Share News

Telangana: హైకోర్టు జడ్జి ఫోన్‌పైనా

ABN , Publish Date - May 29 , 2024 | 05:51 AM

రాజకీయ ప్రత్యర్థులు.. సొంత పార్టీ నేతలు, పాత్రికేయులు, న్యాయవాదులే కాదు.. సాక్షాత్తూ హైకోర్టు న్యాయమూర్తి ఫోన్‌ను సైతం బీఆర్‌ఎస్‌ సర్కారు ట్యాప్‌ చేసిన విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది!

Telangana: హైకోర్టు జడ్జి ఫోన్‌పైనా

 • జస్టిస్‌ శరత్‌ వద్ద ప్రభుత్వ, బీఆర్‌ఎస్‌ నేతల కేసులుండడంతో ఆయన ఫోన్‌ ట్యాప్‌

 • మునుగోడులో ‘కారు’ గెలుపులో మాదే కీలకపాత్ర

 • కామారెడ్డిలో కేసీఆర్‌ గెలుపు కోసం శ్రమించాం

 • రేవంత్‌ సోదరుడు కొండల్‌రెడ్డి ఫోన్‌ ట్యాప్‌చేశాం

 • నిరుద్యోగంపై కేటీఆర్‌ను విమర్శించిన విద్యార్థి

 • నేతల పైనా నిఘా.. బీఆర్‌ఎస్‌కు నిధులు సేకరించాం

 • మా ఆదేశాలతోనే రియల్టర్‌ సంధ్యా శ్రీధర్‌ రావు..

 • బీఆర్‌ఎస్‌కు రూ.13 కోట్లు ఇచ్చారు: భుజంగరావు

 • రోజుకు 40 నంబర్ల ట్యాపింగ్‌

 • కాంగ్రెస్‌, బీజేపీ నేతల డబ్బు పట్టుకోవడమే లక్ష్యంగా

 • ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసుకున్నా

 • మెరుపుదాడులు చేసి రూ.కోట్లలో డబ్బు సీజ్‌ చేశాం

 • వాంగ్మూలంలో కీలక విషయాలు తెలిపిన తిరుపతన్న

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, మే 28 (ఆంధ్రజ్యోతి): రాజకీయ ప్రత్యర్థులు.. సొంత పార్టీ నేతలు, పాత్రికేయులు, న్యాయవాదులే కాదు.. సాక్షాత్తూ హైకోర్టు న్యాయమూర్తి ఫోన్‌ను సైతం బీఆర్‌ఎస్‌ సర్కారు ట్యాప్‌ చేసిన విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది! దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ట్యాపింగ్‌ కేసులో తవ్వినకొద్దీ విస్తుపోయే కొత్త కొత్త అంశాలు బయటకొస్తున్నాయి. ఎలాగైనాసరే.. మూడోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా కేసీఆర్‌ ప్రభుత్వం అవలంబించిన నేర ప్రణాళికల గుట్టు రట్టు అవుతోంది. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు.. మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ప్రభాకర్‌ రావు నేతృత్వంలో మాజీ డీఎస్పీ ప్రణీత్‌ రావు, ఆయన బృందం చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

అప్పట్లో తాము.. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శరత్‌ కాజ ఫోన్లను కూడా ట్యాప్‌ చేసినట్టు ఇంటెలిజెన్స్‌ అదనపు ఎస్పీ నాయిని భుజంగరావు తన నేరాన్ని అంగీకరిస్తూ ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన కేసులతో పాటు.. బీఆర్‌ఎస్‌ పార్టీ కీలక నేతల కేసులు ఆయన వద్ద ఉన్నందునే ఆయన ఫోన్‌ కాల్స్‌పై నిఘా ఉంచామని భుజంగరావువివరించారు.


సరైన సమయం చూసి.. అవసరాలకు అనుగుణంగా ఆయన్ను ప్రభావితం చేయడం కోసం ఆయన వ్యక్తిగతజీవితం, ఇతర అలవాట్లు ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా తెలుసుకునే వాళ్లమని వెల్లడించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాక.. బీఆర్‌ఎస్‌ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడల్లా తాము ఇలాంటి చర్యలకు పాల్పడ్డామని, కేసీఆర్‌ ప్రభుత్వానికి సహకరించామని ఆయన వివరించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయం వెనుక తమదే కీలకపాత్ర అని స్పష్టం చేశారు.

