Share News

విత్తనాలు.. ఎరువుల కొనుగోళ్లలో జాగ్రత్త

ABN , Publish Date - May 28 , 2024 | 10:16 PM

దుక్కి దున్నింది మొదలు పంట చేతికొచ్చే వరకు రైతులు పలు జాగ్రత్తలు పాటించాలి. సరైన పంట దిగుబడి రావాలంటే విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల కొనుగోళ్లలో అప్రమత్తంగా ఉండాలి.

విత్తనాలు.. ఎరువుల కొనుగోళ్లలో జాగ్రత్త

నెన్నెల, మే 28: దుక్కి దున్నింది మొదలు పంట చేతికొచ్చే వరకు రైతులు పలు జాగ్రత్తలు పాటించాలి. సరైన పంట దిగుబడి రావాలంటే విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల కొనుగోళ్లలో అప్రమత్తంగా ఉండాలి. జిల్లాలో యేటా సీజన్‌ ప్రారంభంలో నకిలీ విత్తనాలు జోరుగా సరఫరా అవుతున్నాయి. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. వ్యవసాయ, పోలీస్‌ శాఖల అధికారులు సంయుక్తంగా టాస్క్‌ ఫోర్స్‌గా ఏర్పాటై జిల్లాలో గల ఎరువులు, క్రిమిసంహారక మందులను పరిశీలిస్తున్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. విత్తన ఎంపిక నుంచి పంట దిగుబడి పొందే వరకు శాస్త్రీయంగా సేద్యపు పద్ధతులు అవలంబించడంతోపాటు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటేనే ఆరుగాలం శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కుతుందని అధికారులు సూచిస్తున్నారు.

విత్తనాలు, ఎరువులు కొనే ముందు జాగ్రత్త

దళారుల మాయమాటలు నమ్మి నకిలీ, లూజు విత్తనాలు కొనవద్దు

వ్యవసాయశాఖ లైసెన్సు పొందిన డీలరు వద్ద కొనుగోలు చేయాలి.

సరిగా సీల్‌ చేసి ఉన్న ప్యాకెట్లు, బస్తాలను ధ్రువీకరణ పత్రం (ట్యాగ్‌) ఉన్న వాటినే ఎంపిక చేసుకోవాలి.

బస్తా, ప్యాకెట్‌పై గడువు తేది, రకం పేరు, లాట్‌ నంబర్లను గమనించాలి.

కొనుగోలు బిల్లుతోపాటు నంబరు, విత్తన రకం, గడువు తేదీ పేర్కొనేలా డీలరు సంతకంతోపాటు రైతు సంతకం బిల్లుపై ఉండేలా చూసుకోవాలి.

ప్రైవేటు విత్తన సంస్థలు పెద్ద ఎత్తున చేసే ప్రచారానికి ఆకర్షితులై విత్తనాలు కొనుగోలు చేయవద్దు.

విత్తనాన్ని ఎంచుకునే ముందు వ్యవసాయాధికారి, శాస్త్రవేత్తల సూచనలు తీసుకోవాలి.

రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ సరఫరా చేసిన విత్తనాలు ఉంటే వాటినే తీసుకోవడం ఉత్తమం.

పంటల అధిక దిగుబడికి నాణ్యమైన ఎరువులనే వాడాలి.

మిషన్‌ కుట్టు ఉన్న ఎరువుల బస్తాను మాత్రమే కొనాలి.

బస్తాపై ప్రమాణిక పోషకాలు, ఉత్పత్తిదారుల వివరాలు ఉండాలి.

చిరిగిన, రంధ్రాలున్న బస్తాలను తిరస్కరించాలి.

ఖాళీ సంచులను పంటకాలం పూర్తయ్యే వరకు భద్రపర్చాలి.

కొనుగోలు చేసిన ఎరువుల విషయంలో అనుమానం వస్తే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి.

పురుగు మందులపై అవగాహన అవసరం

చీడపీడల నివారణకు వాడే క్రిమిసంహారక మందుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మందుల విషపూరిత స్థాయిని తెలిపేందుకు డైమాండ్‌ ఆకారంలో తెలుపు రంగు వినియోగిస్తారు. వాటి వర్గీకరణను బట్టి విషస్థాయిని అంచనా వేసుకోవచ్చు. ఎరుపు రంగు ఉంటే అత్యంత విష పూరితం. పసుపు రంగు అతి విష పూరితం. నీలి రంగు విష పూరితం, ఆకు పచ్చ రంగు స్వల్ప విష పూరితం అని అర్థం చేసుకోవాలి. వాడిన మందు సీసా, డబ్బా, ప్యాకెట్లను ధ్వంసం చేసి పాతిపెట్టాలి. మందులు కలిపిన పాత్రలను ఇతర అవసరాలకు వాడకూడదు. విచక్షణ రహితంగా పురుగు మందులను వాడటం మంచిదికాదు.

Updated Date - May 28 , 2024 | 10:16 PM