Share News

Indigo Flight Delay: ఇంతటి దారుణ అనుభవమా.. ఇండిగోపై భగ్గుమన్న ప్యాసింజర్!

ABN , Publish Date - Jan 14 , 2024 | 05:37 PM

ఇండిగో ఎయిర్‌‌లైన్స్ విమాన టిక్కెట్ బుక్ చేసుకున్న ఓ ప్యాసింజర్..తన ప్రయాణం ఆలస్యమైనందుకు సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన ఫ్లైట్ ఏకంగా ఆరు సార్లు వాయిదా పడి, చివరకు ఏడు గంటల ఆలస్యంగా బయలుదేరిందని, ఇంతటి దారుణ అనుభవం ఎప్పుడూ చవిచూడలేదంటూ నెట్టింట వరుస పోస్టులు పెట్టాడు.

Indigo Flight Delay: ఇంతటి దారుణ అనుభవమా.. ఇండిగోపై భగ్గుమన్న ప్యాసింజర్!

ఇంటర్నెట్ డెస్క్: ఇండిగో ఎయిర్‌‌లైన్స్ (Indigo Airlines) విమాన టిక్కెట్ బుక్ చేసుకున్న ఓ ప్యాసింజర్..తన ప్రయాణం ఆలస్యమైనందుకు (Flight Delay) సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన ఫ్లైట్ ఏకంగా ఆరు సార్లు వాయిదా పడి (Delay 6 times), ఏడు గంటల ఆలస్యంగా బయలుదేరిందని, ఇంతటి దారుణ అనుభవం ఎప్పుడూ చవిచూడలేదంటూ నెట్టింట వరుస పోస్టులు పెట్టాడు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో చివరకు ఇండిగో కూడా స్పందించాల్సి వచ్చింది.

‘‘నా జీవితంలో ఎన్నడూ చూడని దారుణ అనుభవం ఇండిగోతో ఎదురైంది. రాత్రి 10 గంటలకు బయలుదేరాల్సిన కోల్‌కతా-బెంగళూరు ఫ్లైట్ ఆరు సార్లు వాయిదా పడి ఏకంగా ఏడు గంటల ఆలస్యంగా బయలుదేరింది. మరుసటి ఉదయం 4.14 గంటలకు టేకాఫ్ అయ్యింది. ఫలితంగా నేను మరో ఇంటర్నేషనల్ ఫ్లైట్ మిస్ అయ్యాను. ఆల్వేస్ ఆన్ టైం అనే ఇండిగో ప్రకటన పూర్తిగా తప్పు. ఈ ఎయిర్‌లైన్స్‌లో మరెప్పుడూ ప్రయాణించను. చట్టప్రకారం ఎయిర్ లైన్స్ సంస్థ నాకు మరో ప్రత్యామ్నాయ సర్వీసుతో పాటూ ఏడు గంటల ఆలస్యానికి రిఫండ్ కూడా ఆఫర్ చేయాలి. కానీ అలా జరగలేదు’’


‘‘అర్ధరాత్రి 12.20 గంటలకు నేను ఇండిగో ఫ్లైట్ టిక్కెట్ క్యాన్సిల్ చేసుకుని నేరుగా శాన్‌ఫ్రాన్‌సిస్కోకు ఓ టిక్కెట్ బుక్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ ఇండిగో టీమ్‌కు టిక్కెట్ క్యాన్సిల్ చేసేందుకు రెండు గంటల సమయం పట్టింది. అర్ధరాత్రి 2.20 గంటలకు వారు టిక్కెట్ క్యాన్సిల్ చేసి లగేజీ వెనక్కు ఇచ్చారు. క్యాన్సిలేషన్స్ చేయమంటూ నాతో ఇండిగో సిబ్బంది వాదించారు’’ అని అన్నారు. ఇది మంచు వల్ల జరిగిన ఆలస్యం కాదని, రెగ్యులేషన్ ప్రొసీజర్ అని మరో ఉద్యోగి చెప్పినట్టు కూడా పేర్కొన్నారు.

కస్టమర్ల డబ్బు, సమయంపై కంపెనీకి ఎటువంటి గౌరవం లేదని సదరు కస్టమర్ మండిపడ్డాడు. ‘‘ఫ్లైట్ ఆలస్యం గురించి వారు ముందే చెప్పి ఉంటే నేను ‘ఆకాశా’లో బయలుదేరే వాడిని. ఫలితంగా శాన్‌ఫ్రాన్‌సిస్కో ఫ్లైట్‌ కోసం సమయానికి చేరుకుని ఉండేవాడిని. విమాన ప్రయాణాలు అప్పుడప్పుడూ ఆలస్యం అవుతాయని తెలుసుకానీ ఇండిగో టీం వ్యవహరించిన తీరు ఏమాత్రం క్షమార్హం కాదు’’ అని ఆగ్రహించాడు.

కాగా, కస్టమర్ ట్వీట్ వైరల్ కావడంతో ఇండిగో సంస్థ స్పందించింది. అతడికి జరిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెబుతున్నామని ట్వీట్ చేసింది. పూర్తి రిఫండ్ ఇచ్చేందుకూ అంగీకరించింది.

Updated Date - Jan 14 , 2024 | 06:19 PM