Share News

Viral Video: బెయిర్ స్టోను ఉడికించిన గిల్.. తర్వాత బంతికే అవుట్.. వీడియో చూడండి..

ABN , Publish Date - Mar 09 , 2024 | 07:11 PM

ధర్మశాలలో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఏకంగా ఇన్నింగ్స్ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్ స్టో‌కు, శుభ్‌మన్ గిల్‌కు మధ్య మాటల యుద్ధం సాగింది.

Viral Video: బెయిర్ స్టోను ఉడికించిన గిల్.. తర్వాత బంతికే అవుట్.. వీడియో చూడండి..

ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా అమోఘమైన ప్రతిభ కనబరిచింది. బలమైన ఇంగ్లండ్ జట్టుపై ఏకంగా 4-1తో సిరీస్ విజయాన్ని నమోదు చేసింది (India vs England). ధర్మశాలలో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్‌లో ఏకంగా ఇన్నింగ్స్ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్ స్టో‌కు (Jonny Bairstow), శుభ్‌మన్ గిల్‌ (Shubman Gill)కు మధ్య మాటల యుద్ధం సాగింది. గిల్‌కు మద్ధతుగా ధ్రువ్ జురెల్, సర్ఫ్‌రాజ్ ఖాన్ కూడా మాటలు యుద్ధంలోకి దిగారు. దీంతో ఏకాగ్రత కోల్పోయిన బెయిర్ స్టో తర్వాతి బంతికే అవుటై నిరాశగా వెనుదిరిగాడు.

మ్యాచ్ రెండో రోజు గిల్, ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ (James Anderson) మధ్య మాటల యుద్ధం (Argument) జరిగిన సంగతి తెలిసిందే. దానిని ప్రస్తావిస్తూ గిల్ గురించి బెయిర్ స్టో వ్యాఖ్యానించాడు. దానికి గిల్ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. ``భారత్ జట్టులోని ఏ బౌలర్ అయినా నీ వికెట్ తీయగలడు. నేను కూడా నీ వికెట్ తీయగలను. నీ కంటే కుల్దీప్ యాదవ్ గొప్పగా బ్యాటింగ్ చేశాడు`` అంటూ బెయిర్ స్టోను టార్గెట్ చేసుకుని గిల్ వ్యాఖ్యానించాడు. ``ఈ రోజు కొద్దిగా పరుగులు చేశాడుగా. అందుకే ఎక్కువ మాట్లాడుతున్నాడు`` అంటూ సర్ఫ్‌రాజ్ అన్నాడు.

ఈ వాగ్వాదం జరిగిన తర్వాతి బంతికే కుల్దీప్ బౌలింగ్‌లో బెయిర్ స్టో వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించడంతో ఇంగ్లండ్ డీఆర్‌ఎస్‌కు వెళ్లింది. బంతి వికెట్ల పై నుంచి వెళ్తున్నట్టు రీప్లేలో కనిపించినప్పటికీ.. ``అంపైర్స్ కాల్`` ప్రకారం బెయిర్ స్టో అవుట్ అయ్యాడు. దీంతో తీవ్ర నిరాశకు గురైన బెయిర్ స్టో.. గిల్‌ వైపు చూసి ఏదో అంటూ పెవిలియన్‌ వైపు వెళ్లిపోయాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Updated Date - Mar 09 , 2024 | 07:11 PM