Share News

నిద్రలో ‘నిఘా’

ABN , Publish Date - Feb 06 , 2024 | 03:43 PM

నగరం చుట్టూ విస్తరించి ఉన్న పరిశ్రమల నుంచి విడుదలవుతున్న వ్యర్థాలు అమాయక ప్రజల ఉసురు తీస్తున్నాయి.

నిద్రలో ‘నిఘా’

  • చెరువులు, నాలాల్లోకి రసాయన, ఇతర వ్యర్థాలు

  • గుట్టుచప్పుడు కాకుండా రాత్రిళ్లు పారబోత

  • ఆదమరిచి నిద్రించే వేళ సాగుతున్న దందా

  • కలుషితమవుతున్న గాలి, భూగర్భ జలాలు

  • విష వాయువులతో పరీవాహక ప్రజల తిప్పలు

  • చోద్యం చూస్తున్న పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు

  • వ్యర్థాల డంప్‌తో ప్రజారోగ్యానికి పెనుముప్పు

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): నగరం చుట్టూ విస్తరించి ఉన్న పరిశ్రమల నుంచి విడుదలవుతున్న వ్యర్థాలు అమాయక ప్రజల ఉసురు తీస్తున్నాయి. నిబంధనలు పాటించకుండా.. ఆయా కంపెనీలు కాలుష్యాన్ని వెదజల్లుతుంటే, అడ్డుకట్ట వేయాల్సిన పీసీబీ అధికారులు చోద్యం చూస్తున్నారు. పరిశ్రమల నుంచి వెలువడిన వ్యర్థాలను ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లకు తరలించి శుద్ధి చేయాల్సి ఉండగా, కొన్ని సంస్థలు ట్యాంకర్ల ద్వారా తరలించి నిర్జన ప్రదేశాల్లో డంప్‌ చేస్తున్నారు. ఆదమరిచి నిద్రించే వేళలో పలు కంపెనీలు విష వాయువులను విడుదల చేస్తుంటే, మరికొన్ని రసాయన వ్యర్థాలను నాలాల్లో, చెరువుల్లోకి వదిలుతుంటే కొన్ని పరిశ్రమలు మాత్రం అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీల నిర్మాణం చేపట్టి ఎవరికీ కనబడకుండా నాలాల్లోకి వ్యర్థాలను వదులుతున్నారు.

చివరికి చెరువుల్లోకి ..

విస్తరిస్తున్న నగరం చుట్టూ ఉన్న రసాయన పరిశ్రమలు, ఫార్మా సంస్థలు, కెమికల్‌ ఫ్యాక్టరీలు నిబంధనలు పాటించని కారణంగా ఆయా పారిశ్రామిక వాడలు నీటి కాలుష్యం, వాయు కాలుష్యంతో, దుర్వాసనలు వెదజల్లుతూ నరకాన్ని తలపిస్తున్నాయి. ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న వ్యర్థాలను నాలాల్లోకి, డ్రైనేజీలోకి పంపుతున్నారు. అక్కడి నుంచి నాలాల నుంచి సరూర్‌నగర్‌ చెరువు, హుస్సేన్‌సాగర్‌, మూసీ నదుల్లోకి చేరుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే అంతంత మాత్రమే ఉన్న భూగర్భ జలాలు కలుషితమై తాగునీటికి కటకటలాడాల్సి వస్తుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విచ్చలవిడిగా డంపింగ్‌

నిబంధనలు పాటించని పరిశ్రమల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాల్సిన పీసీబీ(పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు) అధికారులు చోద్యం చూస్తుండటంతో కాలుష్య వ్యర్థాలు రోడ్లపైనే ప్రవహిస్తున్నాయి. రసాయనాలు డంప్‌ చేస్తున్న ట్యాంకర్లను స్థానికులు గుర్తించి సమాచారమందించినా, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో డంపింగ్‌ మాఫియా చెలరేగిపోతోంది. రాత్రి సమయంలో కెమికల్‌ డంపింగ్‌పై నిఘా పెట్టాల్సిన పీసీబీ నిఘా విభాగం కొన్నేళ్లుగా కదలికలు లేకుండా పోవడంతో నిత్యం ఏదో ఓ ప్రాంతంలో రసాయన వ్యర్థాల డంపింగ్‌ జరుగుతోంది.

విషవాయువుల ఘాటుతో..

జీడిమెట్ల పారిశ్రామిక వాడ నుంచి చింతల్‌ మీదుగా ప్రవహించే నాలాలో రసాయన వ్యర్థాలు కలపుతుండడంతో నాలా దుర్గంధం వస్తోంది. సనత్‌నగర్‌ పారిశ్రామిక వాడలో పరిశ్రమల వ్యర్థాలు డ్రైనేజ్‌లో డంప్‌ చేయడంతో, రసాయనాల గాఢతతో మంటలు చెలరేగాయి. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో నిర్జన ప్రదేశంలో రసాయన వ్యర్థాలను డంప్‌ చేస్తున్న ట్యాంకర్‌ను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు ట్యాంకర్‌ను సీజ్‌ చేసి పోలీస్టేషన్‌కు తరలించారు. పీసీబీ, టీఎ్‌సఐఐసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నర్సాపూర్‌ ప్రధాన రహదారి నిత్యం విషవాయువుల ఘాటుతో నిండిపోతుంది. హెటిరో డ్రగ్స్‌, ఆరోరా ఫార్మా జీడిమెట్ల ప్రధాన రహదారి పక్కనే విషపూరిత రసాయనాలు కాలువలై ప్రవహిస్తున్నా.. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారు.

ప్లాస్టిక్‌ వ్యర్థాలు చేపలు మృత్యువాత

జల్‌పల్లి చెరువుకు సమీపంలో ఉన్న ప్లాస్టిక్‌ పరిశ్రమ నుంచి వెలువడుతున్న వ్యర్థాలను నేరుగా చెరువులోకి పంపుతున్నారు. దీని కారణంగా చెరువు నీరు కలుషితమై, చేపలు చనిపోతున్నాయి. జల్‌పల్లి పెద్ద చెరువులో సర్వేనెంబర్‌ ఐదులో ఉన్న చెరువుకు అనుకొని ఉన్న ఈ ప్లాస్టిక్‌ పరిశ్రమలో ప్లాస్టిక్‌ను రసాయానాలతో శుద్ధిచేసి వ్యర్థ జలాలను చెరువులో విడిచిపెడుతున్నారు. అలాగే ఆ పక్కనే ఉన్న ఆర్‌ఆర్‌ మసాల పరిశ్రమల నుంచి కూడా వ్యర్థాలు ఆ చెరువులోకి చేరుతున్నాయి. దీంతో అందులోని చేపలు మృతి చెందుతున్నాయి. నీరు కలుషిత ం అవుతున్నాయని మత్స్యసంఘాల ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. అయినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.

Updated Date - Feb 07 , 2024 | 08:03 AM