Share News

అభివృద్ధి పనులన్నీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మంజూరు చేసినవే

ABN , Publish Date - Jan 28 , 2024 | 10:15 PM

మంచిర్యాల నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మంజూరు చేసినవేనని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు.

 అభివృద్ధి పనులన్నీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మంజూరు చేసినవే

ఏసీసీ, జనవరి 28 : మంచిర్యాల నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మంజూరు చేసినవేనని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తాగునీటి కోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మూడు సంవత్సరాల క్రితం రూ. 70 కోట్లు మంజూరు చేసిందని, ఆ నిధులతో మంచిర్యాల మున్సిపాలిటీలో అండాళమ్మ కాలనీ, వేములపల్లి, చున్నంబట్టి వాడల్లో ట్యాంకులు నిర్మించినట్లు తెలిపారు. అటవీశాఖ అనుమతుల కోసం తాను కృషి చేశానన్నారు. కొత్త పైపులైన్‌ల నిర్మాణానికి మంచిర్యాల మున్సిపాలిటీలో గతంలోనే రూ. 40 కోట్లు మంజూరు చేయించానన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వల్లనే మిషన్‌ భగీరథ నీరు మంచిర్యాల, తదితర ప్రాంతాలకు సరఫరా అవుతుందన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు మంజూరు కావడానికి తన కృషే కారణమన్నారు. గూడెం లిఫ్ట్‌ పంపులు వరద నీటిలో మునిగితే రూ.11 కోట్లతో మరమ్మతు చేయించానని తెలిపారు. ఎంఎస్‌ పైపులు వేయించడం వల్లనే రెండో పంటకు ప్రస్తుతం నీరు అందుతుందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో క్వింటాళుకు రూ. 500 బోనస్‌ ఇస్తానని చెప్పి మొండి చేయి చూపించిందన్నారు. మంచిర్యాల, నస్పూర్‌, లక్షెట్టిపేట మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మంజూరు చేసి టెండర్లు పూర్తయిన 800 పైచిలుకు పనులను కాంగ్రెస్‌ ప్రభుత్వం నిలుపుదల చేసిందని విమర్శించారు. పనులు ఎందుకు నడవడం లేదో ప్రజలకు తెలపాలని, త్వర లో పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ వస్తుందని, వేసవిలో నీటి సమస్య వల్ల క్యూరింగ్‌ కష్టమవుతుందని తెలిపారు. పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. మంచిర్యాల అంతర్గాంను కలుపుతూ గోదావరిపై బ్రిడ్జిని మంజూరు చేయిస్తే ఎందుకు పను లు ప్రారంభించడం లేదో చెప్పాలన్నారు. కాంగ్రెస్‌ అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను ప్రలోభాలకు గురి చేసి గెలిచిందన్నారు. రాళ్లవాగుపై రంగపేటకు వెళ్లే దారిలో బ్రిడ్జి నిర్మాణానికి రూ.12 కోట్లు మంజూరు చేయించానని, ఈ పనులు కూడా ప్రారంభించడం లేదన్నారు. మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య, నాయకులు , కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Updated Date - Jan 28 , 2024 | 10:15 PM