అంతకు ముందు జరిగిన దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచి ఊపు మీద ఉండడంతో.. ఆ పార్టీ మునుగోడులోనూ గెలిస్తే ఆ ప్రభావం 2023 అసెంబ్లీ ఎన్నికలపై పడుతుందని కేసీఆర్‌ భావించారని.. అందుకే అక్కడ పార్టీ విజయం కోసం తమను నియమించారని భుజంగరావు వెల్లడించారు. దీంతో తాము బీజేపీ, కాంగ్రెస్‌ నేతల ఫోన్లపై నిఘా పెట్టి.. వారికి డబ్బులు అందకుండా అన్నిదారులూ మూసేశామని తెలిపారు. ‘‘గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో కేసీఆర్‌ విజయం కోసం చాలా శ్రమించాం. అక్కడ కాంగ్రెస్‌ నుంచి పోటీలో ఉన్న రేవంత్‌ రెడ్డి సోదరుడు కొండల్‌ రెడ్డి ఫోన్‌ను, ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లనూ ట్యాప్‌ చేశాం. బీజేపీ అభ్యర్థి కె.వెంకటరమణా రెడ్డి పైనా ప్రత్యేకంగా నిఘా ఉంచాం. దీనికోసం ప్రణీత్‌ రావు ‘కేఎంఆర్‌’ (కామారెడ్డి) పేరుతో వాట్సాప్‌ గ్రూప్‌ ప్రారంభించారు. కేసీఆర్‌ విజయానికి మేం అంతగా శ్రమించినా ఆయన అక్కడ ఓడిపోయారు’’ అని భుజంగరావు వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఆర్థిక వనరులను గుర్తించి స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా ‘పోల్‌-2023’ పేరుతోనూ ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటుచేసుకున్నట్టు చెప్పారు.

‘యశోద’ నుంచి భారీగా నగదు..

ఎన్నికల ముందు ప్రతిపక్షాల ఆర్థిక వనరులను అడ్డుకోవడంతోపాటు.. బీఆర్‌ఎ్‌సకు భారీగా పార్టీ ఫండ్‌ సమకూర్చేందుకూ తాము సహకరించినట్టు భుజంగరావు వెల్లడించారు. ఇందులో భాగంగా.. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో అనేక పోలీసు కేసుల్లో ప్రమేయం ఉన్న ప్రముఖుల నుంచి విరాళాలు సేకరించినట్టు చెప్పారు. ‘‘రియల్టర్‌ సంధ్యా శ్రీధర్‌ రావు రూ.15 కోట్లు విరాళం ఇవ్వగా.. అందులో రూ. 13 కోట్లతో బీఆర్‌ఎస్‌ కోసం ఎన్నికల బాండ్లు కొనుగోలు చేయించాం. యశోదా ఆస్పత్రితో పాటు మరో ప్రముఖ ఆస్పత్రి నుంచి అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎ్‌సకు పెద్దఎత్తున పార్టీ ఫండ్‌ అందింది. ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌ నేతల ఆదేశాల ప్రకారం టాస్క్‌ఫోర్స్‌ వాహనాల్లో డబ్బులు తీసుకెళ్లాం. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖులను గుర్తించి ప్రభుత్వానికి పార్టీ ఫండ్‌ ఇవ్వాలంటూ వారిపై ఒత్తిడి తెచ్చాం. కంపెనీలు, వీఐపీలు, వ్యాపారవేత్తల వివాదాలను బీఆర్‌ఎస్‌ నేతల సూచనలతో సెటిల్‌ చేశాం. దీంతో పార్టీకి భారీగా ఫండ్‌ వచ్చింది’’ అని భుజంగరావు వెల్లడించారు. అలాగే.. టీఎ్‌సపీఎ్‌ససీ పేపర్‌ లీకేజీ తర్వాత.. నిరుద్యోగ సమస్యపై యువతలో ఆగ్రహం పెరిగిపోయి.. కేటీఆర్‌ వ్యాఖ్యలను ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు తీవ్రంగా విమర్శించేవారు. దీంతో.. ఆయన్ను విమర్శించే నేతలు, విద్యార్థి నాయకులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్‌ చేశామని భుజంగరావు తన వాంగ్మూలంలో స్పష్టం చేశారు.


ప్రత్యేక బృందాలు.. మూడు షిఫ్టుల్లో పని..

ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ప్రభాకర్‌రావు, అడిషనల్‌ ఎస్పీ భుజంగరావు ఆదేశాలమేరకే తాము పనిచేసినట్లు.. ట్యాపింగ్‌ కేసులో మరో నిందితుడుగా ఉన్న అదనపు ఎస్పీ తిరుపతన్న వెల్లడించారు. కాంగ్రెస్‌, బీజేపీ నాయకుల డబ్బులు పట్టుకోవడమే ప్రధాన లక్ష్యంగా తనకు పనులు అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఇన్‌స్పెక్టర్లు గట్టుమల్లు, చైతన్య, మల్లికార్జున్‌ ఆధ్వర్యంలో 10 మంది కానిస్టేబుళ్లు, 10 మంది హెడ్‌ కానిస్టేబుళ్లతో ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసి మూడు షిఫ్టుల్లో 24/7 పనిచేసినట్లు తిరుపతన్న వెల్లడించారు. అందుకు అవసరమైన 3 సిస్టమ్స్‌, 9 లాగర్‌ రూమ్స్‌ను ఏర్పాటు చేసుకున్నామని.. నిత్యం 40 మంది ఫోన్లు ట్యాప్‌చేసి సమాచారాన్ని సేకరించినట్లు విచారణాధికారులకు తెలిపారు. ఈ పనుల కోసం ‘పీవోఎల్‌ 2023’ పేరుతో ప్రత్యేక వాట్సాప్‌ గ్రూపును ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ‘‘కామారెడ్డి ఎన్నికల కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాను నాకు అప్పగించిన పనితో పాటు.. ప్రణీత్‌కుమార్‌ ఇచ్చిన సమాచారం, ప్రభాకర్‌రావు ఆదేశాలతో 15 ఆపరేషన్‌లు నిర్వహించాను’’ అని వివరించారు. అలాగే.. బీఆర్‌ఎస్‌ ప్రత్యర్థులు, కాంగ్రెస్‌ నాయకులు.. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి, రాజగోపాల్‌రెడ్డికి సంబంధించిన డబ్బులు పట్టుకున్నట్లు తిరుపతన్న వెల్లడించారు. రాజగోపాల్‌రెడ్డి మిత్రుడు సీహెచ్‌ వేణు దగ్గర రూ.3 కోట్లు.. రేవంత్‌ మిత్రుడు గాలి అనిల్‌కుమార్‌కు చెందిన రూ. 90 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే.. రేవంత్‌ మిత్రుడు గాలి అనిల్‌ కుమార్‌కు చెందిన రూ.90 లక్షలు, రాఘవ ఇన్‌ఫ్రాకు చెందిన రూ.10.5 కోట్లు, ఎమ్మెల్యే వినోద్‌కు సంబంధించి విశాఖ ఇండస్ట్రీస్‌ డబ్బులు రూ.50 లక్షలు, ఉత్తమ్‌ కుమార్‌ మిత్రుడు గిరిధర్‌ నుంచి రూ.50 లక్షలు, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీరెడ్డి నుంచి రూ.90 లక్షలు, రేవంత్‌ సోదరుడు కొండల్‌ రెడ్డికి చెందిన రూ.56.84 లక్షలు (కామారెడ్డికి తరలిస్తుండగా) పట్టుకున్నట్టు చెప్పారు. అయినా.. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించడంతో తన వద్ద ఉన్న 3 కంప్యూటర్లు, 9 లాగర్స్‌లో ఉన్న డేటా మొత్తాన్ని ధ్వంసం చేసినట్లు తిరుపతన్న తన వాంగ్మూలంలో వెల్లడించారు. ఈ క్రమంలో దశాబ్దాల తరబడి సేకరించిన మావోయిస్టుల సమాచారం మొత్తం పోయిందని పేర్కొన్నారు.

జాగ్రత్తపడ్డాం..

ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించిన అక్రమాలు బయట పడకుండా ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు డీఎస్పీ ప్రణీత్‌రావు అలియాస్‌ ప్రణీత్‌కుమార్‌ పోలీసులకు ఇచ్చిన కన్ఫెషన్‌ స్టేట్‌మెంట్‌లో కీలక విషయాలు వెల్లడించారు. ‘‘2023 అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్‌ ఫలితాలు రాగానే.. ఎస్‌ఐబీలో చేసిన ఇల్లీగల్‌ కార్యకలాపాలకు సంబందించిన మొత్తం డేటాను ధ్వంసం చేయాలని ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ప్రభాకర్‌రావు ఆదేశించారు. దాంతో ఆయన ఆదేశాల మేరకు 50 హార్డ్‌డి్‌స్కలను తొలగించి వాటి స్థానంలో వేరే హార్డ్‌డి్‌స్కలు అమర్చాము. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలగించిన 50 హార్డ్‌డి్‌స్కలతో పాటు.. 17 కంప్యూటర్స్‌, ఒక ల్యాప్‌టా్‌పలో ఉన్న సమాచారం మొత్తాన్ని డిసెంబర్‌-4న ధ్వంసం చేశాం.’’ అని ఆయన వెల్లడించారు. ఆ సమయంలో సీసీటీవీలు పనిచేయకుండా తన టీమ్‌లోని ఆర్‌ఎస్సై అనిల్‌కుమార్‌ సీసీటీవీ కనెక్షన్స్‌ను రాత్రి 7:30 నుంచి 8:15 వరకు ఆపివేసినట్లు చెప్పారు. అదే రోజు ప్రభాకర్‌రావు రాజీనామా చేయగా.. డిసెంబర్‌ 13న తనకు సిరిసిల్ల డీసీఆర్‌బీకి బదిలీ అయిందని ప్రణీత్‌రావు వాంగ్మూలంలో వెల్లడించారు.

Updated Date - May 29 , 2024 | 05:51 AM