Share News

Viral: ‘ప్లీజ్.. పిల్లల్ని కనండి! ఒక్కో బిడ్డకు రూ.62 లక్షలు చొప్పున ఇస్తాం..’

ABN , Publish Date - Feb 10 , 2024 | 07:39 PM

తమ సంస్థలో ఉద్యోగులు పిల్లల్ని కనేలా ప్రోత్సహించేందుకు ఓ దక్షిణకొరియా సంస్థ ఒక్కో బిడ్డకూ రూ.63 లక్షల చొప్పున ఆర్థికసాయం చేస్తామని తాజాగా ప్రకటించింది.

Viral: ‘ప్లీజ్.. పిల్లల్ని కనండి! ఒక్కో బిడ్డకు రూ.62 లక్షలు చొప్పున ఇస్తాం..’

ఇంటర్నెట్ డెస్క్: ఏదైనా పరిమితికి లోబడి ఉంటేనే అందం. జనాభాకూ ఇది వర్తిస్తుంది. ప్రస్తుతం కొన్ని దేశాలు అధికజనాభాతో ఇబ్బంది పడుతుంటే మరికొన్ని అభివృద్ధి చెందిన దేశాలు జనాభా పడిపోతుండటంతో దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయాయి. జంటలను పిల్లల్ని కనేలా ప్రోత్సహించేందుకు నానా యాతనా పడుతున్నాయి. ప్రభుత్వాలు పలు పథకాలు, ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ జంటలను దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. పరిస్థితులు ఎంతగా దిగజారుతున్నాయంటే ప్రభుత్వాలకు తోడు ఇప్పుడు ప్రైవేటు కంపెనీలు కూడా వివాహితులకు ఇలాంటి ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి (South Korean Firm Offers Rs 62 Lakh To Employees For Having A Child).


దక్షిణకొరియాకు (South Korea) చెందిన బూయంగ్ రియల్ ఎస్టేట్ సంస్థ కూడా దేశంలో సంతానోత్పత్తి రేటుపై ఆందోళన చెందుతోంది. తన వంతుగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. దీని ప్రకారం, బిడ్డల్ని కన్న ప్రతి ఒక్కరికీ బిడ్డకు రూ.62.3 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించింది. అంతేకాదు, ముగ్గురికి మించి సంతానం ఉన్న జంటలకు అదనంగా రూ.1.8 కోట్లు లేదా వాళ్లు ఉండేందుకు ఓ ఇల్లు కట్టిఇస్తామని కూడా పేర్కొంది. ప్రభుత్వం స్థలం కేటాయించడంపై ఇదంతా ఆధారపడి ఉంటుందని పేర్కొంది. గతంలో కొన్ని ప్రైవేటు సంస్థలు ఇలాంటి ఆఫర్స్ ప్రకటించినా బూయంగ్ సంస్థ ఇచ్చిన ఆఫర్‌ లాంటిది మునుపెన్నడూ చూడకపోవడంతో ఇది ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.

సంస్థ చైర్మన్ సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఆఫర్‌ను ప్రకటించారు. సంతానంతో వచ్చే ఆర్థికభారం నుంచి జంటలకు కొంత ఉపశమనం కల్పించి వారిని పిల్లల్ని కనేలా ప్రోత్సహించాలన్నదే తమ ఉద్దేశమన్నారు. తమ పథకంతో యువ జంటల్లో మార్పు వస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.

నిపుణుల ప్రకారం, ఆర్థికాభివృద్ధికి సరిపడా జనాభా ఉండాలంటే దేశంలో సగటు సంతానోత్పత్తి రేటు 2.1గా ఉండాలి. కానీ దక్షిణకొరియాలో సగటు సంతానోత్పత్తి రేటు 0.78కి పడిపోయింది. ప్రపంచంలో అత్యల్ప సంతానోత్పత్తి రేటు ఉన్న దేశంగా దక్షణకొరియా నిలిచింది. 2025 నాటికల్లా ఇది 0.65కి పడిపోతుందన్న అంచనాలు ఉన్నాయి. దీంతో, దేశంలో కలకలం రేగుతోంది.

Updated Date - Feb 10 , 2024 | 07:46 PM