Share News

U19 World Cup: సీనియర్ల బాటలోనే జూనియర్లు.. ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం

ABN , Publish Date - Feb 11 , 2024 | 09:23 PM

ఏ విధంగా అయితే వరల్డ్ కప్ 2023లో సీనియర్లు లీగ్ దశలో ఊరించి ఫైనల్‌లో ఉసూరుమనిపించారో.. అదే విధంగా జూనియర్లు సైతం తీవ్రంగా నిరాశపరిచారు. సీనియర్ల బాటలోనే జూనియర్లు సైతం అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఘోర పరాజయం చవిచూశారు. ఆస్ట్రేలియా నిర్దేశించిన 254 పరుగుల లక్ష్యాన్ని ఛేధించలేకపోయారు.

U19 World Cup: సీనియర్ల బాటలోనే జూనియర్లు.. ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం

ఏ విధంగా అయితే వరల్డ్ కప్ 2023లో సీనియర్లు లీగ్ దశలో ఊరించి ఫైనల్‌లో ఉసూరుమనిపించారో.. అదే విధంగా జూనియర్లు సైతం తీవ్రంగా నిరాశపరిచారు. సీనియర్ల బాటలోనే జూనియర్లు సైతం అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఘోర పరాజయం చవిచూశారు. ఆస్ట్రేలియా నిర్దేశించిన 254 పరుగుల లక్ష్యాన్ని ఛేధించలేకపోయారు. 174 పరుగులకే చాపచుట్టేశారు. దీంతో.. 79 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించి, వరల్డ్ కప్ టైటిల్‌ని సొంతం చేసుకుంది. ఓపెనర్ ఆదర్శ్ సింగ్ (47), మురుగన్ (42) మినహాయించి.. ఇతర బ్యాటర్లెవ్వరూ పోరాట పటిమని కనబర్చలేకపోయారు. అందరూ చేతులెత్తేయడంతో.. భారత జట్టుకి ఈ ఓటమి తప్పలేదు.


తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా అండర్-19 జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. హర్జాస్ సింగ్ (55) అర్థశతకంతో రాణించగా.. హ్యు వెబ్‌గెన్ (48), హ్యారీ డిక్సన్ (42), ఓలీ పీక్ (46) మెరుగైన ఇన్నింగ్స్ ఆడటంతో ఆస్ట్రేలియా అంత స్కోరు చేయగలిగింది. ఇక 254 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు.. 43.5 ఓవర్లలో 174 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి భారత జట్టు పేకమేడలా కుప్పకూలింది. ఆదర్శ్, మురుగన్ మాత్రమే టఫ్ ఫైట్ ఇచ్చారే తప్ప.. మిగిలిన బ్యాటర్లెవ్వరూ నిలకడగా రాణించలేకపోయారు. ముషీర్ (22), నమన్ తివారి (14) కాస్త పర్వాలేదనిపించారు. ఇంతర బ్యాటర్లు కనీసం రెండంకెల స్కోరుని కూడా చేయలేకపోయారు. సెమీఫైనల్‌లో అద్భుత ఆటతీరు కనబర్చిన ఉదయ్ సహరన్ (8), సచిన్ దాస్ (9) ఈసారి తక్కువ స్కోర్లకే పెవిలియన్ బాట పట్టారు.

ఆస్ట్రేలియా బౌలర్ల విషయానికొస్తే.. అందరూ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో భారత జట్టుని ముప్పుతిప్పలు పెట్టారు. భారీ పరుగులు చేసే అవకాశం ఇవ్వకుండా.. తమదైన బౌలింగ్ ఎటాక్‌తో వరుసగా వికెట్లు తీస్తూ వచ్చారు. బెర్డ్‌మన్, మెక్‌మిలాన్ తలా మూడు వికెట్లు తీయగా.. కలమ్ విడ్లర్ రెండు.. చార్లీ, టాక్ స్ట్రాకర్ చెరో ఒక వికెట్ పడగొట్టారు. గతేడాది వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా చేతిలో సీనియర్లు చవిచూసిన ఓటమికి జూనియర్లు ప్రతీకారం తీర్చుకుంటారని భావిస్తూ.. వీళ్లు కూడా ఓటమిపాలై డిజప్పాయింట్ చేశారు.

Updated Date - Feb 11 , 2024 | 09:23 PM