Share News

IPL 2024: నేటినుంచి ఐపీఎల్‌ క్రికెట్‌ పండుగ.. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీతో తలపడనున్న సీఎస్కే

ABN , Publish Date - Mar 22 , 2024 | 07:04 AM

క్రికెట్‌ అభిమానులు ఎదురుచూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(Indian Premier League) 17వ సీజన్‌ పోటీలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి.

IPL 2024: నేటినుంచి ఐపీఎల్‌ క్రికెట్‌ పండుగ.. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీతో తలపడనున్న సీఎస్కే

- ముస్తాబైన చెపాక్‌ మైదానం

- సాయంత్రం 6.30 నుంచి ప్రారంభోత్సవాలు

చెన్నై: క్రికెట్‌ అభిమానులు ఎదురుచూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(Indian Premier League) 17వ సీజన్‌ పోటీలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. చేపాక్కంలోని ఎంఏ చిదంబరం స్టేడియం తొలిమ్యాచ్‌కు వేదిక కానుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్కే), రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్బీబీ)తో తలపడనుంది. మ్యాచ్‌ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుండగా, 6.30 నుంచే ప్రారంభ వేడుకలు అలరించనున్నాయి.

ఈ సారి కొత్త కెప్టెన్‌తో సీఎస్కే..

ఈసారి చెన్నై సూపర్‌కింగ్స్‌కు రుతురాజ్‌ గైక్వాడ్‌ను సారథిగా నియమించినట్లు ఆ జట్టు యాజమాన్యం ప్రకటించడంతో ధోనీ అభిమానులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ధోని క్రేజ్‌ ఈ సారి కూడా ఐపీఎల్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. 16వ సీజన్‌ ఛాంపియన్‌గా నిలిచిన ధోని, 17వ సీజన్‌ తరువాత రిటైర్‌ అవుతారని అందరూ భావిస్తున్నారు. ఇందుకు సంకేతమా అన్నట్లుగా సీఎస్కే యాజమాన్యం తమ జట్టు కెప్టెన్‌ను మార్చడం గమనార్హం.

ముస్తాబైన చేపాక్కం...

ఈ మ్యాచ్‌ టిక్కెట్ల విక్రయాలు ఈనెల 18వ తేది ఆన్‌లైన్‌లో ప్రారంభమైన 10 నిమిషాల్లోనే ముగియడంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. మరోవైపు మ్యాచ్‌ కోసం స్టేడియం కొత్త సొగబులతో ముస్తాబైంది. స్టేడియం చుట్టూ చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు క్రీడాకారుల చిత్రాలు తీర్చిదిద్దగా, స్టేడియం మొత్తం పసుపు రంగుతో నిండిపోయింది. దేశవ్యాప్తంగా ఉన్న సీఎస్కే, ఆర్సీబీ అభిమానులు గురువారం సాయంత్రమే చెన్నైకి చేరుకున్నారు. ఇక, తమ తమ జట్ల జెర్సీల కొనుగోలుకు అభిమానులు పోటెత్తడంతో స్పోర్ట్స్‌ దుకాణాలు కిటకిటలాడుతున్నాయి.

ప్రత్యేక కార్యక్రమాలు...

ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌ సందర్భంగా సాయంత్రం 6.30 గంటల నుంచి ప్రారంభం కానున్న వేడుకల్లో ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్‌. రెహ్మాన్‌ సంగీత కచ్చేరి, బాలీవుడ్‌ నటుల నృత్య ప్రదర్శనలతో పాటు రాష్ట్రానికి చెందిన సంప్రదాయ కళా ప్రదర్శనలు చోటుచేసుకోనున్నాయి. ఐపీఎల్‌ మ్యాచ్‌ టిక్కెట్లు పొందిన అభిమానులు మెట్రోరైళ్లు, ఎంటీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ఆయా సంస్థలు ప్రకటించాయి. ఇక, మ్యాచ్‌ జరగనున్న స్టేడియం చుట్టూ భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటైంది. స్టేడియం చుట్టుపక్కల ఉన్న ప్రధాన జంక్షన్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతా చర్యలను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ఇక, మ్యాచ్‌ ముగిసిన అనంతరం అభిమానులు తమతమ ప్రాంతాలకు వెళ్లేందుకు ఎంటీసీ సంస్థ ప్రత్యేక బస్సులు నడపనుండగా, చింతాద్రిపేట నుంచి వేళచ్చేరి వరకు ప్రత్యేక సబర్బన్‌ రైలు నడపనున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది.

Updated Date - Mar 22 , 2024 | 07:04 AM