Share News

Bleach at Home: ముఖాన్ని మెరిపించేందుకు ఇంట్లోనే బ్లీచ్.. ఇలా సింపుల్ గా తయారుచేసేయండి!

ABN , Publish Date - Apr 05 , 2024 | 04:12 PM

బ్లీచ్ డెడ్ స్కిన్ ను క్లీన్ చేయడమే కాకుండా చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది. బ్యూటీ పార్లర్ అక్కర్లేకుండా ఇంట్లోనే దీన్ని ఇలా ఈజీగా చేసుకోవచ్చు.

 Bleach at Home: ముఖాన్ని మెరిపించేందుకు ఇంట్లోనే బ్లీచ్.. ఇలా సింపుల్ గా తయారుచేసేయండి!

అమ్మాయిలు ఆరోగ్యం కంటే అందంగా కనబడటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ముఖం అందంగా మెరుస్తూ ఉంటే వారికి చెప్పలేనంత సంతోషంగా ఉంటుంది. చాలామంది అమ్మాయిలు అందం కోసం బ్యూటీ పార్లర్ మీద ఆధారపడతారు. బ్యూటీ పార్లర్ లో రసాయలతో కూడిన బ్లీచ్ ను ఉపయోగించి ముఖానికి బ్లీచింగ్ చేస్తారు. బ్లీచ్ డెడ్ స్కిన్ ను క్లీన్ చేయడమే కాకుండా చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది. కానీ రసాయనాల కారణంగా బ్లీచ్ తరువాత ముఖ చర్మం పొడిగా మారి దద్దుర్లు, దురద వంటి సమస్యలు వస్తాయి. ఈ గోల ఏదీ లేకుండా ఇంట్లోనే సహాజంగా బ్లీచ్ తయారుచేసుకుని వాడటం వల్ల ముఖ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇంట్లోనే బ్లీచ్ ను ఎలా తయారుచేసుకోవచ్చంటే..

శనగపిండి..

ప్రతి ఇంట్లో వంటగదిలో ఖచ్చితంగా శనగపిండి ఉంటుంది. శనగపిండి మంచి బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. చర్మాన్ని సహజంగా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. దీన్ని వాడటం వల్ల ముఖం మీద ఉన్న డెడ్ స్కిన్ తొలగిపోయి ముఖం మెరుస్తుంది. శనగపిండిలో పెరుగు, రోజ్ వాటర్ కలిపి పేస్ట్ చేయాలి. ముఖం కడుక్కున్న తరువాత ఈ ప్యాక్ ను ముఖానికి రాసుకుని 20నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత నీటితో కడిగేయాలి. ముఖం మెరుస్తుంది.

ఇది కూడా చదవండి: సెలెబ్రిటీలు ఇష్టంగా చేసే ఐస్ బాత్ గురించి షాకింగ్ నిజాలివీ..!


పసుపు..

పసుపు సహజ బ్లీచ్ గా పనిచేస్తుంది. పసుపులో కొద్దిగా పచ్చిపాలు కలిపి పేస్ట్ చేసుకోవాలి. దీన్ని ముఖానికి పట్టించి కాసేపు ఆరిన తరువాత ముఖం కడుక్కోవాలి. ఇది డెడ్ స్కిన్ ను క్లియర్ చేస్తుంది. ముఖ చర్మాన్ని మెరిపిస్తుంది. ముఖం మీద అవాంచిత రోమాలను తొలగిస్తుంది.

తేనె..

తేనె సహజ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. బ్లీచింగ్ గుణాలు కూడా ఇందులో ఉన్నాయి. తేనెలో కొద్దిగా రోజ్ వాటర్, అలోవెరా జెల్ వేసి ప్యాక్ చేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి కొంతసేపు మసాజ్ చేయాలి. తరువాత 20నిమిషాలు అలాగే వదిలేసి సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. ముఖ చర్మం మెరుస్తుంది.

బంగాళాదుంప..

బంగాళాదుంప గొప్ప బ్లీచింగ్ ఏజెంట్. దీని రసం ముఖాన్ని కాంతివంతం చేసే గుణాలు కలిగి ఉంటుంది. ఇది చర్మానికి పోషణను కూడా ఇస్తుంది. బంగాళాదుంప రసంలో విటమిన్-ఇ క్యావ్సూల్, కొద్దిగా రోజ్ వాటర్ వేసి మిక్స్ చేసి ప్యాక్ తయారుచేసుకోవాలి. దీన్ని ముఖానికి పట్టించి ఆరిన తరువాత కడుక్కోవాలి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 05 , 2024 | 04:12 PM