Anand Mahindra: హమయ్యా..ఎన్నాళ్లకు..! ఆనంద్ మహీంద్రానే మురిపించిన అనుభవం ఇది!
ABN , Publish Date - Feb 06 , 2024 | 05:23 PM
అటల్ సేతు వంతెనపై తొలిసారిగా ప్రయాణించిన ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) తన అనుభవాన్ని నెట్టింట షేర్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: సకలసౌకర్యాలు అందుబాటులో ఉండే అపరకుబేరులను కూడా భయపెట్టే ఒకేఒక సమస్య ట్రాఫిక్! ముంబై వంటి మహానగరాల్లో ఈ సమస్య మరీ దారుణంగా ఉంటుంది. అయితే, ముంబై నగరవాసుల ట్రాఫిక్ సమస్యను కొంతవరకూ పరిష్కరించే అటల్ సేతు (Journey on Atal setu) వంతెన ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. మనదేశంలో సముద్రంపై నిర్మించిన అత్యంత పొడవైన బ్రిడ్జ్ ఇది. ఈ వంతెనపై తొలిసారిగా ప్రయాణించిన ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) తన అనుభవాన్ని నెట్టింట షేర్ చేశారు.
‘‘ఈ బ్రిడ్జ్‌పై డ్రైవ్ చేసేందుకు ఇన్నాళ్లకు నాకు అవకాశం చిక్కింది. గత వారాంతంలో నేను ముంబై, పూణె మధ్య బ్రిడ్జ్‌పై డ్రైవ్ చేశా. ఇదో ఇంజినీరింగ్ అద్భుతం. దీనిపై ప్రయాణిస్తుంటే నీళపై బోటు ప్రయాణం చేస్తున్నట్టు అనిపించింది. సాయం సమయంలో ప్రయాణం ఇంకా అద్భుతంగా ఉంటుందట. ఈసారి సాయంత్రం సమయాల్లో జర్నీ చేస్తా’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. సాయం వేళల్లో బ్రిడ్జీపై కనిపించే అద్భుత దృశ్యాన్ని కూడా షేర్ చేశారు.
ఈ పోస్ట్‌కు యథాప్రకారం జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. తమకూ ఇలాగే అనిపించిందని అనేక మంది కామెంట్ చేశారు. బ్రిడ్జి ప్రారంభమైన పదిహేను రోజుల్లోనే 4.5 లక్షల వాహనాలు దీని మీదుగా రాకపోకలు సాగించాయని, 9 కోట్ల మేర ఆదాయం వచ్చిందని కొందరు చెప్పారు.
ఆరు లైన్లు, 21.8 కిలోమీటర్ల పొడవున్న ఈ వంతెన ముంబైని (Mumbai), నవీ ముంబైతో (Navi Mumbai) కలుపుతుంది. ఒకప్పుడు ఈ రెండిటి మధ్య ప్రయాణానికి 2 గంటల సమయం పట్టేది. బ్రిడ్జి అందుబాటులోకి వచ్చాక ప్రయాణ సమయం ఏకంగా 20 నిమిషాలకు తగ్గిపోయింది. జనవరి 12న ప్రధాని నరేంద్ర మోదీ ఈ వంతెనను ప్రారంభించారు.