Covid vaccine: కోవిడ్ టీకాను 217 సార్లు వేయించుకున్న వ్యక్తి.. అతడి పరిస్థితి ఎలా ఉందో తెలుసా?
ABN , Publish Date - Mar 06 , 2024 | 08:10 PM
ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది కరోనా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది అనారోగ్యానికి గురయ్యారు. ఆ సమయంలో వ్యాక్సిన్ రావడంతో చాలా మంది ఊపిరి పీల్చుకున్నారు.

నాలుగేళ్ల క్రితం వచ్చిన కరోనా (Corona) మహమ్మారి ప్రపంచాన్ని గజగజలాడించింది. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది కరోనా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది అనారోగ్యానికి గురయ్యారు. ఆ సమయంలో వ్యాక్సిన్ (Covid vaccine) రావడంతో చాలా మంది ఊపిరి పీల్చుకున్నారు. రెండు డోస్‌ల వ్యాక్సిన్ తీసుకున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని, చాలా మందికి గుండె సంబంధ సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డారని వార్తలు వచ్చాయి.
జర్మనీకి (Germany) చెందిన ఓ వ్యక్తి కేవలం 29 నెలల వ్యవధిలో 217 సార్లు కోవిడ్ టీకా తీసుకున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. వైద్యుల సలహాలను పట్టించుకోకుండా ఓ 62 సంవత్సరాల వ్యక్తి వరుసగా టీకాలు తీసుకున్నాడట. అన్ని సార్లు టీకాలు తీసుకున్నా అతడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు. తాజాగా ఆ విషయం బయటపడడంతో ఎర్లాంజెన్-న్యూరెంబర్గ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అతడి నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తున్నారు. టీకాలకు రోగనిరోధక వ్యవస్థ ఎలా ప్రతిస్పందిస్తోందనే విషయాన్ని నిర్ధారించడానికి ఆ వ్యక్తి రక్తాన్ని, లాలాజలాన్ని సేకరించారు.
పదేపదే టీకాలు తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థలోని కొన్ని కణాలు క్రియాశీలతను కోల్పోతాయి. కానీ ఆశ్చర్యకరంగా ఈ జర్మన్ వ్యక్తిలో అలాంటి లక్షణాలేవీ కనిపించలేదని పరిశోధకులు గుర్తించారు. అలాగే ఆయన ఎప్పుడూ కోవిడ్ బారినపడిన లక్షణాలను కూడా గుర్తించలేదు. ఇంకో విశేషమేమిటంటే ఇన్ని సార్లు టీకాలు తీసుకున్నా ఆ వ్యక్తి ఒక్కసారి కూడా జ్వరం బారిన పడలేదు. కాగా, 217 సార్లు టీకాలు ఇచ్చారనే విషయంపై మాగ్డెబర్గ్ నగర పబ్లిక్ ప్రాసిక్యూటర్ విచారణ ప్రారంభించారు. ఇప్పటివరకు అతడిపై అభియోగాలేవీ నమోదు చేయలేదు.