Viral: వీడసలు తండ్రేనా!? కొడుకు పాడు పని చేస్తుంటే వారించకుండా..మొబైల్ ఫోన్‌లో రికార్డు చేసి..
ABN , Publish Date - Feb 05 , 2024 | 02:49 PM
ఏడేళ్ల వయసున్న కుర్రాడు కుక్క పిల్లను 20 అడుగుల ఎత్తు నుంచి కింద పడేస్తే పక్కనే ఉన్న తండ్రి ఘటనను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. నోయిడాలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆ కుర్రాడి వయసు జస్ట్ ఏడేళ్లు! మంచీచెడూ తెలీని వయసులో ఆ బాలుడు ఓ కుక్క పిల్లను చంపేందుకు ప్రయత్నిస్తుంటే పక్కనే ఉన్న తండ్రి అడ్డుపడకపోగా మరింత నీచానికి ఒడిగట్టాడు. బాలుడు చేస్తున్నదంతా రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఉన్నత విద్యావంతుడై ఉండి కూడా ఇంతటి దారుణానికి తెగబడ్డ ఆ తండ్రిపై ప్రస్తుతం నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నోయిడాలోని గౌర్ సిటీలో ఫిబ్రవరి 2న ఈ దారుణం వెలుగు చూసింది (7-year-old boy throws puppy from 20 feet in Noida).
స్థానిక ఎవెన్యూ సొసైటీలో ఉంటున్న ఓ బాలుడు పొదల్లో ఉన్న ఓ కుక్క పిల్లను బలవంతంగా బయటకు తీసుకొచ్చాడు. దానితో కాసేపు ఆడుకుని ఆ తరువాత బేస్‌మెంట్ ర్యాంప్‌పై నుంచి 20 ఫీట్‌ల కిందకు పడేశాడు. పక్కనే ఉన్న తండ్రి ఇదంతా చూస్తూ కూడా కొడుకుని ఆపకపోగా అత్యంత కిరాతకంగా వీడియో రికార్డు. ఆ తరువాత ఉన్మాదిలా ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ దారుణం గురించి తెలిసి పీపుల్స్ ఫర్ యానిమల్స్ సంస్థ వాలంటీర్ ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు బాలుడి తండ్రిపై కేసు నమోదు చేశారు. అంత ఎత్తు నుంచి పడ్డ కుక్కపిల్ల చనిపోయిందని కొందరు అంటున్నా పోలీసులకు దాని కళేబరం మాత్రం లభించలేదు.
కేసు గురించి తెలియగానే సొసైటీ వాళ్లు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. కుక్కలను సొసైటీ నుంచి బయటకు తరిమేసేందుకు ప్రయత్నించారు. ఈలోపు ప్రియాంక అనే స్థానిక మహిళ వారిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. రోజూ కుక్కలకు ఆహారం పెట్టే ఆమె..సొసైటీ వాళ్లు చేస్తున్నది తప్పని గట్టిగా వాదించింది. మున్సిపాలిటీ అధికారులు మినహ పౌరులు ఊర కుక్కలను ఇలా తరలించడం తప్పని చెప్పింది. ఈ క్రమంలో వారి మధ్య ఘర్షణ తలెత్తడంతో ఆమెపై సొసైటీలోని కొందరు మహిళలు చేయిచేసుకున్నట్టు కూడా తెలిసింది.
నోయిడా ప్రాంతంలో వీధి కుక్కల బెడద కారణంగా తరచూ వివాదాలు తలెత్తుతున్నాయని జాతీయ మీడియా చెబుతోంది. రెసిడెన్షియల్ ప్రాంతాల్లో వీధి కుక్కలు ఉండకూడదని కొందరు వాదిస్తుంటే జంతు ప్రేమికులు మాత్రం ఈ వాదనను తిరస్కరిస్తున్నారు.