Share News

17 స్థానాలకు బరిలో 893 మంది!

ABN , Publish Date - Apr 26 , 2024 | 05:30 AM

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నాలుగో దశ ఎన్నికల నోటిఫికేషన్‌ ఈనెల 18న విడుదల కాగా.. అదే రోజు ప్రారంభమైన నామినేషన్ల

17 స్థానాలకు బరిలో  893 మంది!

ముగిసిన లోక్‌సభ నామినేషన్ల ప్రక్రియ

మల్కాజిగిరి నుంచి అత్యధికంగా 114

ఆదిలాబాద్‌ స్థానానికి అత్యల్పంగా 23

చివరిరోజున పలుచోట్ల ప్రధాన పార్టీల

అభ్యర్థుల మరో సెట్‌ నామినేషన్‌

ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థిగా రఘురాంరెడ్డి

వరంగల్లో ఇండిపెండెంట్‌గా బాబూమోహన్‌

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నాలుగో దశ ఎన్నికల నోటిఫికేషన్‌ ఈనెల 18న విడుదల కాగా.. అదే రోజు ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ గురువారంతో పూర్తయింది. చివరిరోజున 632 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటివరకు ఏడు రోజుల్లో 893 మంది అభ్యర్థులు 1,488 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన, ఆ తర్వాత ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగనుంది. ఇటు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఉపఎన్నికకు కూడా నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ నియోజకవర్గానికి 24 మంది 50 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గమైన మల్కాజిగిరి స్థానానికి అత్యధికంగా 114 మంది అభ్యర్థులు 177 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా.. అత్యల్పంగా ఆదిలాబాద్‌ స్థానానికి 23 మంది అభ్యర్థులు 42 సెట్లు వేశారు. చేవెళ్ల 66 మంది (87 సెట్లు), మహబూబ్‌నగర్‌ 38 మంది (58 సెట్లు), నాగర్‌కర్నూల్‌ 34 మంది (53 సెట్లు), కరీంనగర్‌ 53 మంది (94 సెట్లు), పెద్దపల్లి 63 మంది (109 సెట్లు), వరంగల్‌ 58 మంది (89 సెట్లు), మహబూబాబాద్‌ 29 మంది (56 సెట్లు), నిజామాబాద్‌ 42 మంది (90 సెట్లు), నల్లగొండ 57 మంది (114 సెట్లు), భువనగిరి 59 మంది (110 సెట్లు), జహీరాబాద్‌ 40 మంది (69 సెట్లు), మెదక్‌ 54 మంది (90 సెట్లు), సికింద్రాబాద్‌ 57 మంది (75 సెట్లు), హైదరాబాద్‌ స్థానానికి 57 మంది 85 నామినేషన్‌ సెట్లు దాఖలు చేసినట్లు అధికారులు వివరించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్‌ దాఖలు చేయగా.. గురువారం చాలా చోట్ల ఒకట్రెండు సెట్లు అదనంగా వేశారు. ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్‌ టికెట్‌ సాధించిన రామసహాయం రఘురాంరెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. ఖమ్మంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, ఎంపీ రేణుకా చౌదరి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. కరీంనగర్‌ బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్‌ నామినేషన్‌ వేశారు. ఆయనకు మద్దతుకు భారీ ర్యాలీ నిర్వహించగా.. గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి పాల్గొన్నారు. మాజీ మంత్రి బాబూమోహన్‌ వరంగల్‌ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. ఆరోగ్యం బాగాలేకపోవడంతో వీల్‌చైర్‌లోనే రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి వచ్చారు. ప్రస్తుతం ప్రజాశాంతి పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న ఆయన.. ఆ పార్టీ నుంచే పోటీ చేస్తానని గతంలో ప్రకటించారు. అయితే చివరకు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవడం గమనార్హం.

Updated Date - Apr 26 , 2024 | 05:30 AM