Share News

అక్కచెల్లెమ్మలకు అన్యాయం

ABN , Publish Date - Apr 25 , 2024 | 04:32 AM

అక్కాచెల్లెమ్మలకు సంక్షేమం పేరిట అందింది అంతంతే.. కానీ, పన్నులు, చార్జీలు, కరెంటు బిల్లులు, పెంచిన మద్యం ధరల రూపంలో వారి నుంచి తిరిగి లాక్కుంది ఎంతెంతో! ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి లాంటి కీలక పదవులు ఇవ్వడమే వారి సాధికారత పట్ల తమకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకొంటున్నారు. అలాగే క్షేత్రస్థాయిలో 50 శాతం పదవుల్లో వారిని నియమించామని సీఎం జగన్‌ ప్రతి సభలో అంటుంటారు. కానీ, హోంమంత్రిగా కనీసం ఒక్క డీఎస్పీని అయినా స్వయంగా బదిలీ చేసుకునే అధికారం వారికి ఉందా? పదవులు వీరికి.. పెత్తనం వారికి అన్నట్టు వ్యవహారాలు నడిపిస్తున్నారు.

అక్కచెల్లెమ్మలకు అన్యాయం

అక్కచెల్లెమ్మలకు

అన్యాయం

అక్కాచెల్లెమ్మలకు సంక్షేమం పేరిట అందింది అంతంతే.. కానీ, పన్నులు, చార్జీలు, కరెంటు బిల్లులు, పెంచిన మద్యం ధరల రూపంలో వారి నుంచి తిరిగి లాక్కుంది ఎంతెంతో! ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి లాంటి కీలక పదవులు ఇవ్వడమే వారి సాధికారత పట్ల తమకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకొంటున్నారు. అలాగే క్షేత్రస్థాయిలో 50 శాతం పదవుల్లో వారిని నియమించామని సీఎం జగన్‌ ప్రతి సభలో అంటుంటారు. కానీ, హోంమంత్రిగా కనీసం ఒక్క డీఎస్పీని అయినా స్వయంగా బదిలీ చేసుకునే అధికారం వారికి ఉందా? పదవులు వీరికి.. పెత్తనం వారికి అన్నట్టు వ్యవహారాలు నడిపిస్తున్నారు. చంద్రబాబు హయాంలో సొంతకాళ్లపై మహిళలు నిలబడేందుకు దోహదపడిన డ్వాక్రాలకు...ఇప్పుడు దిక్కులేని పరిస్థితి! జగన్‌ ప్రచార సభలకు ‘తరలే’ ప్రేక్షక సైన్యంగా వారిని దిగజార్చివేశారు.

  1. సంక్షేమం అంతంత..గుంజింది ఎంతెంతో..

  2. బాబు హయాంలో 30ఏళ్లు దాటితే పెన్షన్‌

  3. దాన్ని 50ఏళ్లు చేసి..2లక్షలమందికి కోత

  4. అమ్మఒడిపై నాడు కోతలు.. ఆపై ఎడాపెడా కొర్రీలు

  5. పేరుకే 50శాతం పదవులు.. పెత్తనం పెద్దలకు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

మహిళలకు రూ.రెండున్నర లక్షల కోట్లతో సంక్షేమం అందించామని జగన్‌ ఊరూవాడా డప్పు కొడుతుంటారు. ‘నాఅక్కాచెల్లెమ్మలు...’ అంటూ సభల్లో, తన పత్రిక, చానల్‌కు ఇచ్చే ప్రకటనల్లో ఊదరగొడుతుంటారు.

కానీ, జగన్‌ అధికార పీఠం ఎక్కిన తర్వాత మహిళలకు ఇచ్చింది గోరంత.. అనేక రూపాల్లో గత ఐదేళ్లలో వారినుంచి పిండుకుంది కొండంత. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం మహిళల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలతో పోలిస్తే జగన్‌ చేసింది మోసకారి సంక్షేమమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఇంటర్‌ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలయ్యేది. ప్రతిభా అవార్డుల కింద ఇంటర్‌ విద్యార్థులకు ల్యాప్‌టా్‌పలు, రూ.20 వేలు, బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌లో డే స్కాలర్స్‌కు రూ.20 వేలు, హాస్టల్‌ విద్యార్థులకు రూ.40 వేలు అందేవి.

ఇవన్నీ జగన్‌ పాలనలో రద్దయిపోయాయి. ఒకటి నుంచి ఇంటరు వరకు అందరికీ ‘అమ్మఒడి’యే మిగిలింది. అందులోనూ కొర్రీలు, ఇచ్చే నగదులో కోతలతో అమ్మలను వంచిస్తున్నారు. ఆనాడు చంద్రన్న పెళ్లికానుక పేరుతో బీసీ యువతకు రూ.35 వేలు, కాపులకు రూ.30 వేలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.50 వేలు, కులాంతర వివాహాలకు రూ.75 వేలు అందించారు.

ఆడపిల్లలకు పెళ్లి చేసి మెట్టినింటికి పంపడంలోని తల్లిదండ్రుల కష్టాన్ని కొంతైనా తగ్గించగలిగారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన తొలి నాలుగేళ్లు ఈ పథకం కింద నిధులు ఇవ్వలేదు. చివరి ఏడాది అదీ ఎన్నికలకు ముందు వైఎ్‌సఆర్‌ పెళ్లికానుక అమల్లోకి తెచ్చారు. షరామామూలుగానే ఈ పథకానికీ కొర్రీలు పెట్టారు. గతంలో లేని విద్యార్హతను ముందుకు తెచ్చి.. వధువు, వరుడు ఇద్దరు టెన్త్‌ పాస్‌ కావాలని నిబంధన పెట్టారు. తద్వారా లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేశారు.


