Share News

భూకబ్జాలపై ప్రత్యేక సర్వే

ABN , Publish Date - Mar 28 , 2024 | 11:03 PM

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఖరీదైన స్థలంపై ఎట్టకేలకు సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ అధికారులు దృష్టి సారించారు. హైద్రాబాద్‌లోని సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ప్రసన్నలక్ష్మి నేతృత్వంలో అధికారులు గురువారం ఆర్టీసీ డిపో వెనుక ఉన్న సర్వే నెంబర్లు మంచిర్యాల శివారులోని 422, గర్మిళ్ల శివారులోని 92, 93 గల 13.38 ఎకరాల పై చిలుకు ప్రభుత్వ భూమిలో సర్వే జరిపారు.

భూకబ్జాలపై ప్రత్యేక సర్వే

మంచిర్యాల, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఖరీదైన స్థలంపై ఎట్టకేలకు సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ అధికారులు దృష్టి సారించారు. హైద్రాబాద్‌లోని సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ప్రసన్నలక్ష్మి నేతృత్వంలో అధికారులు గురువారం ఆర్టీసీ డిపో వెనుక ఉన్న సర్వే నెంబర్లు మంచిర్యాల శివారులోని 422, గర్మిళ్ల శివారులోని 92, 93 గల 13.38 ఎకరాల పై చిలుకు ప్రభుత్వ భూమిలో సర్వే జరిపారు. కొంతకాలంగా ఈ స్థలం విషయమై తీవ్ర వివాదం నెల కొంది. అది ప్రభుత్వ భూమి కాగా, కొందరు అక్రమంగా కబ్జా చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై ఫిర్యాదులు అందుకున్న రెవెన్యూ అధికారులు పలుమార్లు సర్వేలు జరిపినప్పటికీ అది పట్టా భూమో, ప్రభుత్వ స్థలమో నిర్ధారించకపోవడంతో వివాదం ముదురుతోంది.

కలెక్టర్‌కు ఫిర్యాదుతో

మంచిర్యాల శివారు సర్వే నెంబరు 422లో ప్రభుత్వ భూములు పెద్ద మొత్తంలో కబ్జాలకు గురవుతున్నాయని, వాటిని కాపాడాలని పట్టణానికి చెందిన తులా మధుసూధన్‌రావు అనే వ్యక్తి పలుమార్లు కలెక్టర్‌కు ఫిర్యా దు చేశారు. మంచిర్యాల ఆర్డీవో ఇచ్చిన నివేదిక ఆధారంగా మున్సిపల్‌ అధికారులు నిర్మాణ అనుమతులు ఇచ్చారని, ఆర్డీవో నివేదికలో దొర్లిన సాంకేతిక లోపాలను గమనించనించకుండానే అనుమతులు మంజూరు చేశారని, కలెక్టర్‌ స్పందించి కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై ’జిల్లా కేంద్రంలో భూకబ్జా’ శీర్షికన 2023 జూలై 18న ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. దీంతో అధికారులు స్పందించి ఎట్టకేలకు సర్వే చేపట్టారు.

సర్వేపైనే భూముల భవిష్యత్తు?

సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ అధికారులు జరిపిన సర్వే నివేదికపైనే భూముల భవిష్యత్తు ఆధారపడి ఉంది. భూమి సర్వే జరిపిన జాయింట్‌ డైరెక్టర్‌ ప్రసన్నలక్ష్మి రెండు రోజుల్లో పూర్తిస్థాయి నివేదికను కలెక్టర్‌కు అందజేయనున్నట్లు తెలిపారు. అయితే అధికారులు నిష్పక్షపాతంగా నివే దిక తయారు చేస్తేనే ఇంతకాలం ప్రజలు చేసిన పోరాటానికి ఫలితం దక్కే అవకాశాలున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా స్థానిక ల్యాండ్‌ సర్వే అధికారులు గతంలో సర్వే జరిపినా వారిపై విశ్వాసం లేకనే కలెక్టర్‌ ద్వారా హెడ్‌ ఆఫీస్‌కు ఫిర్యాదు చేశారు. తాజాగా గురువారం చేపట్టిన సర్వేలో రాష్ట్ర అధికారులతోపాటు స్థానిక యంత్రాం గం పాల్గొనడంపై ప్రజల నుంచి పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హైద్రాబాద్‌ నుంచి వచ్చిన వారిలో జాయింట్‌ డైరెక్టర్‌తోపాటు అక్కడి సర్వేయర్‌ సంధ్య, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ రమాకాంత్‌, తహసీల్దార్‌ రమేష్‌, ఆర్‌ఐ అజీజ్‌తోపాటు స్థానిక సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ శ్రీనివాస్‌, ఆర్‌ఐ గంగాధర్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2024 | 11:03 PM