Share News

T20 World Cup: ఫీల్డింగ్ జట్టు జాగ్రత్తగా ఉండాల్సిందే.. టీ-20 ప్రపంచకప్ నుంచి ఐసీసీ కొత్త రూల్!

ABN , Publish Date - Mar 15 , 2024 | 08:54 PM

ఇప్పటివరకు ప్రయోగాత్మకంగా అమల్లో ఉన్న స్టాప్ క్లాక్ నిబంధనను టీ-20 వరల్డ్ కప్ నుంచి పూర్తి స్థాయిలో ఐసీసీ అమలు చేయనుంది. అటుపై వన్డేలు, టీ-20ల్లో ఈ నిబంధన అమలవుతుందని ఐసీసీ శుక్రవారం ప్రకటించింది.

T20 World Cup: ఫీల్డింగ్ జట్టు జాగ్రత్తగా ఉండాల్సిందే.. టీ-20 ప్రపంచకప్ నుంచి ఐసీసీ కొత్త రూల్!

ఈ ఏడాది జూన్ నెలలో జరగనున్న టీ-20 వరల్డ్ కప్ (T20 World Cup) నుంచి ఐసీసీ (ICC) మరో కొత్త నిబంధనను తెర మీదకు తీసుకు రాబోతోంది. ఇప్పటివరకు ప్రయోగాత్మకంగా అమల్లో ఉన్న స్టాప్ క్లాక్ నిబంధనను (Stop clock rule) టీ-20 వరల్డ్ కప్ నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయనుంది. అటుపై వన్డేలు, టీ-20ల్లో ఈ నిబంధన అమలవుతుందని ఐసీసీ శుక్రవారం ప్రకటించింది. శుక్రవారం జరిగిన వార్షిక సమావేశంలో ఈ మేరకు ఐసీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిబంధన వల్ల దాదాపు 20 నిమిషాల సమయం ఆదా అవుతుందని ఐసీసీ భావిస్తోంది.

స్టాప్ క్లాక్ రూల్ అంటే ఏమిటి?

టీ-20, వన్డే క్రికెట్‌లో కొన్నిసార్లు ఓవర్ల మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంటుంది. ఫీల్డింగ్ కెప్టెన్ ఒక ఓవర్ ముగిసిన తర్వాత మరో ఓవర్ ప్రారంభించేందుకు ఒక్కోసారి ఎక్కువ సమయం తీసుకుంటాడు. ఈ కొత్త నియమం ప్రకారం, ఇకపై ఒక ఓవర్ ముగిసిన నిమిషంలో రెండో ఓవర్ ప్రారంభం కావాలి. ఓవర్ ముగిసిన తర్వాత మైదానంలోని స్క్రీన్‌పై 60 సెకన్ల టైమర్ నడుస్తుంది. ఫీల్డింగ్ కెప్టెన్ ఆ పరిమితిలోపు రెండో ఓవర్ ప్రారంభించవలసి ఉంటుంది. అలా జరగకపోతే మొదటి రెండు సార్లు అంపైర్ హెచ్చరిస్తాడు. మూడో సారి కూడా అలా జరిగితే బౌలింగ్ జట్టుకు 5 పరుగుల పెనాల్టీ విధిస్తారు. అటుపై అలా జరిగిన ప్రతిసారి బ్యాటింగ్ జట్టుకు ఐదేసి పరుగులు జోడిస్తారు.

ఈ నిబంధన అమల్లో కొన్ని వెసులుబాట్లు కూడా కల్పించారు. ఒకవేళ ఓవర్ల మధ్యలో బ్యాటర్ క్రీజులోకి వచ్చినా, గాయం కారణంగా బ్యాటర్ మైదానాన్ని వీడుతున్నా, పరిస్థితులు అనుకూలించని సమయాల్లో ఈ నియమం రద్దవుతుంది. ఇక, టీ-20 ప్రపంచకప్ సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే‌లను కేటాయించింది. అలాగే 2026 టీ-20 ప్రపంచకప్‌ను భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 20 జట్లు పాల్గొంటాయి.

Updated Date - Mar 15 , 2024 | 08:57 PM