Share News

World Record: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బ్రిడ్జి.. చైనా రికార్డును తిరగరాసిన భారత్..!

ABN , Publish Date - Jun 30 , 2024 | 11:04 AM

ఇప్పుడు అందరి దృష్టి చీనాబ్‌ బ్రిడ్జిపైనే ఉంది. ఎత్తైన కొండలు, సుందరమైన హిమాలయ పర్వతాల నడుమ... మేఘాలను తాకుతున్నట్టుగా నిర్మించిన అద్భుతమే ‘చీనాబ్‌’ రైల్వే వంతెన. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనదిగా రికార్డు సృష్టించింది.

World Record: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బ్రిడ్జి.. చైనా రికార్డును తిరగరాసిన భారత్..!
Cgeenab Rail Bridge

ఇప్పుడు అందరి దృష్టి చీనాబ్‌ బ్రిడ్జిపైనే ఉంది. ఎత్తైన కొండలు, సుందరమైన హిమాలయ పర్వతాల నడుమ... మేఘాలను తాకుతున్నట్టుగా నిర్మించిన అద్భుతమే ‘చీనాబ్‌’ రైల్వే వంతెన. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనదిగా రికార్డు సృష్టించింది. ఇటీవల బ్రిడ్జీపై నిర్వహించిన ట్రయల్‌ రన్‌ విజయవంతమయ్యింది. త్వరలోనే పూర్తి స్థాయి రైల్వే సేవలకు సిద్ధమైన ఈ ఇంజనీరింగ్‌ అద్భుతం విశేషాలివి...


ఈఫిల్‌ టవర్‌తో పోలిస్తే..

ఇప్పటివరకు చైనాలోని బెయిపాన్‌ నదిపై నిర్మించిన 275 మీటర్ల ఎత్తైన షుబాయ్‌ రైల్వేవంతెన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును చీనాబ్‌ అధిగమించింది. ప్యారిస్‌లోని ప్రఖ్యాత ఈఫిల్‌ టవర్‌తో పోలిస్తే దీని ఎత్తు 35 మీటర్లు ఎక్కువ. నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తున దీన్ని నిర్మించారు. వంతెన పొడవు 1315 మీటర్లు. భారతీయ రైల్వే 2004లో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టి, సుమారు రూ.14 వేల కోట్ల వ్యయంతో ఈ భారీ నిర్మాణాన్ని చేపట్టింది.


రియాసి పట్టణానికి..

రియాసి పట్టణానికి 42 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ వంతెనను స్టీల్‌, కాంక్రీట్‌తో ఆర్చ్‌ ఆకారంలో నిర్మించారు. ఈ ఆర్చ్‌ మొత్తం బరువు 10,619 మెట్రిక్‌ టన్నులు కాగా, వంతెన నిర్మాణంలో 30 వేల మెట్రిక్‌ టన్నుల ఉక్కును ఉపయోగించారు. ఇది కశ్మీర్‌ను భారత్‌లోని మిగతా ప్రాంతాలకు అనుసంధానించేందుకు చేపట్టిన ఉధంపూర్‌- శ్రీనగర్‌- బారాముల్లా రైల్వే ప్రాజెక్టు కింద నిర్మించబడింది. ఈ వంతెన ద్వారా 7 స్టేషన్ల మీదుగా రైళ్లు బారాముల్లా చేరుకుంటాయి. దీనిపై వందేభారత్‌ మెట్రో రైలు జమ్మూ, శ్రీనగర్‌ మధ్య పరుగులు తీయనుంది.


103 మీటర్ల ఎత్తులో

వంతెన మొత్తం పదిహేడు పిలర్లు ఉంటే.. సంగల్దాన్‌ వద్ద పిల్లర్‌ అన్నింటికన్నా ఎత్తులో 103 మీటర్లు ఉంటుంది. ప్రస్తుతం కశ్మీర్‌ నుంచి ఢిల్లీకి సరుకు రవాణాకు ట్రక్కుల ద్వారా 48 గంటల సమయం పడు తుండగా.. ఈ బ్రిడ్జీపై రాకపోకలు ప్రారంభమయ్యాక రైళ్ల ద్వారా కేవలం 20 గంటల్లోనే చేరుకోవచ్చు. భూకంపాలు, పేలుళ్లు, గంటకు 260 కిలోమీటర్ల వేగంతో వీచే బలమైన గాలులు, -40 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలను తట్టుకునేలా దీని నిర్మాణం చేపట్టారు. వంతెన జీవిత కాలం 120 ఏళ్లు.


రాకపోకలు సులభతరం..

కశ్మీర్‌ లోయ ప్రజల రాకపోకలను సులభతరం చేయడమే దీని ఉద్దేశం. ప్రస్తుతం కశ్మీర్‌ లోయలోని బారాముల్లా జిల్లా నుంచి జమ్మూలోని రాంబన్‌ జిల్లాలోని బనిహాల్‌ వరకు మాత్రమే రైల్వే సర్వీసు ఉంది. చీనాబ్‌ రైల్వే వంతెన నేరుగా లోయను జమ్మూలోని కత్రాకు కలుపుతుంది. దీంతో కత్రా నుంచి శ్రీనగర్‌ వరకు ప్రయాణం ఐదారు గంటలలోపే ఉంటుంది.

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Latest Telugu News

Updated Date - Jun 30 , 2024 | 11:04 AM