Share News

ఉపాధి కూలీలకు సౌకర్యాలు ఏవీ..?

ABN , Publish Date - Apr 02 , 2024 | 10:20 PM

జిల్లాలో అరకొర సౌకర్యాల నడుమ ఉపాధిహామీ పనులు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వేసవిలో చేపట్టే ఉపాధిహామీ పనులకు సంబంధించి కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. అడవులు, చెరువులు, కాలువల్లో పూడికతీత పనులు చేస్తున్న కూలీలు ఎండలకు విలవిల్లాడుతున్నారు.

ఉపాధి కూలీలకు సౌకర్యాలు ఏవీ..?

మంచిర్యాల, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అరకొర సౌకర్యాల నడుమ ఉపాధిహామీ పనులు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వేసవిలో చేపట్టే ఉపాధిహామీ పనులకు సంబంధించి కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. అడవులు, చెరువులు, కాలువల్లో పూడికతీత పనులు చేస్తున్న కూలీలు ఎండలకు విలవిల్లాడుతున్నారు. కూలీలు సేద తీరేందుకు నీడ తాగునీటి సౌకర్యం కూడా లేదు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పనులు గత నెల 31వ తేదీతో ముగియగా, ఈ నెల 1 నుంచి కొత్త సీజన్‌ పనులు చేపడుతున్నారు.

లక్ష్యం నెరవేరేనా?

2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలో 1లక్షా 20వేల477 కుటుంబాలకు జాబ్‌ కార్డులు ఉండగా, 2 లక్షల 35 వేల 659 మంది ఉపాధి కూలీలు ఉన్నారు. వీరికి డైలీ వేజెస్‌ కింద సవరించిన వేతనం ప్రకారం రూ.300 చొప్పున చెల్లిస్తున్నారు. కూలీలకు పనులు కల్పించేందుకు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 35 లక్షల పని దినాలు లక్ష్యంగా పెట్టుకోగా వాటిలో 27 లక్షలు మాత్రమే పూర్తయ్యాయి. కేవలం 56,903 కుటుంబాల్లోని 90,130 మంది కూలీలకు మాత్రమే పనులు కల్పించారు. జిల్లాలో లక్ష్యం ఘనంగా ఉండగా, కేవలం 3638 కుటుంబాలకు మాత్రమే 100 రోజుల పనిదినాలను కల్పించారు. గత సంవత్సరం లక్ష్యాన్ని పూర్తిస్థాయిలో సాధించలేని అధికారులు ఈ ఏడాదైనా తమ టార్గెట్లను పూర్తి చేస్తారా అనే సందేహాలు కలుగుతున్నాయి. కాగా ఉపాధి పనులకు రోజువారీ వేతనం రూ.300 చెల్లిస్తున్నప్పటికీ, గ్రామాల్లో ఇతర పనులకు వెళితే కనీసం రూ.600 గిట్టుబాటు అవుతాయనే భావనలో కూలీలు ఉన్నారు. దీంతో ఉపాఽధిహామీ పథకం పనులు చేసేందుకు కూలీలు మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది.

వేతన సవరణ సరే....భత్యాల సంగతేంది...?

ఉపాధిహామీ పథకం కింద చెల్లించే వేతనాలను ఇటీవల కేంద్ర ప్రభుత్వం సవరించింది. అన్‌ స్కిల్డ్‌ కార్మికులకు రూ. 300 చెల్లిస్తున్నారు. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం వేసవి భత్యం నిలిపివేసింది. అధిక ఉష్ణోగ్రతలతో కూలీలను రక్షించేందుకు మంచినీటి సరఫరా, షేడ్‌ నెట్లు సమకూర్చుకునేందుకు కొంత మొత్తం చెల్లించేవారు. వేసవిలో పనులు చేసినందుకు 30 శాతం అదనపు భత్యాన్ని చెల్లించే విధానం ఉండేది. కూలీలకు ప్రయాణ, కరువు భత్యం (టీఏ, డీఏ), ఖర్చు కింద గడ్డపారకి రూ. 10, తట్టకు రూ. 5, మంచినీటికి రూ. 5 చెల్లిస్తుండేవారు. అలాగే ఐదు కిలోమీటర్లకు పైగా దూరం నుంచి వచ్చే వారికి రూ.20 చొప్పుల చెల్లించాల్సి ఉంది. భత్యంతోపాటు పని ప్రదేశంలో విశ్రాంతి తీసుకునేందుకు టెంట్‌ సౌకర్యం కల్పించాలి. కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. ఇందులో భత్యాల చెల్లింపునకు చోటు కల్పించలేదు. కూలీలకు భత్యాలు అందకపోగా మెడికల్‌ కిట్లు, నెట్లు కూడా సమకూర్చడం లేదు.

లక్ష్యం మేరకు పనులు కల్పిస్తాం....డీఆర్డీవో కిషన్‌

ఉపాధిహామీ పథకంలో భాగంగా లక్ష్యం మేరకు పనులు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. జాబ్‌ కార్డు కలిగిన కూలీలకు నిర్దేశిత లక్ష్యం ప్రకారం ఉపాధి కల్పించేందుకు ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నాం. మంచినీటి సౌకర్యం గతంలో కుండలు ఏర్పాటు చేసేవాళ్లం. ప్రస్తుతం కూలీలే తాగునీటిని సమకూర్చుకోవాల్సి ఉంది. ఎండల కారణంగా కూలీలు ఉదయం 6 గంటలకే పనులకు వెళ్లి 9 గంటల కల్లా తిరిగి వస్తున్నారు. దీంతో నీడ సౌకర్యం కల్పించే అవసరం రావడం లేదు.

Updated Date - Apr 02 , 2024 | 10:20 PM