Keshav Maharaj: రెండో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ప్లే అయిన ``రామ్ సియా రామ్`` పాట.. కారణం అదే..
ABN , Publish Date - Jan 09 , 2024 | 03:55 PM
కేప్‌టౌన్ వేదికగా టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. దక్షిణాఫ్రికా ఆటగాడు కేశవ్ మహారాజ్ బ్యాటింగ్‌కు దిగుతుండగా స్టేడియం నుంచి ``ఆదిపురుష్`` సినిమాలోని ``రామ్ సియా రామ్`` పాటే ప్లే అయింది.
కేప్‌టౌన్ వేదికగా టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ (Test Match) సందర్భంగా ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. దక్షిణాఫ్రికా ఆటగాడు కేశవ్ మహారాజ్ (Keshav Maharaj) బ్యాటింగ్‌కు దిగుతుండగా స్టేడియం నుంచి ``ఆదిపురుష్`` సినిమాలోని ``రామ్ సియా రామ్`` (Ram Siya Ram) పాట ప్లే అయింది. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 34 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన సమయంలో కేశవ్ బ్యాటింగ్ కు వస్తుండగా ఈ పాట వినిపించింది. దాని వెనుక గల ఆసక్తికర విషయాన్ని తాజాగా కేశవ్ వెల్లడించాడు.
సౌతాఫ్రికాలో జరుగుతున్న ఈ టెస్టులో రాముడి పాట వినిపించడంతో చాలా మంది ఆశ్చర్యపోయారు. ఆ పాట విని విరాట్ కోహ్లి (Virat Kohli) కూడా భావోద్వేగానికి గురయ్యాడు. కేశవ్‌ను సాదరంగా బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అయితే తాను కోరినందు వల్లే ఆ పాటను ప్లే చేశారని తాజాగా కేశవ్ తెలిపాడు. ``నేను మైదానంలోకి దిగుతున్నప్పుడు ఆ పాట ప్లే చేయమని అడిగాను. నేను రాముడికి, హనుమంతుడికి భక్తుణ్ని. బ్యాక్‌గ్రౌండ్‌లో రామ్ సియా రామ్ ప్లే అవుతుంటే బ్యాటింగ్ చేయడానికి వెళ్తుండటం గొప్ప అనుభూతి కలిగించింద``ని కేశవ్ పేర్కొన్నాడు.
మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ తను సంతకం చేసిన జెర్సీని కేశవ్‌కు బహుమతిగా అందించాడు. ఆ ఫొటోను కేశవ్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశాడు. విరాట్ కోహ్లీకి ధన్యవాదాలు తెలియజేశాడు. భారత మూలాలు కలిగిన కేశవ్ మహరాజ్ సౌతాఫ్రికా టీమ్ తరఫున ప్రధాన స్పిన్నర్‌గా ఆడుతున్నాడు.