Share News

అక్రమాలకు ‘స్పెషల్‌’

ABN , Publish Date - Jan 17 , 2024 | 03:54 PM

మూడు కమిషనరేట్ల పరిధిలోని స్పెషల్‌ బ్రాంచ్‌ (ఎస్‌బీ) సిబ్బంది పనితీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అక్రమాలకు ‘స్పెషల్‌’

  • మాకు మీరు.. మీకు మేము

  • సీఐలు, ఎస్‌ఐలతో ఎస్‌బీ సిబ్బంది దోస్తీ

  • అక్రమాలు, అవినీతిలో వాటాలు

  • ఉన్నతాధికారులకు తప్పుడు రిపోర్టులు

  • కోట్లు పోగేసుకుంటున్న వైనం

  • ఏళ్లతరబడి ఒకేచోట పోస్టింగ్‌

  • మూడు కమిషనరేట్లలోనూ ఇదే పరిస్థితి

  • త్వరలో ప్రక్షాళనకు రంగం సిద్ధం ?

హైదరాబాద్‌ సిటీ, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): మూడు కమిషనరేట్ల పరిధిలోని స్పెషల్‌ బ్రాంచ్‌ (ఎస్‌బీ) సిబ్బంది పనితీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏళ్ల తరబడి ఒకే పోస్టింగ్‌లో తిష్టవేసి అక్రమాలు, అన్యాయాలకు జీ హుజూర్‌ చెబుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులతో మిలాఖత్‌ అవుతూ దర్జాగా వాటాలు పంచుకుంటున్నారు. అక్రమాల సంగతులు ఉన్నతాధికారులకు తెలియకుండా తప్పుడు రిపోర్టులు పంపిస్తున్నారు. ఇటీవల మూడు కమిషనరేట్లకు కొత్త పోలీసు బాస్‌లు రావడం, విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉంటుండడంతో పలువురు సీఐలు, ఎస్‌ఐలు సస్పెండయ్యారు. అలాగే ఎస్‌బీ సిబ్బంది పనితీరును పసిగడుతూ వారి కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

అక్రమాలకు సైసై..

ప్రతి పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు, పోలీసు అధికారుల పనితీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నతాధికారులకు నివేదికలివ్వడం స్పెషల్‌ బ్రాంచ్‌ (ఎస్‌బీ) సిబ్బంది విధి. కమిషనరేట్‌ పరిధిలో చీమ చిటుక్కుమన్నా వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలి. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులు, బాధితులతో పోలీస్‌ సిబ్బంది మాట్లాడుతున్న తీరు, కేసులు డీల్‌ చేస్తున్న విధానం, అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న వైనం ఇలా అన్నింటిని క్షుణ్ణంగా గుర్తించాలి. కానీ.. అధిక శాతం ఎస్‌బీ సిబ్బంది పనితీరు ఇందుకు భిన్నంగా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వచ్చిదాంట్లో వాటాలు

లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులతో కుమ్మక్కై, వారి అరాచకాలు, అక్రమాలు, అడ్డగోలు దందాలకు కొందరు ఎస్‌బీ సిబ్బంది అండగా నిలుస్తున్నారు. ఏళ ్లతరబడి ఒకేచోట పోస్టింగ్‌లో కొనసాగుతూ అక్రమ సంపాదనకు రుచిమరిగి అందినకాడికి దండుకుంటున్నారు. వారు పనిచేస్తున్న స్టేషన్‌ లిమిట్స్‌లో దందాలు, అక్రమాలు, అరాచకాలు, పోలీసుల సెటిల్‌మెంట్లు జరుగుతున్నా చూసీచూడనట్లు వ్యవహరిస్తూ పోలీస్‌ ఉన్నతాధికారులకు ఎలాంటి రిపోర్టులు ఇవ్వడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా రాచకొండ, సైబరాబాద్‌, హైదరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలోని పలు పోలీ్‌సస్టేషన్ల పరిధిలో ఏళ్ల తరబడి పాతుకపోయిన ఎస్‌బీ క్షేత్రస్థాయి అధికారులపై ఇలాంటి ఆరోపణలు బలంగా ఉన్నాయి.

ఆరోపణలు రాగానే హడావిడి..

