Share News

ఎన్‌హెచ్‌-63 రహదారి నిర్మాణంలో మార్పు

ABN , Publish Date - Jan 07 , 2024 | 10:21 PM

నాలుగు వరుసల రహదారి నిర్మాణంలో నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తొలుత రూపొందించిన రూట్‌ మ్యాప్‌ను పక్కనబెట్టి కొత్తది తయారు చేయడంతో తమకు నష్టం వాటిల్లుతుందని ప్రజలు వాపోతున్నారు.

ఎన్‌హెచ్‌-63 రహదారి నిర్మాణంలో మార్పు

మంచిర్యాల, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): నాలుగు వరుసల రహదారి నిర్మాణంలో నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తొలుత రూపొందించిన రూట్‌ మ్యాప్‌ను పక్కనబెట్టి కొత్తది తయారు చేయడంతో తమకు నష్టం వాటిల్లుతుందని ప్రజలు వాపోతున్నారు. నెలలపాటు సర్వే జరిపి రూపొందించిన ప్లాన్‌ను కాదని మరోచోట నిర్మించతలపెట్టడం వివాదానికి దారితీస్తోంది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు రూట్‌ మ్యాప్‌ను మార్చినట్లు ఆరోపణలున్నాయి. జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో సంబంఽధిత శాఖల అధికారులు చేపట్టిన సర్వే పట్ల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

ఆర్మూర్‌ టు మంచిర్యాల...

కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు ఎన్‌హెచ్‌-63ను నాలుగు వరుసల రహదారిగా విస్తరించనున్నారు. గ్రీన్‌ హైవే పేరుతో నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ నుంచి మోర్తాడ్‌, కుమ్మరిపల్లి, జగిత్యాల, ధర్మపురి, రాయపట్నం, లక్షెట్టిపేట మీదుగా మంచిర్యాల జిల్లా కేంద్రం వరకు నాలుగు వరుసల రహదారిగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ భూ సేకరణకు గతేడాది మార్చి 14న నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా దాదాపు 160 కిలోమీటర్ల దూరం రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనుండగా జిల్లాలో 36.25 కిలోమీటర్ల మేర విస్తరణ పనులు జరుగనున్నాయి. రోడ్డు విస్తరణలో భూములు, ఇళ్లు కోల్పోయేవారికి 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతుండగా, అరకొర చెల్లింపుల పట్ల ప్రజలు ఆందోళనలకు పూనుకుంటున్నారు.

కొత్త రూట్‌ మ్యాప్‌తో ఆందోళన

మొదటి రూట్‌ మ్యాప్‌ ప్రకారం జిల్లాలోని గూడెం నుంచి లక్షెట్టిపేట మీదుగా గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణం జరగాల్సి ఉంది. ఇందులో భాగంగా రహదారి హాజీపూర్‌ మండలంలోని ముల్కల్ల వద్ద వాగు ఒడ్డు నుంచి నేరుగా మందమర్రి మండలం క్యాతనపల్లి వద్ద కాగజ్‌నగర్‌-మంచిర్యాల నేషనల్‌ హైవే 363కి అనుసంధానం చేయాలి. అయితే రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కొత్త రూట్‌ మ్యాప్‌ తెరపైకి వచ్చింది. కొత్త రూట్‌ మ్యాప్‌ ముల్కల్లలోని క్రైస్తవ ఆసుపత్రి, నర్సింగ్‌ కళాశాల మధ్య నుంచి రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. దీంతో కోట్లాది రూపాయల విలువ చేసే భూములను ప్రజలు కోల్పోవలసి వస్తుంది.

గోదావరి తీరం వెంట రహదారి నిర్మాణం

రహదారి నిర్మాణం కోసం లక్షెట్టిపేట, హాజీపూర్‌, మందమర్రి మండలాలతోపాటు జిల్లా కేంద్రంలో మొత్తం 17 రెవెన్యూ గ్రామాల నుంచి 574.31 హెక్టార్ల భూమిని సేకరించాలని నిర్ణయించారు. లక్షెట్టిపేట మండలంలోని మోదెల నుంచి హాజీపూర్‌ మండలంలోని ముల్కల్ల వరకు కొత్త అలైన్‌మెంట్‌ ప్రకారం ప్రస్తుతం జనావాసాలకు దూరంగా గోదావరి నదికి సమాంతరంగా నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. గోదావరి తీరం నుంచి కనీసం 500 మీటర్ల దూరంలో మెట్ట భూముల నుంచి గ్రీన్‌ఫీల్డ్‌ హైవే వెళ్లే విధంగా సర్వే చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా ముల్కల్ల వద్ద ఉన్న ప్రస్తుత హైవేను దాటే క్రమంలో అధికారులు మళ్లీ పాత రూట్‌ మ్యాప్‌ అమలు చేస్తుండటంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

రూట్‌మ్యాప్‌లో మార్పులెక్కడ...?

ఎన్‌హెచ్‌-63 కోసం మొదట రూపొందించిన అలైన్‌మెంట్‌ ప్రకారం ముల్కల్ల సమీపంలోని వాగుకు సమాంతరంగా రహదారి వెళ్లాల్సి ఉంది. అందుకు భిన్నంగా రెండో రూట్‌ మ్యాప్‌లో వాగుకు దూరంగా ఖరీదైన ఇళ్ల స్థలాల మధ్య నుంచి రహదారి నిర్మాణానికి అధికారులు మార్కింగ్‌ చేశారు. ఎనిమిది నెలల క్రితం హైవే అథారిటీ పనులను అడ్డుకున్న బాధితులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బాధితులు ఢిల్లీకి వెళ్లి కేం ద్ర మంత్రులను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో ఇంతకాలం పనులు నిలిచిపోగా, కేంద్రం సూచన మేరకు మూడో రూట్‌ మ్యాప్‌ను అధికారులు రూపొందించారు. ఈ ప్లాన్‌ ప్రకారం గోదావరికి సమాంత రంగా రహదారి నిర్మాణం జరిగి, ముల్కల్ల వద్ద వాగుకు సమాంతరంగా వెళ్లాల్సి ఉంది. అయితే ముల్కల్ల వద్దకు వచ్చే సరికి అధికారులు మళ్లీ రెండో రూట్‌ మ్యాప్‌నే ఫైనల్‌ చేయడంతో పరిస్థితి మొదటికి వచ్చింది. రూట్‌ మ్యాప్‌ మార్చినా వాగుకు సమాంతరంగా కాకుండా ఇళ్ల స్థలాల నుంచి రహదారి నిర్మాణానికి అధికారులు పూనుకున్నారు. దీంతో అత్యంత విలువైన భూములు కోల్పోవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం రహదారి నిర్మాణంలో రూ.20 కోట్లు విలువ చేసే ఆరెకరాల భూములను ప్రజలు కోల్పోతున్నారు. అక్కడి భూముల విలువ ప్రస్తుతం చదరపు గజం ఒక్కంటికి రూ.8 వేలు పలుకుతుండగా, ప్రభుత్వ పరంగా బాధి తులకు రూ.700 చెల్లించేందుకు రంగం సిద్ధమైంది. దీంతో బాధితులంతా రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని నేషనల్‌ హైవే అథారిటీస్‌ ఆఫ్‌ ఇండియా కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ముల్కల్ల వద్ద విలువైన భూముల నుంచి కాకుండా వాగుకు సమాంతరంగా రహదారి నిర్మాణం చేపట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Updated Date - Jan 07 , 2024 | 10:21 PM