంతో కార్మిక కుటుంబాలు రోడ్డునపడ్డాయి. ప్లాం టుపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కంపెనీలో తయారయ్యే విద్యుత్‌ను ప్రభుత్వానికి విక్ర యించేందుకు యాజమాన్యం కుదుర్చుకున్న పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌ (పీపీఏ) ముగియడంతో ఇదే అదునుగా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అకస్మాత్తుగా లాకౌట్‌ చేయడంతో కార్మికులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

2002లో ఉత్పత్తి ప్రారంభం

శాలివాహన గ్రీన్‌ఎనర్జీ లిమిటెడ్‌ పేరుతో ఆరు మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యంతో బయో మాస్‌ పవర్‌ ప్లాంటును 2001లో యాజమాన్యం ప్రారంభించింది. ప్లాంటు ఏర్పాటుకు రైతుల నుంచి 30 ఎకరాల భూమిని కారు చవకగా కొనుగోలు చేసింది. భూములు ఇచ్చిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగావకాశం కల్పిస్తామనడంతో రైతులు ఎకరాకు రూ.40 వేల నుంచి రూ. 80వేల వరకు ధరకు విక్రయించారు. అలా ఏర్పడ్డ ప్లాంటులో 2002 డిసెంబర్‌ 7న వ్యవసాయ వ్యర్థాలతో విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభమైంది. గంటకు 6 మెగావాట్ల (గంటలో 6వేల యూనిట్లు) చొప్పున ఉత్పత్తి కాగా, రోజూ తయారైన 1లక్ష 44వేల పైచిలుకు యూనిట్లను యాజమాన్యం ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేది. తెలంగాణ ఏర్పడ్డ నుంచి యూనిట్‌కు రూ. 5.30 పైసల చొప్పున టీఎస్‌ ట్రాన్స్‌కోకు విక్రయించేలా యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వంతో పీపీఏ (పవర్‌ పర్చేస్‌ అగ్రిమెంటు)ను 20 సంవత్సరాలకు ఒప్పందం కుదుర్చుకుంది. పీపీఏ గడువు 2022 డిసెంబర్‌ 7వ తేదీతో ముగియడంతో రెన్యూవల్‌ చేయించకుండా కంపెనీని యాజమాన్యం లాకౌట్‌ చేసింది. అప్పటి నుంచి కార్మికులకు వేతనాలు చెల్లించకపోగా, నష్టాలు వస్తున్నం దున ప్లాంటును నడపలేమంటూ మూసివేసింది.

బిల్లులు పెండింగ్‌ పేరుతో....

భూముల ధరలు విపరీతంగా పెరగడంతో కంపెనీని మూసి వేయా లని యాజమాన్యం ప్రణాళికలు రూపొంచింది. టీఎస్‌ ట్రాన్స్‌కోకు విద్యుత్‌ను సరఫరా చేస్తున్నప్పటికీ ప్రభుత్వం బిల్లులు చెల్లించడంలో జాప్యం చేస్తుందంటూ యాజమాన్యం వేతనాలు చెల్లించడంలో తాత్సారం చేస్తూ వచ్చింది. నెల బిల్లులు రూ.3 కోట్లతోపాటు ఇంటెన్సివ్‌ మరో రూ.6 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ క్రమంలో కార్మికులకు వేతనాలు చెల్లించలేమంటూ చేతులెత్తేసింది. 14 నెలలుగా వేతనాలు చెల్లించన ప్పటికీ కార్మికులు విధులు నిర్వహించగా, ముడి సరుకుల కొనుగోలుకు పెట్టుబడి లేదని, బిల్లులు విడుదల కానిదే ప్లాంటు నడపలేమని యాజమాన్యం లాకౌట్‌ ప్రకటించింది. దీంతో ప్లాంటులో పని చేస్తున్న కార్మికులు రోడ్డునపడ్డారు. ప్లాంటులో అన్ని విభాగాల్లో ప్రత్యక్షంగా 100 మందికిపైగా కార్మికులు పని చేస్తుండగా మరో 500 మంది పరోక్షంగా ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.

రిలే దీక్షలతో ఆందోళన

కార్మికుల వేతనాలు చెల్లించకుండా యాజమాన్యం వేధిస్తుండటంతో విధిలేని పరిస్థితుల్లో కార్మికులు ఆందోళనబాట పట్టారు. కంపెనీ ఎదుట మూకుమ్మడిగా రిలే దీక్షలకు పూనుకున్నారు. 12 రోజులుగా ప్లాంటు ఎదుట పడిగాపులు కాస్తున్నారు. ఒక దశలో కార్మికులను చర్చలకు ఆహ్వానించిన యాజమాన్యం తలో లక్ష రూపాయలు చెల్లిస్తాం కంపెనీని వదిలి వెళ్ళాలని హుకుం జారీ చేసింది. ఒక్కొక్కరికి రూ.10 లక్షలు చెల్లించాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు.

ప్లాంటు ఏర్పాటుకు భూములిచ్చాం

....నిమ్మరాజుల సత్యనారాయణ, కార్మికుడు

విద్యుత్‌ ప్లాంటులో ఉద్యోగం వస్తుందనే ఆశతో భూములు ఇచ్చాం. ఏడు ఎకరాల భూమిని ఎకరాకు రూ. 60వేల చొప్పున అప్పగించాం. ఇన్నాళ్లు ఆధారపడ్డ మాకు ప్లాంటు మూసివేత కారణంగా ఉద్యోగం పోయింది. తిరిగి సాగు చేసేకుందామన్నా భూములు కూడా లేకపోవడంతో కుటుంబాలను ఎలా పోషించాలో తెలియడంలేదు.

కంపెనీని ఆదుకోవాలి...

శెట్టి శ్రీనివాస్‌, విద్యుత్‌ ప్లాంటు యూనియన్‌ నాయకుడు

18 సంవత్సరాలుగా ప్లాంటునే నమ్ముకొని జీవనం సాగిస్తున్నాం. వందలాది మంది కార్మికులకు జీవనోపాధి లభిస్తోంది. నష్టాలు వస్తున్నాయనే పేరుతో అకస్మాత్తుగా లాకౌట్‌ చేయడం సరికాదు. ప్లాంటు మూసివేతతో కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కార్మికులు కోరిన పరిహారం చెల్లించాలి. లేదంటే ప్లాంటు కోసం సేకరించిన భూములను తిరిగి రైతులకు అప్పగించాలి.

Updated Date - Feb 11 , 2024 | 10:23 PM