revenue employee : గ్రామానికో రెవెన్యూ ఉద్యోగి
ABN , Publish Date - Jan 29 , 2024 | 04:09 AM
రాష్ట్రంలో మళ్లీ వీఆర్వో, వీఆర్‌ఏ వ్యవస్థ రానుందా? గతంలో ప్రకటించిన మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపట్టనుందా
మళ్లీ వీఆర్వో, వీఆర్‌ఏలు..!
బీఆర్‌ఎస్ హయాంలో రద్దు.. ఇతర శాఖల్లోకి సర్దుబాటు
గతంలో ప్రభుత్వం, ప్రజల మధ్య వారధులుగా సేవలు
వందల ఏళ్లు భూములు కాపాడిన రెవెన్యూ ఉద్యోగులు
పునరుద్ధరిస్తామని ఇప్పటికే స్పష్టం చేసిన ప్రభుత్వం
పెద్దల తప్పులు బయటపడతాయనే రెవెన్యూ విచ్ఛిన్నం
సంస్కరణల పేరుతో తెచ్చిన ధరణి ఓ తప్పులతడక
పోర్టల్‌లోని లొసుగులతో సర్కారు భూములు మాయం
బీఆర్‌ఎస్ తొత్తులకు కట్టబెట్టిన వాటిని పేదలకు ఇస్తాం
ప్రతి ఉద్యోగికి 5వ తేదీ లోపే జీతం పడేలా చర్యలు
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు
డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్ల సంఘం డైరీ,
క్యాలెండర్లను ఆవిష్కరించిన మంత్రి
హైదరాబాద్, జనవరి 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మళ్లీ వీఆర్వో, వీఆర్‌ఏ వ్యవస్థ రానుందా? గతంలో ప్రకటించిన మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపట్టనుందా? బీఆర్‌ఎస్ సర్కారు హయాంలో తొలగించిన వ్యవస్థను పునరుద్ధరించనుందా? గ్రామ స్థాయిలో రెవెన్యూ శాఖను పటిష్ఠం చేసేందుకు నడుంబిగించనుందా? రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలను బట్టి చూస్తే ఈ ప్రశ్నలన్నిటికీ ఔననే సమాధానం వస్తోంది. ఆదివారం హైదరాబాద్‌లో డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దారుల సంఘం డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో రెవెన్యూ వ్యవస్థకు సంబంధించిన ఒక వ్యక్తి ఉండేలా చూడడమే లక్ష్యంగా పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారఽథ్యంలో రెవెన్యూ వ్యవస్థను గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేస్తామని ఆయన తెలిపారు. గతంలో ఏ చిన్న గ్రామంలో చూసినా గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ) లేదా గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) ఎవరో ఒకరు ఉండేవారని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ పెద్దలు చేస్తున్న తప్పులను బయటపెడతారని వీఆర్వో వ్యవస్థను భ్రష్టుపట్టించి గాలిలో పెట్టి.. చివరకు అసలు లేకుండా చేశారని ఆరోపించారు. తమ ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశం లేదన్నారు. వందల ఏళ్ల నుంచి భూములను కాపాడుతూ.. ప్రభుత్వం, ప్రజలకు వారఽధిగా ఉన్న వ్యవస్థ రద్దుతో గ్రామ స్థాయిలో ప్రజలు చెప్పేది వినే యంత్రాంగం లేకుండా పోయిందని పేర్కొన్నారు. తాతలు, తండ్రులు కష్టపడి ఆస్తులను కూడబెడితే.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వారి తొత్తులకు కట్టపెట్టిందని మంత్రి పొంగులేటి ధ్వజమెత్తారు. రెవెన్యూ ఉద్యోగుల సహకారంతో ఇలాంటివాటిని పేదలకు పంపిణీ చేసేందుకు చిత్తశుద్ధితో ఉన్నట్లు తెలిపారు.
ప్రజలకు మేలు చేసేలా సంస్కరణలు
ధరణిని తీసుకొచ్చి ప్రజలను కొత్త ఇబ్బందులకు గురిచేశారని పొంగులేటి అన్నారు. సామాన్యులు, గ్రామీణ ప్రాంత వ్యక్తులకు ప్రభుత్వ సంస్కరణలు, చట్టాలు ఉపయోగపడాలని.. కానీ కేసీఆర్ ప్రభుత్వం వక్రమార్గంలో ధరణిని తెచ్చిందని వ్యాఖ్యానించారు. దీని కారణంగా పేదలు పడిన ఇబ్బందుల ఫలితమే.. ప్రభుత్వం మారాలనే బలమైన కాంక్ష ఏర్పడేందుకు కారణమైందన్నారు. ధరణి ప్రక్షాళనతో సామాన్యులకు మేలు చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టామని చెప్పారు. ధరణిని అడ్డం పెట్టుకుని గత ప్రభుత్వంలో రూ.కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు మాయం చేశారని పొంగులేటి అన్నారు. ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని.. వీటన్నిటిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అన్యాయంగా భూములు పోగొట్టుకున్నవారికి న్యాయం చేస్తామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుతో స్వేచ్ఛ
బీఆర్‌ఎస్ సర్కారులో 10-25 తేదీల వరకు జీతాలు ఇచ్చేవారని. కానీ, ప్రతి ఉద్యోగికి 5వ తేదీ లోపే జీతం పడేలా చూడడం తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పొంగులేటి అన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో వ్యక్తి స్వేచ్ఛను హరించారని.. సామాన్యుడే కాదు ఏ ఉద్యోగి కూడా మాట్లాడే పరిస్థితి లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సర్కారు రాకతో అందరికీ గాలి పీల్చుకునే అవకాశం వచ్చిందన్నారు. ఉద్యోగులంతా దీవించడంతోనే ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు జరిగిందని వివరించారు. ఇదివరకు ఒకరిద్దరు తప్పు చేేస్త అందరినీ ఇబ్బందిపెట్టారని.. ఇప్పుడు ఎవరికీ నష్టం జరగకుండా మంచి చేేసలా ఉద్యోగులందరూ సహకరించాలని కోరారు. పేదల కష్టాల్లో అందరం భాగస్వాములు కావాలన్నారు. ఉద్యోగుల కష్టాలలో తామ భాగం అవుతానన్నారు. పూర్తి విశ్వాసంతో కష్టపడి మంచి జరిగేలా పనిచేయాలని కోరారు. బంజారాహిల్స్‌లో జరిగిన కార్యక్రమానికి డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి అధ్యక్షత వహించారు. సంఘం ప్రధాన కార్యదర్శులు కె.రామకృష్ణ, రమేష్‌రాథోడ్, అసోసియేట్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, వెంకట్‌రెడ్డి, పద్మప్రియ, తహసీల్దార్ల సంఘం అధ్యక్షుడు రాములు, ప్రధానకార్యదర్శులు రమేష్ పాక, పూల్‌సింగ్ చౌహాన్, ఆరేటి రాజేశ్వర్, శ్రీనివా్‌సశంకర్, పుష్యమి, ఎస్‌పీఆర్ మల్లేష్ పాల్గొన్నారు.