Share News

Pakistan : పాక్‌కు సూపర్‌-8 కష్టమేనా..?

ABN , Publish Date - Jun 11 , 2024 | 05:02 AM

తొలి మ్యాచ్‌లో పసికూన అమెరికా చేతిలో చిత్తవడంతోనే అర్థమైపోయింది ఈసారి టీ20 వరల్డ్‌ కప్‌లో పాకిస్థాన్‌ పురోగతి ఎలా ఉండబోతోందో. అరంగేట్ర జట్టు అమెరికాతో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి

 Pakistan : పాక్‌కు సూపర్‌-8 కష్టమేనా..?

టీ20 ప్రపంచకప్‌లో నేడు

పాకిస్థాన్‌ X కెనడా ( రా. 8. గం.)

న్యూయార్క్‌: తొలి మ్యాచ్‌లో పసికూన అమెరికా చేతిలో చిత్తవడంతోనే అర్థమైపోయింది ఈసారి టీ20 వరల్డ్‌ కప్‌లో పాకిస్థాన్‌ పురోగతి ఎలా ఉండబోతోందో. అరంగేట్ర జట్టు అమెరికాతో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీయడం పాకిస్థాన్‌ చెత్త ఆటకు నిదర్శనం. ఇక భారత్‌పై కేవలం 120 రన్స్‌ లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పరాజయం పాకిస్థాన్‌ సూపర్‌-8 అవకాశాలను బాగా దెబ్బ తీసేదే. ప్రతి గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్లు సూపర్‌-8కి చేరే విషయం తెలిసిందే. ఇక..రెండు ఓటములతో పాయింట్ల ఖాతా తెరవలేకపోయిన బాబర్‌ సేనకు తదుపరి దశ చాన్సులు ప్రస్తుతానికి సంక్లిష్టమే. ఈ నేపథ్యంలో కెనడా, ఐర్లాండ్‌తో జరిగే ఆఖరి రెండు మ్యాచ్‌ల్లో పాక్‌ భారీ తేడాతో నెగ్గాల్సి ఉంటుంది. మరోవైపు టీమిండియా తన చివరి రెండు మ్యాచ్‌ల్లోనూ తప్పక గెలవాలి. అంతేకాదు..అమెరికాను ఐర్లాండ్‌ ఓడించాలి. ఇలా ఫలితాలన్నీ అనుకూలిస్తే..పాక్‌ నాలుగు మ్యాచ్‌ల్లో 4 పాయింట్లతో ఉంటుంది. భారత్‌ 8 పాయింట్లతో గ్రూప్‌ టాపర్‌గా సూపర్‌-8కు చేరుతుంది. పాక్‌ మాదిరే అమెరికా 4 పాయింట్లతో కెనడా, ఐర్లాండ్‌ రెండేసి పాయింట్లతో ఉంటాయి. ఈ పరిస్థితుల్లో నెట్‌ రన్‌రేట్‌ పరిగణనలోకి వస్తుంది. అప్పుడు మెరుగైన రన్‌రేట్‌ ఉంటే పాక్‌ సూపర్‌-8లో ప్రవేశిస్తుంది.

అతడి వల్లే ఓటమి..

భారత్‌తో మ్యాచ్‌లో ఇమాద్‌ వసీమ్‌ ఉద్దేశపూర్వకంగా జిడ్డు బ్యాటింగ్‌ చేయడంవల్లే పాకిస్థాన్‌ ఓడిందని ఆ జట్టు మాజీ కెప్టెన్‌ సలీమ్‌ మాలిక్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. ఆదివారం జరిగిన ఆ మ్యాచ్‌లో 23 బంతులు ఆడిన ఇమాద్‌ 15 పరుగులే చేశాడు. ‘వసీమ్‌ ఇన్నింగ్స్‌ చూడండి. బంతులకు బంతులు తినేసి స్వల్ప ఛేదనలో పరిస్థితులను సంక్లిష్టం చేశాడు’ అని మాలిక్‌ దుయ్యబట్టాడు. ఇక..పాకిస్థాన్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌లో అంతా సవ్యంగా లేదని మరో మాజీ కెప్టెన్‌ షాహిద్‌ అప్రీది అభిప్రాయపడ్డాడు. కెప్టెన్‌ బాబర్‌, కొందరు జట్టు సభ్యులకు పొసగడంలేదన్న అనుమానం వ్యక్తంజేశాడు. ‘ఇప్పుడేది మాట్లాడినా నా అల్లుడు (షహీన్‌షా అఫ్రీది)ని వెనుకేసుకొచ్చానంటారు. అందుకే వరల్డ్‌కప్‌ అయ్యాక అంతా చెబుతాన’ని అఫ్రీది అన్నాడు.

జట్టును ప్రక్షాళన చేయాల్సిందే..

కరాచీ: టీమిండియా చేతిలో ఓటమితో పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) చీఫ్‌ గరంగరంగా ఉన్నాడు. జట్టులో భారీ ప్రక్షాళన తప్పదని వ్యాఖ్యానించాడు. ‘మ్యాచ్‌లు గెలిచేందుకు జట్టుకు చిన్నపాటి ఆపరేషన్‌ చేయాల్సి ఉంటుందనుకున్నా. కానీ పరిస్థితులు చూస్తుంటే భారీ శస్త్రచికిత్సే అవసరం’ అని పీసీబీ అధ్యక్షుడు మొహిసిన్‌ నఖ్వి మండిపడ్డాడు. ‘అమెరికా, భారత్‌ చేతిలో పరాజయం తీవ్ర నిరాశకు గురి చేసింది. ఇప్పుడున్న ఆటగాళ్లను గాకుండా కొత్త క్రికెటర్లతో జట్టును ప్రక్షాళించాల్సిందే’ అని అతడు కుండ బద్దలుగొట్టాడు.

Updated Date - Jun 11 , 2024 | 05:02 AM