Share News

బెల్లంపల్లిలో వీగింది నస్పూర్‌లో నెగ్గింది

ABN , Publish Date - Jan 12 , 2024 | 10:08 PM

బెల్లంపల్లి, నస్పూర్‌ మున్సిపాలిటీల్లో శుక్రవారం చైర్మన్లపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాల్లో వేర్వేరు ఫలితాలు వచ్చాయి. అయినప్పటికీ రెండు మున్సిపాలిటీలను కాంగ్రెస్‌ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. గతంలో బీఆర్‌ఎస్‌ పరిపాలనలో ఉన్న మున్సిపాలిటీల్లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం పెను మార్పులు చోటు చేసుకున్నాయి.

బెల్లంపల్లిలో వీగింది  నస్పూర్‌లో నెగ్గింది

మంచిర్యాల, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): బెల్లంపల్లి, నస్పూర్‌ మున్సిపాలిటీల్లో శుక్రవారం చైర్మన్లపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాల్లో వేర్వేరు ఫలితాలు వచ్చాయి. అయినప్పటికీ రెండు మున్సిపాలిటీలను కాంగ్రెస్‌ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. గతంలో బీఆర్‌ఎస్‌ పరిపాలనలో ఉన్న మున్సిపాలిటీల్లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం పెను మార్పులు చోటు చేసుకున్నాయి. మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థులు కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, గడ్డం వినోద్‌లు ఎమ్మెల్యే లుగా గెలుపొందడంతో బీఆర్‌ఎస్‌ పార్టీ కౌన్సిలర్లు కాంగ్రెస్‌ కండువాలు కప్పుకున్నారు. మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ సభ్యుల సంఖ్య పెరగడంతో రెండు చోట్ల చైర్మన్లు, వైస్‌ చైర్మన్లపై అవిశ్వాసం కోరుతూ మెజార్టీ కౌన్సిలర్లు కలెక్టర్‌కు నోటీసులు అందజేయగా శుక్రవారం ప్రత్యేక సమా వేశాలు ఏర్పాటు చేశారు. నస్పూర్‌ మున్సిపాలిటీలో 25 మంది వార్డులు ఉండగా, సమావేశానికి 19 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. సరిపడా కోరం సభ్యులు అవిశ్వాస తీర్మానాన్ని బలపరచడంతో చైర్మన్‌ ప్రభాకర్‌పై ప్రవేశపెట్టిన తీర్మానం నెగ్గింది. బెల్లంపల్లి మున్సిపాలిటీలో చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత, వైస్‌ చైర్మన్‌ బత్తుల సుదర్శన్‌లపై అవిశ్వాసం వీగింది. బెల్లంపల్లిలో 34 వార్డులు ఉండగా అవిశ్వాస పరీక్ష నిర్వహించేందుకు 22 మంది కౌన్సిల్‌ సభ్యుల ఫోరం ఉండాలి, కానీ 20 మంది మాత్రమే ఉండడంతో చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌పై అవిశ్వాసం వీగిపోయినట్లు ప్రిసైడింగ్‌ అధికారి హరికృష్ణ ప్రకటించారు. దీంతో చైర్‌పర్సన్‌గా జక్కుల శ్వేత, వైస్‌ చైర్మన్‌గా బత్తుల సుదర్శన్‌లు వారి పదవుల్లో కొనసాగనున్నారు.

క్యాతన్‌పల్లి, లక్షెట్టిపేటలోనూ అవిశ్వాసం

జిల్లాలో మొత్తం ఏడు మున్సిపాలిటీలు ఉండగా మందమర్రి మినహా మిగతా ఆరు చోట్ల పాలకవర్గాలు ఉన్నాయి. వీటిలో అవిశ్వాస తీర్మానాల ద్వారా ఇప్పటికే మంచిర్యాల, బెల్లంపల్లి, నస్పూర్‌ మున్సిపాలిటీలను కాంగ్రెస్‌ పార్టీ హస్తగతం చేసుకుంది. మిగిలిన చెన్నూరు, క్యాతనపల్లి, లక్షెట్టిపేట మున్సిపాలిటీల్లో చెన్నూరు మినహా మిగతా రెండు చోట్ల కౌన్సిలర్లు అవిశ్వాసం కోరుతూ కలెక్టర్‌కు నోటీసులు అందజేశారు. రెండు చోట్ల ప్రత్యేక సమావేశాలు తేదీ ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లే ఆ పార్టీ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్లను గద్దె దించేందుకు అవిశ్వాసాన్ని కోరగా, లక్షెట్టిపేటలో బీఆర్‌ఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లపై కాంగ్రెస్‌ కౌన్సిలర్లు అవిశ్వాసం కోరుతున్నారు.

