Share News

Politics: రాజకీయ పార్టీలు స్థాపించిన సినీనటులు ఎవరో తెలుసా..

ABN , Publish Date - Feb 02 , 2024 | 07:33 PM

సినీరంగం నుంచి రాజకీయ రంగంలో ప్రవేశించి పార్టీలు స్థానిపించిన నటులు ఎవరో తెలుసా

Politics: రాజకీయ పార్టీలు స్థాపించిన సినీనటులు ఎవరో తెలుసా..

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో.. ముఖ్యంగా దక్షిణాదిన సినీనటులకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. హీరోలను నెత్తిన పెట్టుకునే ఫ్యాన్స్ వారి రాజకీయ కెరీర్లకూ ప్రాణం పోశారు. ఫ్యాన్స్ అభిమానమే ఆలంబనగా ఎందరో నటులు రాజకీయాల్లో రాణించారు. కొందరు ముఖ్యమంత్రి పదువులు కూడా అధిష్ఠించారు. తమిళనాడులో ఈ ట్రెండ్ మరీ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. తాజాగా ప్రముఖ కోలీవుడ్ స్టార్ విజయ్ కూడా ఓ పార్టీ లాంచ్ చేశారు. మరి ఇప్పటివరకూ సినీ నటులు ఏయే రాజకీయ పార్టీలు లాంచ్ చేశారో ఓమారు చూద్దాం.

తమిళనాడులో..

అన్నాడీఎంకే: వెండితెరపై వెలుగు వెలిగి రాజకీయాలను కూడా శాసించిన వారిలో ముందుగా చెప్పుకునే పేరు ఎంజీఆర్. 1972 అక్టోబర్ 17న ఎంజీఆర్ అన్నాడీఎమ్‌కేను లాంచ్ చేశారు. 1977 నుంచి 1987 వరకూ తమిళనాడు సీఎంగా ఉన్నారు. ఎంజీఆర్ తరువాత పార్టీ పగ్గాలు మరో నటి జయలలిత చేతుల్లోకి వెళ్లాయి. ఆమె కూడా 1991-96, 2001, 2002-06, 2011-14, 2015-16 మధ్యకాలంలో సీఎంగా చేశారు.

డీఎమ్‌డీకే: మరో ప్రముఖ తమిళస్టార్ విజయ్‌కాంత్ డీఎమ్‌డీకేను 2005లో స్థాపించారు. ఇటీవలే అనారోగ్య కారణాలతో ఆయన కన్నుమూశారు. ప్రస్తుతం పార్టీ వ్యవహారాలను ఆయన భార్య ప్రేమలత చూస్తున్నారు. 2011లో విజయ్‌కాంత్ ప్రతిపక్ష పార్టీ నేతగా కూడా పనిచేశారు.

మక్కల్ నీది మయ్యమ్: ప్రముఖ స్టార్ కమలహసన్ 2018లో ఈ పార్టీని లాంచ్ చేశారు. తమిళనాడుతో పాటూ పుదుచ్చేరిలో కూడా ఈ పార్టీ క్రియాశీలకంగా ఉంది,.

ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి: 2007లో సినీనటుడు శరత్ కుమార్ ఈ పార్టీని లాంచ్ చేశారు. 2011 ఎన్నికల్లో అన్నాడీఎమ్‌కేతో కలిసి పోటీ చేసిన ఈ పార్టీ రెండు సీట్లు గెలుచుకుంది.

టీఎమ్ఎమ్: ప్రముఖ తమిళనటుడు శివాజీ గణేశన్ ప్రారంభించిన ఈ పార్టీ కొంతకాలమే ఉనికిలో ఉంది. 1988లో ఆయన దీన్ని స్థాపించారు.

ఏఐఎన్ఎమ్‌‌కే: సినీనటుడు కార్తీక్ ఈ పార్టీని 2009లో లాంచ్ చేశారు. పార్టీ మద్దతుదారుల్లో ఆయన అభిమానులే ఎక్కువ.

ఏపీలో..

టీడీపీ: వెండితెరను ఏలిన మహానటుడు ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ గురించి తెలుగు ప్రజలందరికీ తెలిసిందే. 1983, 1984, 1994లో ఆయన మూడు సార్లు సీఎం అయ్యారు.

పీఆర్పీ: ప్రజారాజ్యం పార్టీని మెగాస్టార్ చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. ఆ తరువాత 2011లో పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అయ్యింది. 2009-12 మధ్య తిరుపతి ఎమ్మెల్యేగా సేవలందించారు. 2012లో రాజ్యసభకు ఎన్నికైన చిరంజీవి ఆ తరువాత మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కల్చర్, టూరిజం శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.

జనసేన: తొమ్మిదేళ్ల క్రితం పవన్ కల్యాణ్ సారథ్యంలో జనసేన ఆవిర్భవించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పార్టీ యాక్టివ్‌గా ఉంది.

Updated Date - Feb 02 , 2024 | 07:40 PM