Share News

హైటెక్‌ హంగులతో..

ABN , Publish Date - Feb 11 , 2024 | 03:51 PM

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అమృత్‌ భారత్‌ కింద నగరంలోని నాంపల్లి, హైటెక్‌సిటీ, హఫీజ్‌పేట, మలక్‌పేట, మల్కాజిగిరి, ఉప్పుగూడ రైల్వేస్టేషన్లను హైటెక్‌ హంగులతో తీర్చిదిద్దుతున్నారు.

హైటెక్‌ హంగులతో..

  • నగరంలో ఆరు రైల్వేస్టేషన్ల అభివృద్ధి

  • ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాల కల్పన

  • స్థానిక కళలు, సంస్కృతి ఉట్టిపడేలా మాస్టర్‌ప్లాన్‌

  • ‘అమృత్‌ భారత్‌’ కింద రూ.453 కోట్లు కేటాయింపు

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అమృత్‌ భారత్‌ కింద నగరంలోని నాంపల్లి, హైటెక్‌సిటీ, హఫీజ్‌పేట, మలక్‌పేట, మల్కాజిగిరి, ఉప్పుగూడ రైల్వేస్టేషన్లను హైటెక్‌ హంగులతో తీర్చిదిద్దుతున్నారు. మొదటి దశలో ఎంపికైన ఈ ఆరు స్టేషన్ల అభివృద్ధికి రూ.453 కోట్లను కేటాయించారు. ప్రయాణికుల కోసం ఆధునిక సౌకర్యాలతో పాటు ట్రాఫిక్‌ సర్క్యులేషన్‌, ఇంటర్‌ మోడల్‌ ఇంటిగ్రేషన్‌, ల్యాండ్‌స్కేపింగ్‌, స్థానిక కళలు, సంస్కృతి ఉట్టిపడేలా మాస్టర్‌ప్లాన్‌తో అభివృద్ధి చేస్తున్నారు. ఆధునిక ఆర్కిటెక్చర్‌, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్న ఈ స్టేషన్లు.. భవిష్యత్తులో సిటీసెంటర్స్‌గా మారుతాయని రైల్వే ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేలా అభివృద్ధి చేస్తున్నారు. అమృత్‌ భారత్‌ స్టేషన్ల అభివృద్ధిని అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్నారు.

ఈ అమృత్‌ భారత్‌ స్టేషన్‌ స్కీమ్‌ కింద ఎంపిక చేసిన రైల్వేస్టేషన్లలో మందుగా అనవసరమైన నిర్మాణాలను తొలగించడం, మెరుగైన లైటింగ్‌, మెరుగైన సర్క్యులేటింగ్‌ ప్రాంతం, అప్‌గ్రేడ్‌ చేసిన పార్కింగ్‌ స్థలం, దివ్యాంగులకు అనుకూలమైన మౌలిక వసతులు, గ్రీన్‌ ఎనర్జీని ఉపయోగించడం ద్వారా పర్యావరణ అనుకూలంగా స్టేషన్‌లను డిజైన్‌ చేస్తున్నారు. ఇలా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని మొత్తం 50 రైల్వే స్టేష్లన్లను అమృత్‌భారత్‌ పథకం కింద అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో తెలంగాణలో 21 స్టేషన్లు, ఆంధ్రప్రదేశ్‌లో 15, మహారాష్ట్రలో 13, కర్ణాటకలో ఒకస్టేషన్‌ చొప్పున ఉన్నాయి. గతేడాది ఆగస్టు 6న ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా అమృత్‌భారత్‌ రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆయా రైల్వేస్టేషన్‌లను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రైల్వేస్టేషన్లను ఆధునీకరించడంతో పాటు దీర్ఘకాలిక దృష్టితో నిరంతర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని పనులు చేస్తున్నారు. పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు తగినట్లుగా రైల్వేస్టేషన్‌లను అభివృద్ధి పరిచేలా కీలక అంశాలతో మాస్టర్‌ప్లాన్‌ రూపొందించారు.

స్టేషన్‌ వారీగా నిధులు(రూ. కోట్లలో)

నాంపల్లి - 309

హైటెక్‌సిటీ - 26.60

హఫీజ్‌పేట్‌ - 26.60

మలక్‌పేట్‌ - 36.44

మల్కాజిగిరి - 27.61

ఉప్పుగూడ - 26.81

మొత్తం - 453.06

Updated Date - Feb 15 , 2024 | 08:12 AM