నస్పూర్‌ మున్సిపాలిటీలో నెగ్గిన అవిశ్వాసం

నస్పూర్‌: నస్పూర్‌ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గింది. చైర్మన్‌ పీఠాన్ని కాంగ్రెస్‌ పార్టీ దక్కించుకుంది. దీంతో నాలుగేళ్లపాటు చైర్మన్‌గా కొనసాగిన ఈసంపల్లి ప్రభాకర్‌ పదవిని కోల్పోయాడు. కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ ఆదేశాల మేరకు మంచిర్యాల ఆర్డీవో, ప్రిసైడింగ్‌ అధికారి వాడాల రాములు మున్సిపల్‌ కార్యాలయంలో శుక్రవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. నస్పూర్‌ మున్సిపాలిటీలో 25 వార్డులున్నాయి. కొన్ని రోజుల నుంచి హైదరాబాద్‌ క్యాంపులో ఉన్న కౌన్సిలర్లు నేరుగా ప్రత్యేక సమావేశానికి హాజరయ్యారు. సమావేశానికి అవసరమయ్యే కోరం 17 మంది కావాల్సి ఉండగా మొత్తం 19 మంది హాజరయ్యారు. చైర్మన్‌ ఈసంపల్లి ప్రభాకర్‌పై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై సభ్యులు సమ్మతి తెలుపుతూ 19 మంది చేతులెత్తారు. దీంతో చైర్మన్‌ ప్రభాకర్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గిందని ప్రిసైడింగ్‌ ప్రకటించారు. నివేదికను కలెక్టర్‌కు పంపిస్తానని, తదుపరి చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నిక తేదీని నిర్ణయిస్తారని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ కార్య కర్తలు, నాయకులు మున్సిపల్‌ కార్యాలయానికి తరలివచ్చారు. అవిశ్వాసం నెగ్గడంతో కాంగ్రెస్‌ శ్రేణులు సంబరాలను నిర్వహించారు. మున్సిపల్‌ కార్యాలయం వద్ద సీఐలు ఇద్దరు, ఎస్సైలు ముగ్గురు, మహిళ ఎస్సై, బందోబస్తు ఏర్పాటు చేశారు.

బెల్లంపల్లిలో...

బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత, వైస్‌ చైర్మన్‌ బత్తుల సుదర్శన్‌లపై అవిశ్వాసం వీగింది. చైర్‌పర్సన్‌, వైస్‌చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కలెక్టర్‌కు కౌన్సిలర్లు దరఖాస్తు చేసుకోవడంతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటలకు మున్సిపల్‌ కార్యాలయంలో ప్రిసైడింగ్‌ అధికారి హరికృష్ణ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేతపై సమావేశం చేపట్టారు. క్యాంపు నుంచి నేరుగా కౌన్సిల్‌ సభ్యులు ప్రత్యేక వాహనాల్లో మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకున్నారు. కోరం 22 మంది కౌన్సిల్‌ సభ్యులకుగాను 20 మంది మాత్రమే ఉండడంతో చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌పై అవిశ్వాసం వీగిపోయిందని ప్రిసైడింగ్‌ అధికారి ప్రకటించారు. చైర్‌పర్సన్‌గా జక్కుల శ్వేత, వైస్‌ చైర్మన్‌గా బత్తుల సుదర్శన్‌లు యథావిధిగా వారి పదవుల్లో కొనసాగనున్నారు. ఏసీపీ సద య్య ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

అవిశ్వాసానికి మరో అవకాశం ఇవ్వాలి

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌లపై అవిశ్వాసానికి మరో అవకాశం ఇవ్వాలని కౌన్సిలర్లు కోరారు. మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో వారు మాట్లాడుతూ కలెక్టర్‌ నుంచి వచ్చిన నోటీసుల్లో కోరంకు సంబంధించి ఎంత మంది సభ్యులు ఉండాలో వివరాలు పొందుపర్చలేదని పేర్కొ న్నారు. మెజార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస పరీక్షకు హాజరయ్యారని, ఈ నెల 27 వరకు అవిశ్వాస సమావేశానికి సమయం ఉందని, మరో అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. అధికారులు స్పందించకపోతే కోర్టుకు వెళ్తామని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్‌, ఎంపీ వెంకటేష్‌ నేతలతో పాటు మంత్రి కేటీఆర్‌ సైతం 18 మంది కౌన్సిలర్లు అందరం రాజీనామా చేస్తే పట్టించుకోకపోవడం సిగ్గు చేటన్నారు. అవిశ్వాసం వీగిపోయినా చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లపై నైతిక విజయం తమదేనని అసమ్మతి కౌన్సిలర్లు పేర్కొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 10:08 PM