చెల్లని పట్టాలు..

చంద్రబాబు ప్రభుత్వం 6 వేల ఎకరాల భూములు కొనుగోలు చేసి మహిళలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. వారిని గృహలక్ష్మిలను చేసింది. జగన్‌ ప్రభుత్వం తొలినుంచీ ‘అక్కాచెల్లెమ్మ’లను పీక్కుతినడమే పనిగా పెట్టుకుంది.

పేదలు ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుని కట్టుకున్న ఇళ్లకు శాశ్వత పట్టాలు ఇస్తానంటూ ‘ఓటీఎస్‌’ విధానం తెచ్చింది. దీని ప్రకారం ఒక్కో కుటుంబం నుంచి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు బలవంతపు వసూళ్లు జరిపింది. ఇలా దాదాపు ఏడు లక్షలమంది నుంచి రూ. కోట్లు రాబట్టింది.

డబ్బులు కట్టిన అందరికీ ‘పట్టాలు’ ఇవ్వలేదు. కానీ, ఇచ్చిన కొంతమందికైనా అవి ‘చెల్లని పట్టాలు’గా మిగిలిపోయాయి. ఈ పట్టాలపై జగన్‌ ఫొటోలు, నవరత్నాల లోగో ఉండటంతో వాటిని తాకట్టు పెట్టుకుని రుణాలు ఇవ్వలేం అని బ్యాంకులు తేల్చేశాయి. దీంతో పేద మహిళలు అన్నివిధాలుగా మోసపోయారు.

మరోవైపు అడగనివారికి, అవసరం లేనివారికి సైతం అమరావతి రాజధానిలో దాదాపు 50 వేల మందికి చెల్లని పట్టాలిచ్చి ప్రచారం చేసుకున్నారు. అంచలంచెలుగా మద్యాన్ని పైవ్‌స్టార్‌ హోటళ్లకే పరిమితం చేస్త్తామని గత ఎన్నికల్లో జగన్‌ హామీ ఇచ్చారు. ఇప్పుడుచూస్తే, గ్రామాల్లో కూడా ఫైవ్‌స్టార్‌ హోటల్‌ మందురేట్లు పెట్టి పేద, మధ్య తరగతి కుటుంబాలను ఆర్థికంగా పతనం చేశారు. కాంట్రాక్టు పనులు, సరఫరా కాంట్రాక్టుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ జగన్‌ చేసిన చట్టాలు...ఎక్కడా అమలు కాలేదు. అదే విధంగా స్థానిక పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలివ్వాలన్న చట్టం కూడా నీరుగారిపోయింది.


అర్హులకు దక్కని ఆసరా

జగన్‌ తెచ్చిన అన్ని పథకాల్లాగానే ఆసరా పథకం కూడా లోపభూయిష్టంగా మారింది. సుమారు 25 శాతం పైగా అసలైన లబ్ధిదారులకు ఆ ఫలాలు అందలేదు. 2019 ఏప్రిల్‌ నాటికి బ్యాంకుల్లో రుణాలు పొంది తిరిగి చెల్లించిన వారికి ఆసరా ప్రయోజనాలను అందిస్తామని జగన్‌ ప్రభుత్వం చెప్పింది.

ఆ మేరకు నిబంధనలు రూపొందించింది. అయితే అప్పటికే డ్వాక్రా గ్రూపుల పరిస్థితి మారిన విషయం జగన్‌ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో చిక్కుముడులు పడ్డాయి. సభ్యుల మధ్య, లీడర్ల మధ్య అనైక్యత, వారు బ్యాంకులనుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించే క్రమంలో వచ్చిన వివాదాలతో డ్వాక్రా గ్రూపులు చిన్నాభిన్నమయ్యాయి. ఆయా డ్వాక్రా గ్రూపుల నుంచి బయటకు వెళ్లిన సభ్యుల స్థానంలో కొత్త సభ్యులను సెర్ప్‌ అధికారులు చేర్చారు.

కొన్ని చోట్ల 60 ఏళ్లు దాటిన డ్వాక్రా సభ్యులను తొలగించి వారి స్థానంలో కొత్త సభ్యులను చేర్చారు. దీంతో డ్వాక్రా గ్రూపులన్నీ పాత, కొత్త గ్రూపు సభ్యులతో మిళితమయ్యాయి. 2019కు ముందు బ్యాంకుల నుంచి రుణాలు పొంది ఆయా గ్రూపుల నుంచి బయటకు వెళ్లిన సభ్యులకు అప్పట్లోనే తీర్మానాలు రూపొందించి వారికి ఆసరా అందించాలని తీర్మానాలు చేశారు.

ఆయా తీర్మానాలు బ్యాంకుల్లో కూడా ఇచ్చారు. అంటే అప్పట్లో రుణాలు పొందిన డ్వాక్రా సభ్యులకే ఆసరా నిధులు అందాలి. పలు డ్వాక్రా సంఘాల్లో పలు కారణాలతో ఖాళీ అయిన స్థానాల్లో కొత్త సభ్యులను చేరుస్తూ సెర్ప్‌ సిబ్బంది, వైసీపీ నేతలు పావులు కదిపారు. ఈ క్రమంలో కొత్త సభ్యులుగా తమ అనుయాయులను చేర్చుకున్నారు. పాత గ్రూపు సభ్యులకు ఇవ్వాల్సిన ఆసరా ప్రయోజనం కొత్త సభ్యులకు అందేలా పైరవీలు సాగించారు. బ్యాంకులకు మాత్రం పాత సభ్యులకే ఆసరా అందిస్తున్నట్లు తీర్మానాలు ఇచ్చి....ఆసరా నిధులను చాలాచోట్ల కొత్త సభ్యులకు అందించారు.

Updated Date - Apr 25 , 2024 | 04:33 AM