పోలీస్‌ అధికారుల అక్రమాలు, అరాచకాల గురించి ఆరోపణలు బయటకొచ్చినా, ఏదైనా మీడియాలో కథనాలు వచ్చినా ఎస్‌బీ సిబ్బంది నానా హైరానా పడతారు. హడావిడిగా తెలిసిన వ్యక్తులందరికీ ఫోన్లు చేసి, ఏ ఇన్‌స్పెక్టర్‌..? ఎక్కడ అక్రమాలు జరిగాయి..? మీకు సమాచారం ఎలా వచ్చింది ? మాకు కూడా చెప్పండి అంటూ ఆరా తీస్తారు. అంతా తెలుసుకున్న తర్వాత అక్రమ అధికారులతో మిలాఖత్‌ అవుతారు. ఆరోపణలు అన్ని ఫేక్‌ అని, కావాలనే మీడియాలో రాశారని, ఎలాంటి ఆధారాలు లేవంటూ ఉన్నతాధికారులకు రిపోర్టు ఇచ్చి అక్రమార్కులకు కొమ్ము కాస్తున్నట్లు తెలిసింది. ఇటీవల రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని ఎల్‌బీనగర్‌ జోన్‌, మహేశ్వరం జోన్‌ పరిధిలోని కొందరు పోలీస్‌ అధికారులపై ఆరోపణలు వచ్చినా.. క్షేత్రస్థాయి ఎస్‌బీ అధికారులు మాత్రం తప్పుడు నివేదికలు ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఇటీవల బదిలీ అయిన సీపీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా అక్రమార్కులను వదిలేసినట్లు తెలిసింది. ఇదే అదునుగా తీసుకున్న క్షేత్రస్థాయి ఎస్‌బీ సిబ్బంది మరింత రెచ్చిపోయినట్లు తెలిసింది. ఎన్ని ఆరోపణలు వచ్చినా ‘మీకేం కాదు సార్‌.. మేం చూసుకుంటాం. మేము ఇక్కడ ఎస్‌బీలో ఉన్నంతవరకు మీపై ఎలాంటి రిపోర్టు వెళ్లకుండా చూసుకుంటాం. మీరు మమ్మల్ని చూసుకోండి’ అన్నట్లు స్థానిక పోలీసులకు భరోసా ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఫలితంగా కొందరు ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు అక్రమాలకు పూర్తిగా తెర తీసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో వెలుగులోకి వచ్చిన ఓ కానిస్టేబుల్‌ బాగోతం అందరికీ తెలిసిందే. దొంగల ముఠాకు నాయకత్వం వహిస్తూ.. పలు రాష్ట్రాల్లో దొంగతనాలు దోపిడీలు చేయిస్తున్న కానిస్టేబుల్‌కు ఒక టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌. డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఓ ఎస్సై పూర్తి సహకారం అందించారు. ఇంత జరుగుతున్నా ఎస్‌బీ అధికారులు పసిగట్టలేక పోయారు. హైదరాబాద్‌ సీపీకి విషయం తెలిసేంత వరకూ ఎస్‌బీ అధికారులకు కనీసం సమాచారం లేదు. ఆ తర్వాత సీపీ ఆదేశాలతో ఎస్‌బీ ఉన్నతాధికారులు రంగంలోకి దిగి కానిస్టేబుల్‌ అరాచకాలు, అతనికి సహకరిస్తున్న పోలీస్‌ సిబ్బంది గుట్టును రట్టు చేశారు.

త్వరలో ఎస్‌బీ సిబ్బంది ప్రక్షాళన

చాలా పోలీ్‌సస్టేషన్ల పరిఽధిలో ఎస్‌బీ అధికారులు, సిబ్బంది ఏళ్ల తరబడి ఒకే దగ్గర పనిచేస్తున్నారు. అక్రమ సంపాదనకు అలవాటుపడి అక్కడి నుంచి కదలకుండా పోస్టింగ్‌లు చేసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ విషయం పోలీస్‌ బాస్‌ల దృష్టికి రావడంతో ఏళ్ల తరబడి పాతుకుపోయిన క్షేత్రస్థాయి సిబ్బందిని ప్రక్షాళన చేసి విధినిర్వహణలో నమ్మకంగా ఉండే వారిని నియమించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైల మాదిరి 3 ఏళ్లకోసారి సిబ్బందిని మార్చేందుకు చర్యలు తీసుకోనున్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.

Updated Date - Jan 19 , 2024 | 07:47 AM